Telugu Global
Telangana

కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు అన్యాయం చేశాయి : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు బీసీలను అడుగడుగునా అన్యాయం చేశాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు అన్యాయం చేశాయి :  ఎమ్మెల్సీ కవిత
X

కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు బీసీలను అడుగడుగునా అన్యాయం చేశాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రానున్న స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌లో నిర్వహించిన బీసీ సంఘాల మహాసభలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇవాళ మహాత్మా జ్యోతిబాపూలే సతీమణి సావిత్రిబాయి పూలే 194వ జన్మదినమని, దేశంలోని ఆడబిడ్డలందరికీ నేడు పండగ దినమని కవిత చెప్పారు. సావిత్రబాయి పూలే పులి బిడ్డ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కర్ణాటక, బిహార్, మహారాష్ట్ర ఫెయిల్యూర్ స్టోరీ తెలియకుండానే హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు.

బీసీల లెక్కలపై ఒక కమిషన్ వేస్తే మరో కమిషన్ రిపోర్టు ఇస్తున్నదని, ఇది రేపు కోర్టుల్లో నిలుస్తుందా అని అన్నారు. ఈ కుట్రపై కాంగ్రెస్ జవాబు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. నెహ్రూ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్టును నెహ్రూనే తిరస్కరించడం ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం కాదా అని కవిత ప్రశ్నించారు. 1955 లో నెహ్రూ ఆ నివేదికను తిరస్కరిస్తే ఆ తర్వాత 25 ఏళ్లు ఎవరూ బీసీల గురించి పట్టించుకోలేదన్నారు. పదేళ్లు బీసీలు గుర్తుకురాలేదా అని తమను బీసీలు ప్రశ్నించేవారికి కాంగ్రెస్ చరిత్ర అంతా చెప్తామన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే చేశారన్నారు. సోనియమ్మ రాజ్యంలో 2011లో రూ. 4500 కోట్లు వెచ్చించి కులగణన చేసి, ఇప్పటివరకు ఆ నివేదిక బయట పెట్టలేదన్నారు. బీజేపీ కూడా ఆ రిపోర్టును బయటపెట్టకపోగా కులగణనకు వ్యతిరేకం అని బహిరంగంగానే చెబుతున్నదని విమర్శించారు. ప్రతి ఒక్కరూ కులాల ఆధారంగానే జీవిస్తున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం రాసిన పెద్దలు కొన్ని హక్కులు కల్పించారు. రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు దేశ ప్రజలందరూ చేతిలెత్తి మెుక్కాలి.

ఆయన హక్కులు కల్పించకపోతే ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికీ ఎటువంటి ఫలాలు దక్కేవి కాదు. అలాగే బీసీలోని అన్ని కులాలకు రాజ్యాంగంలో రక్షణ కల్పిస్తే బాగుండేంది.1953లో అప్పటి ప్రధాని నెహ్రూ బీసీలపై అధ్యయనం చేయడానికి కాకా కాలేల్కర్ కమిషన్ వేశారు. పాపం ఆ పెద్దమనిషి రెండేళ్లు శ్రమించి రిపోర్టు ఇస్తే నెహ్రూ దాన్ని తిరస్కరించారు. ఇది చరిత్ర, కాదనలేని వాస్తవం. ఇందిరమ్మ రాజ్యమని ఇవాళ గొప్పలు చెప్తు్న్నారు. ఆమె హయాంలోనూ మండల్ కమిషన్ రిపోర్టును పదేళ్లపాటు బీరువాలో పెట్టారు. మండల్ కమిషన్ రిపోర్టును వీపీ సింగ్ అమలు చేస్తే ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛినం అవుతుందని ఆనాడు రాజీవ్ గాంధీ చెప్పలేదా?. బీసీల కోసం పోరాడే మమ్మల్ని మీకు ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసిందని"కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  3 Jan 2025 2:43 PM IST
Next Story