కూలీల్ని కూడా కాల్చి చంపేస్తారా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. కాదు అతి ఉత్సాహంగా ప్రవర్తిస్తోంది. తాను ఎంత ప్రగతిశీలంగా ఉన్నానో ప్రపంచానికి ముఖ్యంగా తన మిత్రులకు చాటి చెప్పడానికి ఎంతగానో శ్రమిస్తోంది. అందులో భాగంగానే శేషాచలం అడవుల్లో రెండు చోట్ల 20 మంది ఎర్రచందనం చెట్లను నరికే కూలీల్ని కాల్చి చంపేశారు. వారేమీ స్మగ్లర్లు కాదు. వారి వద్ద తుపాకులేమీ లేవు. కేవలం గొడ్డళ్ళు మాత్రమే ఉంటాయి చెట్లు నరకడానికి. వందలాది మంది పోలీసులు చుట్టుముట్టినపుడు వారిని నిర్బంధిచడం ఏమాత్రం […]

Advertisement
Update:2015-04-08 08:21 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. కాదు అతి ఉత్సాహంగా ప్రవర్తిస్తోంది. తాను ఎంత ప్రగతిశీలంగా ఉన్నానో ప్రపంచానికి ముఖ్యంగా తన మిత్రులకు చాటి చెప్పడానికి ఎంతగానో శ్రమిస్తోంది. అందులో భాగంగానే శేషాచలం అడవుల్లో రెండు చోట్ల 20 మంది ఎర్రచందనం చెట్లను నరికే కూలీల్ని కాల్చి చంపేశారు. వారేమీ స్మగ్లర్లు కాదు. వారి వద్ద తుపాకులేమీ లేవు. కేవలం గొడ్డళ్ళు మాత్రమే ఉంటాయి చెట్లు నరకడానికి. వందలాది మంది పోలీసులు చుట్టుముట్టినపుడు వారిని నిర్బంధిచడం ఏమాత్రం కష్టం కాదు. పోనీ ఎదురుతిరిగినా కాల్చాలనుకున్నపుడు మోకాళ్ళ కింద కాల్చవచ్చు. మరీ అంత అమానుషంగా పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపడమేనా? ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్నలు ఇవే. వారిని దారుణంగా కాల్చి చంపి శవాల పక్కన గతంలో ఎప్పుడో నరికేసిన పాత దుంగలను అక్కడ పెట్టారని అంటున్నారు. దాదాపు 2 వేల మంది ఎర్రచందనం కూలీలు ఇప్పటికే ఏపీ జైళ్ళలో మగ్గుతున్నారు. వారిని ఆరా తీస్తే కాంట్రాక్టర్ల గురించి తెలుస్తుంది. వారిని అరెస్ట్‌ చేస్తే అసలు దొంగలెవరో బయటపడుతుంది. కాని ఎప్పటికపుడు ఎంతో విలువైన ఎర్రచందనం దొంగలపాలవుతూనే ఉంది. దర్జాగా విదేశాలకు వెళుతోంది. కొంతమంది ప్రబుద్ధులు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు.

ఎర్రచందనం చెట్లు నరకడం నేరమే. నరికేవారిని అరెస్ట్‌ చేసి జైళ్ళలో వేయాలి. శిక్ష వేయించాలి. ఇందులో రెండో ప్రశ్నకు ఆస్కారమే లేదు. కాని నిరాయుధులైన కూలీల్ని కాల్చి చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు. గతంలో వీరు అటవీ సిబ్బందిని, పోలీసులను ఎదరించి చంపేసిన ఘటనను ఉన్నాయంటున్నారు. ఎవరైనా నేరస్థులు ఎక్కువ మంది, పోలీసులు తక్కువ మంది ఉంటే అదే జరుగుతుంది. అలా కాకుండా నేరస్థులు 20 మంది కేవలం గొడ్డళ్ళతోనే ఉంటే..పోలీసులు రెండు మూడు వందల మంది తుపాకులతో వెళితే ఎర్ర చందనం కూలీలు తిరగబడే అవకాశమే లేదు. అందుకే వారిని పిట్టలు కాల్చినట్లు కాల్చేశారు. పైగా అంతా అయిపోయాక తమ ఘాతుకాన్ని సమర్థించుకుంటున్నారు. ఈ కూలీలంతా తమిళనాడుకు చెందినవారే. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి, ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాదానికి, రాయలసీమ ఫ్యాక్షనిజానికి, నక్సలిజానికి కారణం ఒక్కటే. ఉపాధి లేకపోవడం, అణచివేత, ఆర్థిక అసమానతలు. తమిళనాడులోని కొన్ని జిల్లాలకే పరిమితమైన ఈ ఎర్ర చందనం కూలీలు కూడా చేయడానికి పనిలేక, స్మగ్లర్లు ఎరగా వేసే డబ్బుకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కేవలం తమ ప్రాంతంలో పనిలేకే వారు చెట్లు నరికే పనికి ఒప్పుకుంటున్నారు. ఎర్రచందనం చెట్లు నరకడం నేరమని వారికి తెలిసుండకపోవచ్చు. ఎందుకంటే అటవీ సిబ్బంది వేలకు వేలు జీతాలు తీసుకుంటూనే అడవులన్నీ ఖాళీ కావడానికి స్మగ్లర్లకు సహకరిస్తున్నారు. వారికి కొందరు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు సహకరిస్తున్నారు. వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అటువంటపుడు కేవలం కడుపు నింపుకోవడానికి కూలి పనులు చేసుకునే నిరుపేదలు, నిరాయుధులైనవారిని చంపే హక్కు పోలీసులకు ఎక్కడిది? ఏమైనా అంటే తిరగబడ్డారు, అందకే కాల్చాల్చివచ్చిందని కథలు చెబుతున్నారు.

ఇప్పుడు ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. కూలీల ఎన్‌కౌంటర్‌తో తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఏపీపై మండిపడుతున్నాయి. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. తెలుగువారి ఆస్థులపై దాడులు చేస్తామని బెదిరించడంతో వారికి భద్రత కల్పిస్తున్నారు. న్యాయ విచారణ జరిపించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఏపీ సీఎంకు లేఖ రాసారు. అక్కడి రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News