తెలుగు గడ్డపై లేచిన యువ కళాతరంగం... ఏలే లక్ష్మణ్
ఏలే లక్ష్మణ్ చిత్రాలు చూస్తున్నపుడు క్రింద ఏలే సంతకం కోసం వెదకనవసరం లేదు. చిత్రంలోని ప్రతి బిందువులోనూ అతనొక అంతః శక్తిగా రూపాంతరం చెందుతాడు. ఆ చిత్రాలలో మనకు కొట్టొచ్చినట్లు కనపడేది అందంగా, అమాయకంగా పరచ బడ్డ పల్లెటూరి అమ్మతనం. నీరెండలో స్నానం చేసిన పల్లెను సుతారంగా తన కుంచెతో స్పృశిస్తూ వారి దైనందిన జీవనాన్ని ఆహ్లాదంగా మన ముందుంచే కళాత్మకత. తన చుట్టూ వున్న చెట్లూ, చేమలు, రాళ్ళు రప్పలలోని, రాళ్ళను, కొమ్మలను, రెమ్మలను లెక్క […]
ఏలే లక్ష్మణ్ చిత్రాలు చూస్తున్నపుడు క్రింద ఏలే సంతకం కోసం వెదకనవసరం లేదు. చిత్రంలోని ప్రతి బిందువులోనూ అతనొక అంతః శక్తిగా రూపాంతరం చెందుతాడు. ఆ చిత్రాలలో మనకు కొట్టొచ్చినట్లు కనపడేది అందంగా, అమాయకంగా పరచ బడ్డ పల్లెటూరి అమ్మతనం. నీరెండలో స్నానం చేసిన పల్లెను సుతారంగా తన కుంచెతో స్పృశిస్తూ వారి దైనందిన జీవనాన్ని ఆహ్లాదంగా మన ముందుంచే కళాత్మకత. తన చుట్టూ వున్న చెట్లూ, చేమలు, రాళ్ళు రప్పలలోని, రాళ్ళను, కొమ్మలను, రెమ్మలను లెక్క కట్టి మరీ వాటి సౌందర్యాన్ని తన చిత్రాలలో సజీవంగా నిలుపుతాడు. ఆ చిత్రాల ముందు మనం నిలబడినపుడు అవి ఒక సుతి మెత్తని పలకరింపుతో మనల్ని పరవశింపజేస్తాయి. మచ్చుకైనా భేషజం లేని పల్లెటూరి జీవన స్రవంతిని మనముందుంచటం కోసం అనాగరికంగా మనం భావించే పల్లె రంగులైన జాజు, ఎఱ్ఱమట్టి రంగు, గోడలకు అలకే సున్నం, వాటికి పెట్టే ఎఱ్ఱబొట్లను విరివిగా ఉపయోగిస్తాడు. మట్టిరంగుల అందాల సోయగాన్ని చూడమంటాడు. ఆ రంగులంటే అతని కిష్టం.
లక్ష్మణ్ తండ్రి చంద్రయ్య మగ్గాన్ని నమ్ముకొని జీవించే జీతగాడు. తల్లి వీరమ్మ కూలి. కలల్నీ, కన్నీళ్ళనీ కలనేత నేయగల ఒక తెలంగాణా పల్లె కదిరినేని గూడెం అతని స్వస్థలం ఇది భువనగిరికి 25 కి|| దూరంలో ఉంది. ”మన్నులో కూర్చుని చదివాను, నా కెప్పుడూ అత్తెసరు మార్కులే. నూనె రాసిన కాగితంపై ట్రేస్ వేసిన నాయనమ్మ చిత్రం నా మొదటి బొమ్మల్లో ఒకటి” అని తన బాల్యపు ముచ్చటను చెబుతాడు. భువనగిరిలో సైన్ బోర్డులు వ్రాసే గోపీని చూసి తన గీతలను మెరుగు పెట్టుకున్నాడు. భువనగిరిలో వున్న సినీనటుల అభిమాన సంఘాల వారికి బేనర్లు వ్రాసి పెట్టేవాడు. రామన్నపేటలో జూనియర్ కాలేజీలో చదువుతున్నపుడు ఉపాధ్యాయులు కార్టూన్లు గీయటం నేర్చుకోమని ప్రోత్సహించారు.
” నేను వేసే చిత్రాలన్నీ ఫిగరేటివ్, నేను డిస్టార్షన్ అనే దాన్ని నమ్ముతాను. అది అవసరం కూడా. అందులోనే ఎక్కువ రియాలిటీకి అవకాశం వుంటుంది. డిస్టార్షన్‌లో చలనమూ, లోతూ వుంటాయి.
రాళ్ళు నాకు ఇష్టమైన సబ్జెక్టు. బోన్‌గిరి ప్రాంతంలోని చిన్నచిన్న గుట్టలూ, కొండలూ నాకిష్టం. ఉదయాస్తమయాల్లో ఆ రాళ్ళు గోధుమ, పసుపు, నలుపురంగుల్లో నిశ్శబ్దంగా మెరిసేవి. నేనెరిగిన మనుషులూ, ప్రపంచమూ ఆ రాళ్ళలోకి ఒదిగిపోయి తమ బాధలూ, గాథలూ చెప్పుకున్నట్టుండేవి. ఆ భావననే నా చిత్రాలలో ప్రవేశ పెట్టాను. మాకు బర్రెలుండేవి. ఎండాకాలం సెలవుల్లో నేనే బర్రెలు మేపేవాణ్ణి. మా పొలంలోని రాళ్ళ గుట్టల దగ్గరికి బర్రెల్ని తోలుకు పోయేవాణ్ణి. రాళ్ళు రకరకాల ఆకారాల్లో పలకరించేవి నన్ను. మా అమ్మ, నేనూ పొలంలోని రాళ్ళన్నీ ఓ మూలకి జరపి చెల్కనంతా చదును చేసేవాళ్ళం. నా చిన్న తనమంతా కదిరేని గూడెం దాటిపోలేదు. బాగా ఊహ తెలిసేంత వరకూ నేను ఆ గ్రామంలోనే పెరిగాను. ఎప్పుడో ఒకసారి ‘బోన్‌గిరి’ వెళ్ళేవాళ్ళం. ఒకసారి ఓ సంఘటన జరిగింది. మేం సర్కస్ చూడ్డానికి వెళ్ళాం. ఒక పల్లెటూరి స్త్రీ కొప్పులో పూలు పెట్టుకొని బస్టాండ్‌లో కింద కూర్చునివుంది. హఠాత్తుగా ఒక మేక పిల్ల వెనుక నుంచి వచ్చి ఆమె కొప్పులోని పూలను మేసేసింది. ఆ దృశ్యం నా మనసులో ముద్రించుకు పోయింది.
నా చిన్నప్పటి ఆ సన్నివేశం ఇటీవల నేను వేస్తున్న ఓ చిత్రంలోకి అలవోకగా ఒదిగిపోయింది. నా చిత్రాలన్నీ అంతే! సహజాతి సహజంగానే వొస్తాయి.
బొమ్మలు మితభాషులుగా వుండాలి:
ఒక చిన్న కాన్వాస్ మీద స్పేస్‌ని, దూరాన్ని నియంత్రించుకోవాలి, అంతే! పెయింటింగ్‌లో ఖాళీలు వుంటాయి, ఉండాలి. ఆ ఖాళీలకూ ఒక సందేశం వుంటుంది.
కవిత్వం రాసేటప్పుడు హృదయంలో ఏ బిందువుపై నిలబడి రాస్తారో, అదే స్థితిని అనుభవిస్తూ నేను చిత్రాన్ని వేస్తాను.
నేను మా వూరిలో చూసిన మనుషులందరి నుంచి స్ట్రాంగ్ ఫీచర్స్‌ని గ్రహించాను. వాటిని నా చిత్రాల్లో వుండే మనుషుల్లోకి ప్రవేశపెట్టాను. నేనొక మహిళ బొమ్మనో, మగాడి బొమ్మనో వేస్తే అందులో చాలమంది మహిళల, మగాళ్ల ఎనాటమీ ఇమిడి వుంటుంది. ఒకరిలోనే అనేక రూపాలూ, భావాలూ కనిపిస్తాయి. నా ఈస్తటిక్స్ నాకున్నాయి. నా చిత్రాల్లోని మహిళలకు ఏ అలంకారాలూ కనిపించవు. వారి బాధ మాత్రమే వుంటుంది.
పెయింటింగ్‌లోని సాంకేతిక అంశాల్ని నేను అసహ్యించుకుంటాను. ఈ కంజ్యూమర్ సొసైటిలో కొనుగోలు దారుణ్ణి భ్రమింపచేయడానికి మాత్రమే ఈ టెక్నిక్ అనేది పనికొస్తుంది. చిత్రకారుడు తాను గ్రహించే వస్తువులోని వైవిధ్యంవల్లే ‘శైలి’ అనేది ఏర్పడుతుందని భావిస్తాను.
నా పెయింటింగ్స్‌పై డేట్స్ వేయకపోవడానికి ఇదే కారణం. రానున్న కాలంలో నిజమైన ఆర్ట్ ఫామ్ మాత్రమే మిగుల్తుందని నాకనిపిస్తుంది.
ఏదైనా బొమ్మవేసే ముందు నేను ఏదీ అనుకోను. నాకు తెలిసిన జీవితమే నన్ను కేన్వాస్ పైకి తీసుకుపోతుంది. నేను జీవించిన అనుభవమే నా చిత్రాల్లోని ఫామ్‌ని నిర్ధారిస్తుంది. నాకు తెలియంది నేను చిత్రించలేను. గ్రామీణ జీవితమే నా ఇతివృత్తం. ఈ జీవితం తప్ప మిగతా ప్రపంచం నాకంత దగ్గరగా తెలీదు.
దళిత జీవితాన్నే మీ చిత్రాల ఇతివృత్తంగా ఎందుకు ఎంపిక చేసుకుంటారని కొందరు అడుగుతుంటారు. నాకు వేరే జీవితం తెలీనే తెలీదు. నా బతుకే అది”.
రెండు దశాబ్దాలుగా నగరంలోనే జీవిస్తున్నా పల్లె అందాలు ఇంకా అతన్ని వెంటాడుతూనే వున్నాయి. పసితనం నాటి ఆ జ్ఞాపకాల ఊటలోనే అతనింకా ఈదులాడుతున్నాడు. అందుకే ఆ చిత్రాల్లో వసివాడని పసిడి కనిపిస్తుంది. ”నా పాలెట్ (రంగులు కలుపుకునే బోర్డు) ఇంకా కదిరినేనిగూడెం లోనే వుందని” గర్వంగా చెప్పుకునే లక్ష్మణ్ అద్భుతమైన తెలంగాణా సోయిని అంతర్జాతీయం చేశాడు.
(సప్తపర్ణి నుంచి)
– కాండ్రేగుల నాగేశ్వరరావు