కేరళలో తొలిసారి జూ కాపలాదారులుగా స్త్రీలు
కేరళలో మొట్టమొదటిసారిగా ఐదుగురు మహిళలను జూ లో కాపాలాదారులుగా నియమించారు.
కేరళలో మొట్టమొదటిసారిగా ఐదుగురు మహిళలను జూ లో కాపాలాదారులుగా నియమించారు. త్రిష్యూర్ లోని పుతూర్ జూలాజికల్ పార్కులో అటవీ శాఖాధికారులు ఈ నియామకాలు చేశారు. ప్రస్తుతం ఈ జూని కొత్తగా అభివృద్ధి పరుస్తున్నారు. కేరళలో మొట్టమొదటి మహిళా జూ కీపర్లుగా వీరు చరిత్ర సృష్టించనున్నారని అక్కడి అటవీశాఖాధికారులు తెలిపారు. త్రిష్యూర్, తిరువనంతపురంలలో ఉన్న వందల ఏళ్లనాటి పాత జూలలో ఇప్పటివరకు మగవారే కీపర్లుగా పనిచేస్తున్నారు.
రేష్మ, కష్టా కె చంద్రన్, శోబి, సాజీనా, నెషితా అనే అయిదుగురు మహిళలు... జూకీపర్లుగా పనిచేయటం మగవారికి మాత్రమే సాధ్యమనే అభిప్రాయం తప్పని నిరూపిస్తూ క్రూర మృగాల కాపలాదారులుగా విధుల్లో చేరారు. జూ కీపర్లుగా శిక్షణ పొందిన ఈ అయిదుగురు మహిళలు జూ లో జంతువులను ఒకబోనునుండి మరొక బోనుకి యంత్రపరికరాల సహాయంతో మార్చడం, బోనులను శుభ్రం చేయటం, జంతువులకు తిండి పెట్టటం, వాటిని పరిశీలిస్తూ వాటి ఆరోగ్య పరిస్థితులను గమనించడం లాంటి విధులను నిర్వహించాల్సి ఉంటుంది. పన్నెండేళ్ల వయసున్న వైగా అనే పులికి సంబంధించిన కార్యక్రమాలను ఈ మహిళలు తమ తోటి మగ ఉద్యోగులతో సమానంగా నిర్వర్తిస్తున్నారని అటవీ శాఖాధికారులు తెలిపారు. ఈ పులిని తిరువనంతపురం జూ నుండి త్రిష్యూర్ జూ కి తెప్పించారు. మరిన్ని జంతువులను ఇతర జూలనుండి ఇక్కడికి తెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు.
తామందరికీ జంతువులంటే ప్రేమ ఉందని అందుకే ఈ అవకాశం వచ్చినప్పుడు ఆనందంగా ఉద్యోగాల్లో చేరామని రేష్మ తెలిపింది. ప్రతిరోజు పులులకు సంబంధించిన పనులను చేస్తున్నా తాము వాటిని ముట్టుకోబోమని, అవి క్రూర మృగాలు కనుక వాటిని ముట్టుకోకూడదని ఆమె అన్నారు. వైగా గురించి చెబుతూ పేరు పెట్టి పిలిస్తే అది స్పందిస్తుందని, వైగాకి మ్యూజిక్ అంటే ఇష్టమనే విషయం తాము గమనించామని రేష్మ పేర్కొంది. వీరిలో చంద్రన్ గిరిజన జాతికి చెందిన మహిళ. ఆమెకు చిన్నతనంలో అడవిలో ఎలుగుబంట్లు, ఏనుగులకు దగ్గరగా మసలిన అనుభవం ఉంది. కేరళలో ఇంతవరకు మహిళా జూ కీపర్లు లేరని, మహిళలు ఈ విధులు నిర్వర్తించడం చాలా అరుదని పుతూరు జూ డైరక్టర్ ఆర్ కీర్తి అన్నారు.