అగ్రశ్రేణి ప్రజా వాగ్గేయకారిణి విమల

అవి నేను ముత్తారంలో ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులు. నేనప్పుడు పాటలు బాగాపాడుతానని పేరు. ముత్తారం స్కూల్లో ప్రతి శనివారం రెండోపూట సాంస్కృతిక కార్యక్రమాలు నడిచేవి మరి. అందులో నేను పాటలు పాడేవాణ్ణి. ఉపన్యాసాలిచ్చేవాణ్ణి. మాది మల్లంపల్లి. మావూళ్ళో మొదటిసారి జనశక్తి సభజరిగింది. నేనప్పుడు చాలా చిన్నవాణ్ణి. అక్కడే మొదటిసారి కలేకూరి ప్రసాద్‌ రాసిన ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వ’ పాట అరుణోదయ కళాకారులు పాడుతుంటే విన్నా. సాయుధ దళం పహారాలో ఆ విప్లవకారులు పాడిన పాటలు […]

Advertisement
Update:2015-06-08 09:59 IST

అవి నేను ముత్తారంలో ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులు. నేనప్పుడు పాటలు బాగాపాడుతానని పేరు. ముత్తారం స్కూల్లో ప్రతి శనివారం రెండోపూట సాంస్కృతిక కార్యక్రమాలు నడిచేవి మరి. అందులో నేను పాటలు పాడేవాణ్ణి. ఉపన్యాసాలిచ్చేవాణ్ణి. మాది మల్లంపల్లి. మావూళ్ళో మొదటిసారి జనశక్తి సభజరిగింది. నేనప్పుడు చాలా చిన్నవాణ్ణి. అక్కడే మొదటిసారి కలేకూరి ప్రసాద్‌ రాసిన ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వ’ పాట అరుణోదయ కళాకారులు పాడుతుంటే విన్నా. సాయుధ దళం పహారాలో ఆ విప్లవకారులు పాడిన పాటలు నన్ను ఊపేశాయి. అయితే, మాది సిపియం రాజకీయాలున్న కుటుంబం. అందువల్ల నాకు జనశక్తి రాజకీయాలన్నా, పీపుల్స్‌వార్‌ రాజకీయాలన్నా ఆసక్తివుండేది కాదు. కానీ, ఆ పార్టీల పాటల్లో వుండే అగ్ని నన్ను నిలవనిచ్చేది కాదు. ఏడో తరగతి నాటికే నేను సిపియం అనుబంధ ఎస్‌ఎఫ్‌ఐలో సభ్యుణ్ణి. ముత్తారం హైస్కూల్లో నేను ఆ సంఘం ప్రతినిధిని. నా క్లాసుమేట్‌ శ్రీనివాస్‌ది వల్మీడి. ఆయన జనశక్తి రాజకీయాలు మాట్లాడేవాడు. ‘అబ్బవీని రంకుల రండల్‌ ఎర్రముసుగుల దొంగల్‌.. మేడ మీద ఎర్రజెండకట్టుకొని అచ్చమైన కమ్యూనిస్టులమంటరు’ అని పాడేవాడు. కమ్యూనిస్టులంటే ఒక్క సిపియం మాత్రమే కాదు. జనశక్తి కూడా ఉందని చెప్పేవాడు. పాలకుర్తికీ ముత్తారానికీ మధ్య వల్మీడి వుంటుంది. అది జనశక్తి ఉద్యమానికి కేంద్రం. అక్కడికి మారోజు వీరన్న, అమర్‌, కూర రాజన్న వంటి అగ్రనేతలు వచ్చేవాళ్ళు. అక్కడికి విమల తరచుగా వచ్చేది. కానీ, నేనెప్పుడూ ఆమెను చూడలేదు. కానీ, ఒకరోజు జనగాంలో మీటింగ్‌ ఉంది. లారీ పెడుతున్నాం. మీటింగ్‌కు వస్తావా అన్నాడు శ్రీనివాస్‌. అలా నన్ను జనగాంలో జరిగిన మీటింగ్‌కు తీసుకెళ్ళాడు. ఇది 1992 నాటి మాట. అక్కడే అరుణోదయ సాంస్కృతిక సమాక్య నాయకురాలు, ప్రజావాగ్గేయకారిణి విమలను నేను మొదటిసారి చూశాను.

జనగాం బస్టాండ్‌ ఎదురుగా ప్రిస్టన్‌ స్కూల్‌ ఇప్పటికీ ఉంది. అందరూ ఆక్రమించుకోగా కొద్ది స్థలంతో శిధిలావస్థలో మిగిలేవుంది. అక్కడికి అన్ని ప్రాంతాలనుంచి ప్రజలు పెద్దయెత్తున చేరుకున్నారు. మా స్కూలు నుంచి వచ్చిన విద్యార్థులం బుద్ధిగా అక్కడికి నడుస్తున్నాం. దూరం నుంచే డప్పుల దరువు వినిపిస్తుంది. కాస్తా దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఎర్రచీరలు ధరించిన కళాకారుణిలు గొంతెత్తి పాడుతున్నారు. ఎవరీమె అని శ్రీనివాస్‌ను అడిగాను. ఆమె విమలక్క అని చెప్పిండు. ఆ పక్కనే మరొకావిడ. ఆమె చైతన్య. నా చూపులు, చెవులు అద్భుతమైన సంగీతాలపన చేస్తూన్న విమల మీదే. ఆవిడ లయబద్దంగా వేస్తున్న అడుగులు. అర్థవంతంగా పాడుతున్న తీరు. ఆ విప్లవ పాటల్లో తానొక పాటగా మాటగా ఆటగా ఒక సముద్రం వలే మారిపోతుంది. అంతలోనే ఉన్నట్టుండి కుర్తా, పైజామాలో వున్న ‘అంబిక’ కళాకారుల మధ్యలోకి దూసుకొచ్చింది. ‘తాగర అన్నా, తాగి ఊగర అన్నా’ అని ఎత్తుకుంది. అచ్చం తాగిన మనిషిలానే నర్తించింది. మధ్యాహ్నాం నుంచి పాటల హోరు. ఊరేగింపులో కూడా ఆగలేదు. ఆ సభలోనే మొదటిసారిగా గోరెటి వెంకన్న రాసిన ‘రాజ్యహింసా పెరుగుతున్నాదో..’ పాటను విమల నోటివెంట విన్నా. ఆ రోజు నేను విన్న ఆ పాటలు, చూసిన ఆమె నాట్యం అద్భుతం. నేనెప్పటికీ మరిచిపోలేని బలమైన ముద్రను నా మనసుమీద విమల వేసింది. చిన్నతనం నుంచీ ఆమె గాత్రాన్నీ గానరీతినీ అభిమానిస్తూనే వున్నాను. ఆమె ప్రదర్శనలను ప్రేమిస్తూనే వున్నాను. నిజమే, ఆమె రాజకీయాలపట్ల నాకు అంగీకారంలేదు. ఆమె సంగీతాన్ని ఆస్వాదించడానికీ, ఆ స్వరఝరిలో ఓలలాడటానికి ఆమె రాజకీయాలేవీ నాకు అడ్డురాలేదు.

సాంస్కృతిక రాజకీయాలను విశ్లేషించటంలో గానీ వాటిని నిర్దేశిస్తున్న ఆంతరంగిక నిర్మాణలను బహిర్గతం చేయటంలోగానీ సంస్కృతీ విమర్శకులు పెద్దగా శ్రద్ధపెట్టలేదు. అన్నిరంగాల్లోనూ జరిగే డిస్కోర్సెస్‌ పురుషులు కేంద్రంగా సాగినట్టు, కల్చర్‌ డిస్కోర్స్‌ కూడా అదేపద్ధతిలో సాగింది. తెలుగు ప్రజావాగ్గేయం గురించి కొనసాగిన చర్చలు కూడా మగవాళ్ళనే కేంద్రంగా చేసుకుంది. విప్లవ సాంస్కృతికోద్యమంలో మహిళలు నిర్వహించిన అద్భుతమైన పాత్ర గురించి ఆశించిన మేరకు కూడా చర్చ జరగలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, విమల వాగ్గేయం గురించి విమర్శకులు సరిగా సూత్రీకరించే కృషిచేయలేదు. స్థూలంగా అరుణోదయ సాంస్కృతిక సమాక్య విప్లవ ప్రచార రంగంలో చేసిన కృషిని గుర్తించినంతగా విమల కార్యక్షేత్రంలో సలిపిన పోరాటం గురించిగానీ కళాక్షేత్రంలో తెచ్చిన మార్పుల గురించిగానీ సైద్ధాంతిక చర్చలేవీ జరగలేదు. విప్లవ సాంస్కృతికోద్యమంలో గద్దర్‌ ఒక మైలురాయి. అయితే, గద్దర్‌తో మొదలైన చర్చ తిరిగి ఆయనతోనే ముగిసిపోవటం చూస్తాం. అప్పటి పీపుల్స్‌వార్‌, ఇప్పటి మావోయిస్టు పార్టీల ప్రాబల్యం వల్ల ఇతర శక్తులు ఈ రంగంలో చేపట్టిన కర్తవ్యాలను విమర్శకులు సైతం గుర్తించకపోవటం విచారకరం. విమల అటు సాంస్కృతిక రంగంలోనూ, ఇటు జనశక్తి రాజకీయాలను ప్రజాక్షేత్రంలో నిరంతరం సజీవంగా ఉంచటంలోనూ క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. జనశక్తి రాజకీయాలను, సైద్ధాంతిక దృక్పథాలను కూర రాజన్న, అమర్‌లు రహస్యజీవితంలో ప్రచారం చేశారు. వారిమీద రాజ్యనిర్బంధముంది. వాళ్ళు రాజ్యంచేత చిక్కినప్పుడు మాత్రమే జీవించే హక్కు సంక్షోభంలో పడుతుంది. కానీ, విమలది ప్రజాజీవితం. నిరంతరం రాజ్యానికి వ్యతిరేకంగా వీధులవెంటా, పల్లెలవెంటా తిరుగుతూ, సబ్బండ కులాలతో మమేకమవుతూ చావుతో చెలగాటమాడే కళాజీవితం తనది. నిరంతరం యుద్ధక్షేత్రంలో వున్న సైనికురాలు. రాజ్యాన్ని తన గానంతో వాచకంతో ఎదిరించిన వాగ్గేయురాలు. ఈ క్రమంలోనే తనకు, సమాజానికీ అభేదం ప్రకటించుకుంది. తన వ్యక్తిత్వాన్నీ, తన కళా ప్రదర్శన శిల్పాన్నీ ప్రజారాశులతో మమేకమయ్యే క్రమంలోనే తీర్చిదిద్దుకుంది. జనశక్తి రాజకీయాలకు సాంస్కృతిక వారధిగా, వర్గపోరాటాల వ్యక్తీకరణకు సారధిగా రూపొందుతూ వచ్చింది. తాను నమ్మిన విప్లవ రాజకీయాలు సంక్షోభంలో పడ్డప్పుడు సైతం ఆత్మనిబ్బరం కోల్పోని ధీశాలి తను. జనశక్తి దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నా, ఇప్పటికీ జనశక్తి ఒకటి బతికేవుందని ప్రజలు అనుకుంటున్నారంటే విమలే అందుకు కారణం. సంస్థాగతంగానూ, నిర్మాణాత్మకంగానూ ఆ పార్టీ నిర్వీర్యమైందన్నది నిజం. అయితే, ఆ పార్టీ పటిష్టంచేసుకున్న సిద్ధాంతం మాత్రం బలమైనది. కులం/వర్గం సమస్యను పరిష్కరించుకొనే క్రమంలో మారోజు వీరన్న నాయకత్వంలో ఒక గ్రూపు విడిపోయింది. జనశక్తిని నిర్మించిన వ్యక్తులు, శక్తుల పొందికను గమనిస్తే పీడితకులాల పాత్ర అర్థమవుతుంది. కూర రాజన్న, అమర్‌, విమల, మారోజు వీరన్న, ఉ.సా. వంటి విప్లవమేధావులు, నేతలంతా బి.సీ.కులాలకు చెందినవాళ్ళు. ఆ పార్టీ తయారుచేసుకున్న సాయుధ సైన్యంలోనూ, క్షేత్రస్థాయి నాయకుల్లోనూ ఎక్కువగా ఎస్సీ,ఎస్టీ, బిసీలేనన్నది నిజం. పీపుల్స్‌వార్‌ పార్టీ బ్రాహ్మణ, వెలమ నాయకత్వంలో వుంటే, ఒక్క జనశక్తి మాత్రమే బహుజనుల నాయకత్వంలో వుండేదని నా మిత్రుడు నలిగంటి శరత్‌ అంటాడు. అందుకే, అమర్‌ రాసిన పాటల్లో సబ్బండ కులాల జీవితముంటుంది. విమల గొంతులో బహుజన కులాల పోరాటం కళాఖండమై ఊపిరిపోసుకుంది. మాదిగోల్ల డప్పులొచ్చెనే మానవ హక్కుల దండోరేసి మొదలుకొని భీండ్రమ్‌ పాట వరకు విమల కుల/వర్గ దృక్పథం వెల్లడవుతుంది.

ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో విమలది అద్భుతమైన పాత్ర. అప్పటిదాకా కేవలం అరుణోదయ కళాకారిణిగా మాత్రమే గుర్తించబడే ఆమె తెలంగాణ ఉద్యమంలో ప్రత్యామ్నాయ నాయకురాలిగా గుర్తింపుపొందింది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వెనకడుగేసినా, లేదా ప్రజల్లో ఆ ఉద్వేగాగ్ని చల్లారి ఆత్మహత్యల మార్గంపట్టిన ప్రతిసందర్భంలోనూ విమల మిలిటెంటు స్వభావం ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. తుపాకి రాముడిలాంటి మాటలు మాట్లాడే నాయకత్వం ప్రజలను కర్తవ్యశూన్యులను చేసినప్పుడు సరైన దిశానిర్దేశం చేసే బాధ్యతను స్వీకరించింది. ఆంధ్ర సంపన్నవర్గమే తెలంగాణాకు అడ్డని ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిచ్చింది. ఆంధ్రపెట్టుబడిదారుల ఆఫీసుల మీద, ఆస్తుల మీద తెలంగాణ జెండా ఎగరేసింది. ఒకవైపు తెలంగాణా అంతటా తన పాట, మాట ద్వారా చైతన్యం చేస్తూనే, దొరల నాయకత్వంలో లేని ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలను ఒక వేదిక మీదికి తెచ్చి వాళ్ళను ప్రజలమధ్యకు నడిపించింది. కొండాలక్ష్మణ్‌, కేశరావు జాదవ్‌ వంటి పెద్దమనుషులను తీసుకొని ఊరూరా బస్సుయాత్ర చేసింది. నిరంతరం ఆంధ్రపాలక వర్గాన్ని సవాల్‌ చేస్తూ, కేంద్రంలోని కాంగ్రెస్‌ను ప్రజల ముందు ఎండగడుతూ ఏ మగనాయకత్వం చేయలేని వీరోచిత పోరాటం నడిపింది. ఒకవైపు తెలంగాణ భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడుతూ, ఆ అగ్రకుల భూస్వాముల నాయకత్వంలో నడుస్తున్న ఉద్యమం చేసే తప్పులను, లోపాయికారి ఒప్పందాలను ఎప్పటికప్పుడు ప్రజలముందుంచుతూ తెలంగాణ సాధనకోసం అనేక ఎత్తుగడలను, వ్యూహాలను అమలు చేస్తూ ప్రతిక్షణం గడపడం ఎంతగొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే, కొత్త రాష్ట్రం సిద్ధించిన తర్వాత తలెత్తే కొత్త పరిణామాలను కూడా ఆమె ఎత్తిచూపింది. భౌగోళిక రాష్ట్రం మాత్రమే ఏర్పడింది. ఇక ఈ తెలంగాణాలోని సబ్బండ కులాలు, పీడిత వర్గాలు చైతన్యవంతులై స్థానిక పాలకవర్గానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను చేపట్టింది. విమల ఈ పాలక వర్గ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆంధ్ర పాలకుల మాదిరిగానే, తెలంగాణ పాలకులు కూడా ఆమె మీద అనేక ఆరోపణలను, అనుమానాలను ప్రచారం చేసింది. చివరికి బరితెగించి కుట్రకేసులు కూడా మోపింది. ప్రజాస్వామ్య వ్యవస్థమీద నమ్మకం లేని పాలకులు విమల సాంస్కృతిక ఉద్యమాన్ని చూసి భయపడుతున్నారనడానికి ఈ కేసులే తార్కాణం.

సాంస్కృతిక నేత స్థాయి నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదగడం మాములు విషయమేమీ కాదు. అందుకు నిరంతరం చైతన్యంతో వుండాలి. ప్రజల పక్షపాతిగా నిలబడాలి. తన రాజకీయ విశ్వాసాలను ప్రకటిస్తూ, ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ దృక్పథాన్నీ, విధానాలనూ ప్రతిపాదిస్తూ ముందుకు సాగాలి. ప్రజల విశ్వాసాన్నీ చూరగొనాలి. నిజాయితీ, అంకితభావం వున్న నిత్యపోరాట యోధురాలని ప్రజలు గుర్తించాలి. అప్పుడు ప్రజలు గౌరవిస్తారు. ఆదరిస్తారు. విమల నిర్వహించే సభలకు తండోపతండాలుగా తరలివచ్చే జనం ఆమె చెప్పే రాజకీయాలను నమ్ముతున్నారు. తమ తరఫున నిలబడి కొట్లాడే వీరవనితగా గౌరవిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు నడిపే ఏ ఇతర నాయకుడికీ విమలకున్న స్థాయి, ప్రజల్లో పలుకుబడి లేదంటే ఆశ్చర్యం కాదు. ఇదంతా ఆమె సాంస్కృతిక రాజకీయాల క్రమం.

ముందే చెప్పినట్టు విప్లవ రాజకీయాలను నేను విమర్శనాత్మకంగా చూస్తాను. ‘లెనిన్‌ ఈ దేశంలో పుట్టివుంటే, ఆయన ముందుగా కులనిర్మూలన పోరాటం చేసేవాడు’ అని డా|| అంబేద్కర్‌ అంటాడు. కుల నిర్మూలనోద్యమాలు, బహుజన రాజకీయాలంటేనే నాకు ఇష్టం. అంతమాత్రాన, విప్లవ రాజకీయాలు సృష్టించిన సాంస్కృతిక ఉద్యమాన్ని చిన్నచూపు చూడటం తగదు. గద్దర్‌, గూడ అంజన్న, వంగపండు పాటలను ఎంత అధ్యయనం చేశానో, విమల పాడిన పాటలను కూడా అంతే లోతుగా అధ్యయనం చేశాను. విమల పాడిన పాటలని ఎందుకంటున్నానంటే ఆమె పాడిన పాటల్లో అధికశాతం అమర్‌ రాశాడు కాబట్టి. అమర్‌ విప్లవకారుడిగా వైఫల్యం చెందాడేమో గానీ, కవిగా విజయవంతమయ్యాడు. పాటను అల్లటంలో సమున్నత శిఖరస్థాయి తనది. అయితే, ఆ పాటలను ఆ స్థాయిలో నిలబెట్టింది మాత్రం విమల గాత్రమే. కవితకు, పాటకూ వున్న నిర్మాణపరమైన భేదం తెలిసిన వాళ్ళు నా వ్యాఖ్యను తప్పకుండా అర్థం చేసుకుంటారు. బాగా పాడగలిగితేనే ఆ పాటలోని కవిత్వం తేజోమయమవుతుంది. విమల గొంతులో అమర్‌పాటలు పునర్నిర్మాణమయ్యాయి. సంగీతమే తన హృదయం కనక ఎలాంటి కవిత్వమైనా అక్కడ ఫలవంతమవుతుంది.

గద్దర్‌ గానశిల్పం గురించి విజ్ఞులు తగినంత దృష్టిని సారించారు. ఆయన ప్రదర్శనా శైలి గురించి కూడా లోతైన చర్చ జరిగింది. ఆయన రూపుదిద్దిన గతులు, జతుల్లోనూ ఆలాపించిన రాగాల్లోనూ వైవిధ్యం, వినూత్నమైన గుణాలున్నాయి. అదేవిధంగా, విమల గానశిల్పంలో ఒక మాధుర్యముంది. ప్రేక్షకుడిని కట్టిపడేసే ప్రదర్శనా శైలివుంది. వర్ణ విరుపులు, శబ్దమెరుపులు, పాటెత్తుకునే ఒడుపు అర్థవంతంగా ఉంటాయి. ముచ్చటగొల్పుతాయి. మూడు దశాబ్దాలకు పైగా ఆమె సాంస్కృతిక రంగంలో వున్నది. ఇంత సుదీర్ఘమైన అనుభవం ఆమె ప్రదర్శనను పరిపూర్ణంగా తీర్చిదిద్దింది. కొన్ని వందల మంది కళాకారులను తీర్చిదిద్దింది. జననాట్యమండలిని తట్టుకొని అరుణోదయ నిలబడగలిగిందంటే, విమల కృషిని తక్కువ అంచనా వేయరాదు. గొల్ల కులంలో పుట్టిన విమల అద్భుతమైన వాగ్గేయకారిణిగా ఎదిగింది. ముప్పయియేళ్ళుగా సాంస్కృతిక రంగాన్ని ప్రభావితం చేస్తూనేవుంది. వేలమంది అద్భుతమైన కళాకారులున్న ఈ తెలంగాణ నేల మీద అగ్రశ్రేణి వాగ్గేయకారిణిగా గౌరవించబడుతుంది. విమలే లేకపోతే తెలుగు సాంస్కృతిక ఉద్యమం మగాళ్ళ బొంగురు గొంతుతోటే మిగిలిపోయేది. ఒక అసంపూర్ణ కళారూపంగా మిగిలిపోయేది. ఆ ప్రమాదం నుంచి సాంస్కృతిక ఉద్యమాన్ని విమల తన గాత్రంతో ఆచరణతో తప్పించింది.

– డా|| జిలుకర శ్రీనివాస్‌

Tags:    
Advertisement

Similar News