రామాయణ కావ్యాన్ని చిత్రగానం చేసిన " పిలకా నరసింహమూర్తి దంపతులు
తెలుగువారు గర్వంగా ఇది నాది అని చెప్పుకునే రూపకళా వైభవం 'లేపాక్షి చిత్రకళ'. నేత్రరచన, వస్త్రధారణ, కేశాలంకరణ, ఆభరణాలు, వేషం, స్వభావాలలో ఒక్కొ రూపచిత్రం ఒక్కో విధానాన్ని చూపిస్తూ మొత్తం మీద కనులకు ఇంపుగా కనిపించే రాగమాలికలవి. అనంతపురం జిల్లాలోని హిందూపురం పట్టణానికి దగ్గరలో ఉన్న చిన్న పల్లె లేపాక్షి. దానికి ఆనుకునే ఉంది విరూపాక్ష నిర్మితమైన వీరభద్రేశ్వరుని దేవాలయం. ఆ దేవాలయ ప్రాంగణంలో పై కప్పుపై ఎన్నో అందమైన కళాకృతులు మనకు కనువిందు చేస్తాయి. కాలగతిలో […]
తెలుగువారు గర్వంగా ఇది నాది అని చెప్పుకునే రూపకళా వైభవం 'లేపాక్షి చిత్రకళ'. నేత్రరచన, వస్త్రధారణ, కేశాలంకరణ, ఆభరణాలు, వేషం, స్వభావాలలో ఒక్కొ రూపచిత్రం ఒక్కో విధానాన్ని చూపిస్తూ మొత్తం మీద కనులకు ఇంపుగా కనిపించే రాగమాలికలవి. అనంతపురం జిల్లాలోని హిందూపురం పట్టణానికి దగ్గరలో ఉన్న చిన్న పల్లె లేపాక్షి. దానికి ఆనుకునే ఉంది విరూపాక్ష నిర్మితమైన వీరభద్రేశ్వరుని దేవాలయం. ఆ దేవాలయ ప్రాంగణంలో పై కప్పుపై ఎన్నో అందమైన కళాకృతులు మనకు కనువిందు చేస్తాయి. కాలగతిలో చాలా వేగంగా కనుమరుగవుతున్న ఈ కుడ్య చిత్రాలకు పునర్జన్మ ప్రసాదించినవారిగా పిలకా నరసింహమూర్తి ప్రసిద్ధులు. 1948 వ సంవత్సరంలో లేపాక్షి మెమోరియల్ కమిటీ ఈ బాధ్యతను ఆయనకు అప్పజెప్పింది. దానితో ఆయన ఆ దేవాలయానికి వెళ్ళి, అక్కడ ఒక మంచెను నిర్మించుకొని, దానిపై వెల్లకిలా పడుకొని లేపాక్షి చిత్రకళా రూపురేఖలను ఒక కాగితంపై ట్రేస్ చేసి అక్కడ కనిపించే అదే రంగుల ఛాయలను ఉపయోగిస్తూ వాటన్నిటినీ యథాతథంగా పునఃలిఖించి, వాటిని ఆ కమిటీకి అందజేశారు. నరసింహమూర్తికి ముందు లేపాక్షి కుడ్యాలకు నకలుచేసిన వారు లేకపోలేదు. కానీ పిలకావారిది యథాతథ (Size to Size) చిత్రీకరణ. ఆ కమిటీ ద్వారా దేశంలోని ముఖ్య మ్యూజియమ్‌లకు వాటి ప్రతులు కొన్ని పంపబడ్డాయి. ఈ విధంగా తెలుగు వారి చిత్రకళా జైత్రయాత్రకు సారధ్యం వహించేవారాయన. ఈ కృషికి అప్పట్లో భారతీయ కళపై మక్కువ కలవాడు, కళావిమర్శకుడు అని పేరుగాంచిన జె.హెచ్.కజిన్స్ మన్ననలు పొందటం చాలా సహజంగా జరిగిపోయింది. చాలా క్లిష్టతరమైన ఈ కృషికి లభించిన గుర్తింపుతో మద్రాసు ప్రభుత్వం ఆయనను అడవి బాపిరాజుతో కలసి సిగిరియా బౌద్ధ గుహల చిత్రాలకు నకళ్ళు చేయడానికి పంపింది. ఆ తరువాత మద్రాసు రాష్ట్రంలో దేవాలయాలలో నిక్షిప్తమయిన చిత్రాలకు ప్రాచుర్యం కలిగించడం కోసం ఆ చిత్రాలకు ప్రతిరూపాలు తయారు చేయించడానికి నియమితులైనారు. పిలకావారు శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం, తిరువాయూర్, ఉత్తర ఆర్కాట్ జిల్లాలోని తిరుమలై, తిరునవ్వేలి జిల్లాలోని తిరువైరైపురం, కేరళలోని తిరుప్పారందోడి దేవాలయాలను దర్శించి ఆ దేవాలయంలోని చిత్రాలకు ప్రతిరూపాలు తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు.
ప్రకృతి నేసిన పచ్చదనాల పందిరి కోనసీమ (తూ||గో||జిల్లా). అక్కడి రాజోలు తాలూకాలోని బుట్టిలంకలో 1918లో జన్మించారు నరసింహమూర్తి. వారి ముత్తాత గౌతమీతీరాన పర్ణశాల నిర్మించుకొని జీవితాన్ని వెళ్ళమార్చుకున్న తపస్వి. తాతగారు నిత్యాగ్నిహోత్రి. తండ్రి సంస్కృత పండితుడు. తల్లి వీరు రెండు సంవత్సరాల వయస్సులో
ఉండగానే స్వర్గస్థులైనారు. వీరి అన్నగారైన పిలకా గణపతి శాస్త్రి జగమెరిగిన రచయిత. (విశాల నేత్రాలు, ప్రాచీన గాథాలహరి) చిన్నతనంలోనే చిత్రకళపై ఆసక్తి పెంచుకున్న వీరికి అప్పట్లో భారతి మాస పత్రికలో వచ్చిన చిత్రాలు ప్రేరణ కలిగించాయి. చిన్నతనంలోనే 'పాకిస్థాన్ పెయింటర్ లారియెట్' గా నియమించబడ్డ అబ్దుల్ రహమాన్ చుగ్‌తాయ్ చిత్రాలను కాపీ చేసేవారు. వీరి శృతి మించిన చిత్రకళాభిమానాన్ని గమనించిన స్కూలు టీచర్ తీవ్రంగా దండించటంతో బొబ్బలెక్కిన ఆయన చేతులు చూసిన అన్నలు తమ్ముని కళాభివేశాన్ని అర్థం చేసుకొని రాజమండ్రిలోని దామెర్ల రామారావు కళాశాలలో విద్యార్థిగా జేర్పించారు. అప్పటికాయన వయస్సు పధ్నాలుగు సంవత్సరాలు. అప్పుడే ఆయనకు మరొక ప్రముఖ చిత్రకారుడయిన మొక్కపాటి కృష్ణమూర్తితో పరిచయమేర్పడి, తరువాత బంధుత్వంలోకి దారి తీసింది.
మద్రాసు ఆర్ట్ కాలేజీకి ప్రిన్సిపాలుగా వున్న రాయ్ చౌదరి ఈయన చిత్రాలను చూసి ఈయనలోని సృజనను గ్రహించి పిలకావారిని మద్రాసు కాలేజిలో సీనియర్ బేచ్‌లో జేర్పించుకున్నారు. 1939 వ సంవత్సరంలో డిప్లమా పొందిన పిలకావారు, అదే సంవత్సరం తాను ఒకనాటి విద్యార్థిగా ఉన్న దామెర్ల రామారావు కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమితులైనారు. 1953వ సంవత్సరంలో చెెన్నపురి ఆంధ్రమహాసభ నిర్వహించిన భారతీయ కళా విభాగంలో బంగారు పతకాన్ని పొందారు. అమృతసర్‌లో నిర్వహించబడిన ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అసోషియేషన్ పోటీలో మరొక బంగారు పతకం బహుమతిగా అదే సంవత్సరం లభించింది. చిత్రకళలో తరువాతి కాలంలో దిగ్గజాలనిపించుకొన్న కె.సి.ఎస్.పణిక్కర్, సయ్యద్ అహ్మద్, ప్రొదోష్ దాస్ గుప్తా, సుశీల్ ముఖర్జీలు మద్రాసులో వీరి సహాధ్యాయులు. నరసింహమూర్తి నీటిరంగుల మాధ్యమంను ఇష్టపడతారు. కొన్ని చిత్రాలు చెక్కపై, బట్టపై వేసినా ఎక్కువ భాగం చిత్రాలు కాగితంపై నీటిరంగుతో వేసినవే. గోధుమ, పసుపు, ఎరుపులు ఆయన అభిమానించే సంప్రదాయ రంగులు. ఆయన చిత్రాలలో అజంతా, లేపాక్షి, తెలుగు జానపద శైలులు కొట్టొచ్చినట్లు కనిపించినా బెంగాలీ స్కూలు ప్రభావం కొంత లేకపోలేదు.
వీరి బాంధవ్యానికి నిదర్శనంగా కాబోలు ఈ దంపతులు రచించిన శ్రీరామపట్టాభిషేకం (5'x10′) ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో స్థానం సంపాదించింది. రాముని చిత్రాలేకాదు ప్రతి సంవత్సరం ఒక వినాయకుని చిత్రాన్ని గీయటం వీరు తమంత తాముగా ఏర్పరుచుకున్న ఒక సంప్రదాయం. ఇంతవరకూ యాభై చిత్రాలు గీశారు. పెద్ద పెద్ద చిత్రాలు గీయవలసి వచ్చినపుడు వాటిని నేలపై పరచి చిత్రరచన సాగిస్తారు. తిరుపతి గుడిలోని వెంకటేశ్వరుని మూలవిరాట్టును చిత్రించడానికి విజయలక్ష్మికి అవకాశం కల్పించబడింది. ఆమె భక్తి పారవశ్యంతో పాటలు పాడుకుంటూ చిత్రీకరణ సాగించి అందరి మన్ననలనూ పొందగలిగారు. అరుదైన ఆ అవకాశం తన పూర్వజన్మ సుకృతమంటారు ఆమె.
వీరి రామాయణ దృశ్యాలతో ఒక మ్యూజియమ్‌ను స్థాపించాలనుకున్న అనంతరామన్ కోర్కె ఇంకా నెరవేరలేదు. ఒకనాటి ప్రసిద్ధ చిత్రకారులయిన దామెర్ల, రాజాజీ, భగీరథ, కూల్డ్రే మొదలగు వారి చిత్రాలు రాజమండ్రిలోని దామెర్లవారి ఆర్ట్ గ్యాలరీలో, మరికొన్ని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రదర్శనకు నోచుకున్నాయి. మరి వందలకొద్ది చిత్రాలు వేసిన పిలకా దంపతుల సంగతేమిటి? వీరి చిత్రాలను మనం ఎక్కడ చూడగలుగుతాం? వీరి కళకు మనం ఇవ్వగలిగే నివాళి ఏమిటి? మన రాష్ట్రంలో ఇంకా ఎన్నో చిత్రకళా మ్యూజియమ్‌లు రావలసిన అవసరం ఉందనే సత్యాన్ని ఇది చాటి చెబుతుంది. సంప్రదాయ చిత్ర కళా రీతుల్లో వేసే ఇటువంటి చిత్రాలను రాష్ట్రం ప్రభుత్వం లేదా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థలు వీటిని తమ అధీనంలోకి తీసుకొని మనకళా సంపదను రాబోయే తరాలకు అందించవలసిన బాధ్యత ఉంది. ఇందులో మనమందరం పాలుపంచుకోవాలి.
పిలకానరసింహమూర్తి కీర్తిశేషులైనారు. విజయలక్ష్మి ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. వీరు వేసిన వందలాది చిత్రాలను అతి జాగరూకతతో భద్రపరచినవారు వీరి ఏకైక కుమార్తె విష్ణుప్రియ, అల్లుడు చిట్టి బాలసుబ్రహ్మణ్యం. పిలకావారి సంపూర్ణ రామాయణాన్ని మ్యూజియంలో చూసే అదృష్టం త్వరలోనే లభిస్తుందని ఆశిద్ధాం.
(సప్తపర్ణి నుంచి)
– కాండ్రేగుల నాగేశ్వరరావు