ప్రముఖ గజల్ గాయకుడు విఠల్‌రావు కన్నుమూత
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొలువులో ఆస్థాన గాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులతో భేష్ అనిపించుకుని దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు అందుకున్న ప్రముఖ గజల్ గాయకుడు విఠల్ (86) అత్యంత విషాదకరంగా కన్నుమూశారు. తొలితరం తెలంగాణ గజల్ గాయకుడు పండిట్ శివపూర్కర్ విఠల్ రావు అదృశ్యం చివరకు విషాదాంతమైంది. అద్భుతమైన గాత్రంతో దశాబ్దాలకు పైగా సాహితీ ప్రియులను అలరించిన ఆయన చివరకు అనామకుడిలా మరణించారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న […]
Advertisement
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొలువులో ఆస్థాన గాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులతో భేష్ అనిపించుకుని దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు అందుకున్న ప్రముఖ గజల్ గాయకుడు విఠల్ (86) అత్యంత విషాదకరంగా కన్నుమూశారు. తొలితరం తెలంగాణ గజల్ గాయకుడు పండిట్ శివపూర్కర్ విఠల్ రావు అదృశ్యం చివరకు విషాదాంతమైంది. అద్భుతమైన గాత్రంతో దశాబ్దాలకు పైగా సాహితీ ప్రియులను అలరించిన ఆయన చివరకు అనామకుడిలా మరణించారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న విఠల్ రావు మే 29న షిర్డీలో కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఈనెల 24న హైదరాబాద్‌లోని బేగంపేట కంట్రీ క్లబ్ ఫ్లై-ఓవర్ కింద పడిఉన్న విఠల్ రావును స్థానికులు యాచకునిగా భావించి 108కు సమాచారమిచ్చారు. గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఆయన అదే రోజు మరణించారు. గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి మార్చురీలో భద్ర పరిచారు. కాగా, విఠల్ రావు అదృశ్యం కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ శాంబాబు ఫొటోల ఆధారంగా మార్చురీలోని మృతదేహాన్ని గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న విఠల్ రావు మృతదేహాన్ని ఆయనకు అమర్చిన కృత్రిమ కన్ను ద్వారా కుమారుడు సంతోష్ గుర్తించారు. కొన్నేళ్ల కింద ఆయన ఎడమ కన్ను తొలగించి కృత్రిమ కన్ను అమర్చారు. విఠల్ రావుకు భార్య తారాభాయి, కుమారులు సంజయ్, సంతోష్, కుమార్తెలు సంధ్య, వింధ్య, సీమ ఉన్నారు. గజల్ గానంతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన విఠల్ రావు మరణించిన తీరు కుటుంబ సభ్యులను, బంధువులను, అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది. గోషామహల్‌లో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు తెలిపారు.
సన్మానం అందుకోకుండానే
జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా విఠల్ రావుకు సన్మానం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. అయితే, అప్పటికే ఆయన అదృశ్యం కావడంతో ఆయనను సన్మానించ లేక పోయింది. ఆయన ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించింది. వాస్తవానికి విఠల్ రావు కుటుంబసభ్యులతో కలిసి మే 26న గోషా మహల్ నుంచి షిర్డీ యాత్రకు బయలుదేరారు. మార్గమధ్యలో విఠల్ చెల్లెలు అంబిక ఇంటికి వెళ్లి అక్కడ రెండు రోజులున్నారు. ఆ తర్వాత మే 29న అందరూ కలిసి షిర్డీకి చేరుకున్నారు. బాబా దర్శనం చేసుకుని వస్తుండగా విఠల్ రావు కనిపించకుండా పోయారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన షిర్డీలో తప్పి పోయి హైదరాబాద్‌లో ప్రత్యక్షమై తీవ్ర అస్వస్థతతో గాంధీ ఆస్పత్రిలో మరణించారు.
దేశ విదేశాల్లో ప్రదర్శనలు
నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్థాన గజల్ గాయకుడిగా విఠల్ రావు ప్రస్థానం మొదలైంది. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 28న ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చారు. భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఆయన ప్రదర్శన ఇచ్చారు. చౌమహల్లా ప్యాలెస్, రవీంద్ర భారతి, తారామతి బారాదరిలో విఠల్ ఇచ్చిన ప్రదర్శనలు చరిత్రలో నిలిచి పోయాయి. రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు, సీఎంలను ఆయన తన గజల్ గానంతో మంత్రముగ్ధులను చేశారు. కువైట్, కెనడా, అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, దుబాయ్ తదితర దేశాల్లోనూ ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ప్రముఖ గజల్ గాయకుడు విఠల్ రావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ఏడో నిజాం ఆస్ధాన గాయకుడిగా పని చేసిన విఠల్ రావు దేశవ్యాప్తంగా పేరొందిన కళాకారుడని సీఎం కీర్తించారు. అంతర్జాతీయంగా ఎంతో కీర్తి సంపాదించుకున్న విఠల్‌రావు షీర్డీలో తప్పిపోయే… పంజాగుట్టలో కనిపించి… ఉస్మానియా మార్చురీలో శవంగా మిగిలిన పరిస్థితి అందరినీ కలిచివేసి కంట తడి పెట్టించింది.
Advertisement