బతుకమ్మ పండుగ... తెలంగాణా వేడుక

జలసంబంధమైన పండుగ 'బతుకమ్మ' పండుగ ఒక్కటేనంటారు ఫొటో జర్నలిస్ట్‌ భరత్‌ భూషణ్‌. వానలు కురవగానే చెట్లు పచ్చబడి, పూలతో పరిమళించి మనసున్న మనుషుల హృదయాలకు జోలలు పాడుతాయి. అటువంటి కోవకు చెందినవి తంగేడు పూలు. ఈ పూలతోనే బతుకమ్మ బొమ్మలను అలంకరిస్తారు. ఆ పూలు పూసే సమయంలోనే ఈ పండుగ వస్తుంది.

Advertisement
Update:2015-10-04 00:32 IST

జలసంబంధమైన పండుగ 'బతుకమ్మ' పండుగ ఒక్కటేనంటారు ఫొటో జర్నలిస్ట్‌ భరత్‌ భూషణ్‌. వానలు కురవగానే చెట్లు పచ్చబడి, పూలతో పరిమళించి మనసున్న మనుషుల హృదయాలకు జోలలు పాడుతాయి. అటువంటి కోవకు చెందినవి తంగేడు పూలు. ఈ పూలతోనే బతుకమ్మ బొమ్మలను అలంకరిస్తారు. ఆ పూలు పూసే సమయంలోనే ఈ పండుగ వస్తుంది. ఇప్పుడు కాలం మారింది. ఋతువులు మారాయి. వర్షాలు వాటి ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాయి. అందుకని తంగేడులు పూయడం లేదు. బతుకమ్మ బొమ్మను అలంకరించడం లేదు.

అంతేకాదు విపరీతమైన జనారణ్యాలతో, గృహారణ్యాలతో నేల, నింగి నిండి పోతున్నాయి. ప్రకృతికి మానవుడు దూరమయ్యాడు. అందుకని ఆధునిక గృహాలు కాగితపు పూలు, ప్లాస్టిక్‌ మొక్కలు, పూలతో నిండిపోతున్నాయి. వీటి కోసం ఏ మధుపం ఝంకారం చేయడం లేదు. ఏ భ్రమరము పరిభ్రమించడం లేదు. తేనె కోసం తేనెటీగలు ముసరడం లేదు. ప్రకృతి శోభ పండడం లేదు.

ఈ పరిస్థితి 'బతుకమ్మ'కు తప్పలేదు. భర్తల బతుకు బాగుండాలని, దీర్ఘాయువు ఉండాలని కాంక్షించే బతుకమ్మ ప్రతిమే బండబారింది, ఎండువారింది. ప్రకృతిలో సహజంగా లభించే తంగేడు పూలు కరువయ్యాయి. ఫలితంగా కాగితం పూలు, ప్లాస్టిక్‌ పూలు బతుకమ్మకు ఆహార్యమవుతున్నాయి.

నాటి బతుకమ్మ పండుగలో ఉండే ప్రకృతి అభివ్యక్తీకరణ, తంగేడు పూల మృదుత్వం, మాధుర్యం, వర్ణ శోభ, ఆ మట్టి వాసనలు, తాజాతనం నేటి బతుకమ్మలో కరువయ్యాయి.

నేటి బతుకమ్మ నాటి బతుకమ్మ ఛాయ మాత్రమే.

అందుకే ప్రపంచ ప్రఖ్యాత ఫొటో జర్నలిస్ట్‌ భరత్‌భూషణ్‌ గత పది సంవత్సరాలుగా, యేటేట తెలంగాణాలోని వివిధ మారుమూల పల్లెలను బతుకమ్మ పండుగ రోజు దర్శించి, భావితరాలకు 'బతుకమ్మ' కమనీయ పుష్పాలంకృత ప్రతిమను అజరామరంగా అందించే ఉద్దేశంతో, తన అసమాన కెమేరా కళతో ఛాయా చిత్రాలుగా ఉంచి, తెలంగాణా పండుగ అయిన బతుకమ్మ పండుగకు అమృతత్వాన్ని ప్రసాదించారు. ఆయన ఈ పండుగను దాదాపు 30 కళాఖండాలలో బంధించారు.

వర్షాకాలం వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయింది. చలికాలం చెప్పా చెయ్యకుండా వచ్చి చక్కలిగింతలు పెడుతుంది. ఆశ్వయుజ మాసం శుక్ల పాడ్యమి, ఇంటింటా పండుగ వాతావరణం, కోడళ్ళు అత్తింటిని వదలి పుట్టిల్లు చేరారు. అమ్మతో, అమ్మమ్మతో, అక్కతో, చెల్లెళ్ళతో ఆప్యాయతలు, అనురాగాలు పంచుకుంటూ, వింతలూ విశేషాలతో ముచ్చట్లాడుతుంటే, ప్రేమానుబంధాల సారమే జీవితంగా అందరి ముఖాల్లో విప్పారిన ఒక వింత ఆనందంతో మెరిసిపోతుంది తెలంగాణం.

అసలు సిసలైన, ఖచ్చితంగా మనదైన, మనదే అయిన ముతక రంగులయిన పసుపు, చిలకాకుపచ్చ, కుంకుమ ఎరుపు చీరలను సింగారించిన పడతుల కోలాహలంతో అచ్చంగా తొమ్మిది రోజులు, అక్షరాల నవరాత్రులు, స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ, నచ్చిన బట్ట కట్టుకొని, నచ్చిన నగలు ధరించి, బాల్య స్నేహాలను పునరుద్ధరించుకుంటూ, పుట్టింటి ఆప్యాయతతో తలమునకలవుతారు తెలుగింటి ఆడపడుచులు.

తరుణులంతా కలసి తొమ్మిదవ రోజు ప్రొద్దుటే తలారా స్నానం చేసి, ఇత్తడితో చేయబడ్డ తాంబాళంపై తంగేడు పూలను, గునుగు పూలను, శిఖరాకారంలో రంగు రంగు దొంతరలుగా పెట్టి, శిఖరాగ్రాన పసుపు ముద్దను గౌరీదేవిగా ఉంచి భక్తితో సింగారిస్తారు. దాని చుట్టూ వలయాకారంలో వంగుతూ, లేస్తూ, చప్పట్లు చరుస్తూ, పాటలు పాడుతూ తమ తమ మాంగల్యాన్ని కలకాలం నిలపమని బతుకమ్మను వేడుకొంటూ సాదరంగా ఆహ్వానిస్తుంటే, మరొక వైపు మేమేనా తక్కువ తిన్నదని బుజబుజరేకుల బుజ్జాయిలు మరో బుజ్జి బతుకమ్మను చేసుకుని పాడుకుంటారు. ఆ బుజ్జి బతుకమ్మ పేరే "బుడ్డమ్మ." రాబోయే కాలంలో యౌవనవంతులయే తాము సకల సౌభాగ్యాలతో జీవించడానికి అన్ని విధాలా యోగ్యుడైన భర్త లభించాలని ప్రకృతికి బాలకన్యలు చేసే కైమోడ్పు నివేదనలవి.

విందులు, వినోదాలు ముగిసి, చల్లబడిన ఆ సాయంకాలపు వాతావరణంలో నీలాకాశపు పందిరి కింద, నీలాల జలాశయంపైన, ఈ రెండు నీలాల మధ్య బతుకమ్మను తలపై పెట్టుకొని నిలువెత్తు హరివిల్లులా బాజా భజంత్రీలతో సాగిపోతున్న తెలంగాణా ముత్తయిదవుల మందగమనం ఒక కమనీయ దృశ్యకావ్యం. సంప్రదాయం ఒక జీవనరాగమై ఆలపించే సమయమది. నదీతీరం చేరిన తరువాత ఆ పూల బతుకమ్మను నీటిలో ముంచి దానిపై నున్న 'పసుపు గౌరమ్మకు' భక్తితో నమస్కరించి, తమ మాంగల్యాన్ని కాపాడమని ఆ గౌరమ్మను తాళితో స్పృశిస్తారు. తేజస్సును శ్వాసిస్తూ, దశదిశలకూ జీవం ప్రసాదిస్తూ, పూలన్నీ యోగులై, ఉపనిషద్భోగులై, నదీమతల్లి జలతరాంగాలలో తమను తాము కైమోడ్పు చేసుకుంటాయి. ఆ ఆనంద పారవశ్యంతో పూలబాలలు, నదులూ, చెరువులపై తేలుతూ పూల సెజ్జలుగా మారే అద్భుత దృశ్యమది. సూర్యాస్తమయ సమయంలో క్రమేపీ నల్లటి నీడలు నడుం వాల్చగాఆ మహిళాలోకం నిట్టూర్పులు విడుస్తూ ఇంటి ముఖం పడుతుంది.

ఇదంతా భావుకులకు కనిపించే బాహ్యదృశ్యమయితే, ఈ సంప్రదాయం వెనుక దీటుగా నిలిచే శాస్త్రీయత కూడా వుంది. వర్షం పుష్కలంగా పడినప్పుడు మాత్రమే పుష్పించే తంగేడు, గునుగు పూలు తలలో పెట్టుకొనే సుగంధ పుష్పాలు కావు. ఈ పూరేకులలో, ఆ పుప్పొడిలో దాగున్న సహజ రసాయనాలకు నీటిని శుభ్రపరచే గుణం వుంది. ఇవి పర్యావరణాన్ని కాపాడే రక్షక కవచాలు. అందుచేతనే ఈ బతుకమ్మను తాము తాగే నీటి వనరుల వద్ద (అది చెరువు లేదా నది కావచ్చు) మాత్రమే నిమజ్జనం చేయటం వలన ఆ నీరు శుభ్రపడుతుంది. ఈ పండుగకు రెండు నెలల ముందు వచ్చే వినాయక నిమజ్జనంతో ఆ విగ్రహాలలో వుండే మట్టి నీటి అడుగుకు చేరి తగినంతగా నీటి చెలమను స్థిరపరుస్తుంది. ఈ పూలు ఆ నీటిని వడగట్టి త్రాగునీరుగా మారుస్తుంది. వర్షాభావం వచ్చినప్పుడు తంగేడుపూల, గునుగు పూల కొరత ఉన్నప్పుడు కాగితపు పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. అయితే దీనిని నిమజ్జనం చేయరు. నది వరకూ ఊరేగింపుగా వెళ్ళి ఆ కాగితపు బతుకమ్మను ఇంటికి తిరిగి తీసుకువచ్చి జాగ్రత్తగా భద్రపరుస్తారు.

సిద్ధిపేటలో చెక్కపై పెట్టే చెక్క బతుకమ్మ, నిజామాబాద్‌లోని బాలి బతుకమ్మలుగా కొద్ది ప్రక్రియా భేదాలున్నాయి. మెదక్‌, నారాయణఖేడ్‌లలో మాత్రం దళితులు పిడకలకు పువ్వులు పెట్టి గోడకు పెడతారు.

ఈ సంప్రదాయం మహారాష్ట్ర దళితులలో కూడా వుంది.

మంచి నీటికొరత ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా వున్న సమస్య.

ఈ సమస్యపై మనమంతా ఉద్యమించాలని బతుకమ్మ పండుగ మనకు జ్ఞాపకం చేస్తుంది.

(సప్తపర్ణి నుంచి)

– కాండ్రేగుల నాగేశ్వరరావు

Tags:    
Advertisement

Similar News