కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వారి చిట్టా పింకు బుక్‌లో రాస్తామని మా టైం వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. శుక్రవారం కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగోటంలో లింగాకారంలో లక్ష్మీనరసింహస్వామి వారు ఉండడం అన్నది చాలా ప్రత్యేకమైనటువంటి క్షేత్రంగా గమనిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రత్యేకమైన క్షేత్రం కోసం మాజీ సీఎం కేసీఆర్ రూ. 17 కోట్లు మంజూరు చేస్తే మరి ఆ దేవుడికి ఇచ్చిన డబ్బులు కూడా జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయడం అన్నది దౌర్భాగ్యం అన్నారు.
ఒక ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు ఇంకొక ప్రభుత్వంలో కొనసాగాలి. దానివల్ల ప్రజలకు లాభం జరగాలి. కానీ ఏదో ప్రజల మీద కక్ష కట్టినట్లు దేవుడిపై కక్ష కట్టి కేసీఆర్ ఇచ్చినటువంటి రూ. 17 కోట్లను క్యాన్సిల్ చేయించడం చాలా దారుణమన్నారు. తక్షణమే క్యాన్సిల్ చేసినటువంటి డబ్బుల్ని తీసుకొని వచ్చి ఆలయ అభివృద్ధి కోసం జూపల్లి కృష్ణారావు కృషి చేయవలసిందిగా డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే ఒక ఫేస్‌బుక్‌లో చిన్న పోస్టులు పెట్టిన లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించిన కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి ఘటనలు ఉన్నాయన్నారు.