పూజలు వద్దు...న్యాయం చేయండి!
రెండున్నర, నాలుగు, ఐదు ఏళ్ల చిన్నారులను పాపలనే కదా అనాలి… ముద్దులొలికే, మాటలుకూడా రాని పాపాయిలు.. మరి ఆ రాక్షసులకు వాళ్లెందుకలా కనబడుతున్నారు… పాలుతాగి అమ్మ ఒళ్లోనో, నాన్న భుజం మీదో నిద్రపోవాల్సిన చిన్నారులు…. ఛిద్రమై పోయిన శరీరాలతో ఆసుపత్రుల్లో రాలిపోయిన మొగ్గల్లా ఎందుకు పడి ఉన్నారు తన చిన్నారికి చిన్న ఎదురుదెబ్బతగిలితేనే తట్టుకోలేని తల్లుల గుండెల్లో కోత పెడుతూ వారెందుకు గుక్కపెడుతున్నారు… రెండున్నరేళ్ల చిన్నారి… తన శరీరాన్ని అలా ఎందుకు చీల్చుతున్నారో తెలియని అభం శుభం […]
రెండున్నర, నాలుగు, ఐదు ఏళ్ల చిన్నారులను పాపలనే కదా అనాలి…
ముద్దులొలికే, మాటలుకూడా రాని పాపాయిలు..
మరి ఆ రాక్షసులకు వాళ్లెందుకలా కనబడుతున్నారు…
పాలుతాగి అమ్మ ఒళ్లోనో, నాన్న భుజం మీదో నిద్రపోవాల్సిన చిన్నారులు….
ఛిద్రమై పోయిన శరీరాలతో ఆసుపత్రుల్లో రాలిపోయిన మొగ్గల్లా ఎందుకు పడి ఉన్నారు
తన చిన్నారికి చిన్న ఎదురుదెబ్బతగిలితేనే తట్టుకోలేని తల్లుల గుండెల్లో కోత పెడుతూ
వారెందుకు గుక్కపెడుతున్నారు…
రెండున్నరేళ్ల చిన్నారి… తన శరీరాన్ని అలా ఎందుకు చీల్చుతున్నారో తెలియని
అభం శుభం ఎరుగని చిట్టితల్లి…
పాలుతాగే వయసులో తానెందుకు రక్తమోడుతుందో తెలియని పాపాయి….
ఊహించండి…ఆమె బాధని…ఒక్కక్షణం మనసులోకి తీసుకుని ఊహించండి…
మనం బాగా ఊహిస్తాం కదా….
మరో ఇరవై ఏళ్లకు మన భారతదేశం ఎక్కడికో వెళ్లిపోతుందని ఊహిస్తున్న వాళ్లం
ఆర్థికాభివృద్ధితో మన జీవితాలు మారిపోతాయని ఊహిస్తున్న వాళ్లం
వాళ్లూ, వీళ్లూ… ఎవరెవరో వచ్చి మనల్ని బహుబాగా పరిపాలించేస్తారని ఊహిస్తున్నవాళ్లం
ఒక్కసారి ఆ చిన్నారుల పరిస్థితిని ఊహిద్దాం…వారి గొంతుల నుండి రాలేని ప్రశ్నలను ఊహిద్దాం…
ఒక విధ్వంసాన్ని అనుభవించడం కోసమేనా మేమిక్కడ పుట్టింది అని
ఆ పాపాయిలు అడిగితే మన ఊహల్లో కూడా దొరకని సమాధానాన్ని ఊహిద్దాం
రెండేళ్లపాపాయి నుండి కూడా సుఖం పొందాలనుకుంటున్న మృగాన్ని (మృగమా క్షమించు)
ఈ ప్రపంచం మొత్తం మానవతా సునామీలా పొంగి ఎందుకు ముంచేయడం లేదు
అనుక్షణం ఆడపిల్ల వెంట ఓ కామవాంఛ మరణ మృదంగం మోగిస్తుంటే
మనమంతా రాజకీయాలు, పూజలు, పుణ్యాలు, సినిమాలు, నాటకాలు,
వ్యాపారాలు, ఎగుమతులు, దిగుమతులు, ఉద్యోగాలు…
చివరికి వండుకోవడం, తినడం కూడా మానేసి
వాళ్లకో సురక్షిత ప్రపంచాన్ని ఎందుకు సృష్టించడం లేదు…
వాళ్ల ప్రాణాలకంటే ఎక్కువైనవి ఏమున్నాయి మనకు
పిల్లలంటే దేశానికి భవిష్యత్తు, సమాజానికి ఆస్తే కదా….
లేకపోతే… ఆడపిల్లలు కనుక అప్పు అనుకుంటున్నారా…
అసలు మనకు పిల్లలంటే లెక్కలేదా…
పిల్లలపై విరుచుకుపడుతున్న వికృత పిశాచాల మీద అసహ్యం లేదా…కోపం లేదా…
కనీసం ఆ రాక్షస వాంఛ స్థాయిలో అయినా… మనలో దాన్ని అణచివేయాలనే కాంక్ష లేదా…
క్రోధం లేదా…ఆక్రోశం లేదా…
గుక్కపెట్టే చిన్నతల్లులు న్యాయాన్నిపొందడంలోనూ మైనర్లేనా
దేశమంతా నవరాత్రుల్లో బాల, కన్య, కుమారీ…అంటూ చిట్టితల్లులను దేవతారూపాలుగా
ఆరాధిస్తోంది…కానీ వారికి దైవత్వం ఆపాదించనక్కర్లేదు…కనీసం మనుషులుగా న్యాయం దక్కనిద్దాం
ఢిల్లీ… మన పక్కనే ఉంది…
ఓ ఈ మెయిల్ దూరంలో…ఓ ఫోన్‌కాల్ దూరంలో…ఓ ఫేస్‌బుక్ పోస్టంత దూరంలో… ట్విట్టర్లో కామెంటంత దూరంలో…
ఢిల్లీలో అపస్మారస్థితిలో, ఛిద్రమైన శరీరాలతో బాధలు అనుభవిస్తున్న చిన్నారులు కూడా మనకెంతో దూరంలో లేదు….
వారు ఓ హెచ్చరికై, పెనుకేకై మన మనసుల్లో కెవ్వుమంటున్నారు
ఇక్కడ వంద అంతస్తుల భవంతులున్నాయి…
రాజ్యాంగాలు, చట్టాలు, చదువులు, డిగ్రీలు ఉన్నాయి
మేధోసంపత్తితో సృష్టిస్తున్న అణ్వాయుధాలున్నాయి…
ఆ రెండున్నరేళ్ల పాపాయి ఆనందంగా, సురక్షితంగా బతికేందుకు
ఈ విశాల ప్రపంచంలో స్థానమే లేకపోయింది…
చెట్టుమీద, పుట్టమీద, భూమిలో, పాతాళంలో, ఆకాశంలో అంతరిక్షంలో పరిశోధనలు చేస్తున్న
ఓ శాస్త్రవేత్తలారా…మీకో విన్నపం…
హృదయాలను శోధించండి…
స్త్రీ శరీరాలను తుత్తునియలు చేస్తున్న ఆ మృగవాంఛకు మూలమెక్కడో కనుక్కోండి…
రెండేళ్లపాపాయి చూస్తే….అలా అనిపించిన ఆ జుగుప్సాకరమైన జీవిపై పరిశోధనలు చేయండి
మానవత పూర్తిగా అడుగంటిన ఆ క్షణంలో…ఆ క్షణికావేశంలో పుట్టిన
ఆ హింసకు చిరునామా ఎక్కడుందో తెలుసుకోండి…
శోధించండి…ఓ సంక్లిష్టతకిప్పుడు సమాధానం కావాలి….
స్త్రీని చెడుగా చూస్తేనే కళ్లు పీకేసే చట్టాలే తెచ్చుకోవాలా…
స్త్రీ స్వేచ్ఛని చాపలో చుట్టేసి… ముళ్లకంచెల కట్టడే చేయాలా
నా క్లీవేజ్..నా ఇష్టం అంటున్న దీపికా పడుకొనేకి
ఇంకా నీకు మనిషిగా పూర్తి స్వాతంత్ర్యం రాలేదని చెప్పాలా…
మీరు కేవలం శరీరాలేనంటూ ఆడపిల్లలకు మరోసారి రాతియుగం నాటి హెచ్చరికలే చేయాలా…
మరేం చేద్దాం…ఈ భూమ్మీద ఆడపిల్లలకు
హాయిగా బతికే హక్కు ఎందుకులేదో…ఆ ఘాతుకానికి ఒడిగట్టినవారే కాదు…
మనమంతా సమాధానం చెప్పితీరాలి…
సమాధానం అంటూ ఉంటే…
లేకపోతే వెతకాలి…వెతికితీరాలి!!!
(ఢిల్లీలో రాక్షస గ్యాంగ్ రేప్‌కి గురయి చిత్రవధ అనుభవిస్తున్న రెండున్నరేళ్ల,
అయిదేళ్ల చిన్నారులకోసం…చెమర్చిన కళ్లతో)
-వడ్లమూడి దుర్గాంబ