Telugu Global
Telangana

తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ రెడ్డి నిలువునా మోసం చేశాడు : కేటీఆర్‌

కాంగ్రెస్ పార్టీ రైతులకు తీరని ద్రోహం, అన్యాయం చేసిందని కేటీఆర్ అన్నారు

తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ రెడ్డి నిలువునా మోసం చేశాడు : కేటీఆర్‌
X

కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ మాజీ మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఎకరానికి 15 వేలు ఇస్తామని 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమే తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరని కేటీఆర్ అన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ ఈ కాంగ్రెస్ ను రైతన్నలు పాతరేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ రైతాంగానికి చేసిన ఈ ద్రోహం.. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి ఏపీలోనే బాగుందనటం నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావొచ్చునా ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయమంటే రేవంత్ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు కష్టమెస్తే వస్తానని చెప్పిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వరంగల్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ చెత్త బుట్టలో వేసిందని విమర్శించారు. రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామని పచ్చి మోసానికి సీఎం రేవంత్ తెరదీశారని ఆరోపించారు. రేవంత్‌తో‌ స్నేహం చేస్తున్న. భట్టి కూడా అప్పులపై అబద్దాలు చెబుతున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌ అన్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్రం అప్పులపాలైందని ప్రచారం చేస్తున్నారు. బాగోలేనిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు.. మీ మానసిక పరిస్థితి. సరిదిద్దాల్సిన స్థానంలో కూర్చొని రాష్ట్రం గురించి తక్కువగా మాట్లాడతారా? వందరోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేశారు. రైతులకు ఇచ్చిన గ్యారెంటీ అని రైతు భరోసా గురించి ఆనాడు రాహుల్‌ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసింది రేవంత్‌రెడ్డి. హైడ్రా, మూసీ పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే పెట్టుబడులు పెట్టడానికి, అప్పులు ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారు?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. రైతాంగానికి సంఘీభావంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

First Published:  5 Jan 2025 3:36 PM IST
Next Story