Telugu Global
Sports

13 ఏళ్ల భారత ప్రపంచకప్ కల నెరవేరేనా?

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ ..2007 తరువాత మరో ప్రపంచకప్ కోసం తహతహలాడుతోంది.

13 ఏళ్ల భారత ప్రపంచకప్ కల నెరవేరేనా?
X

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ ..2007 తరువాత మరో ప్రపంచకప్ కోసం తహతహలాడుతోంది. 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ బరిలోకి హాట్ ఫేవరెట్ గా దిగుతోంది.....

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ కు టీ-20 ప్రపంచకప్ అందని ద్రాక్షలా తయారయ్యింది. 2007 ప్రపంచకప్ ను ధోనీ నాయకత్వంలో నెగ్గిన నాటినుంచి గత 17 ఏళ్లుగా భారత్ మరో టీ-20 ప్రపంచకప్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ లాంటి ప్రపంచ మేటి ఆటగాళ్లు, అత్యుత్తమ ర్యాంకు ఉన్నా..భారత్ పరిస్థితి 'అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో...' అన్నట్లుగా తయారయ్యింది.

ముగ్గురు మొనగాళ్లకు ఇదే ఆఖరి చాన్స్...

భారత క్రికెట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన దేశానికి ఓ ప్రపంచకప్ సాధించి పెట్టి మరీ సగర్వంగా రిటైర్ కావాలని భావిస్తున్నాడు. ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ లో పాల్గొన్న భారతజట్లకు రోహిత్ శర్మే నాయకత్వం వహించాడు. అయితే..రన్నరప్ స్థానాలతోనే భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే..ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ ను ఆరునూరైనా నెగ్గితీరాలన్న పట్టుదలతో భారత్ బరిలోకి దిగుతోంది.

అమెరికా గడ్డ తొలిసారిగా ....

టెస్టు హోదా పొందిన దేశాలకు మాత్రమే పరిమితమైన క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసీసీ ) నేపాల్, ఉగాండా లాంటి చిన్నాచితకా జట్లకు సైతం ప్రపంచకప్ లో పాల్గొనే అవకాశం కల్పించింది.

ప్రస్తుత ప్రపంచకప్ ను రికార్డుస్థాయిలో 20 జట్లతో నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడామార్కెట్ అమెరికాకు క్రికెట్లోని మజాను పరిచయం చేయటానికి ఐసీసీ తొలిసారిగా అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాలు వేదికగా 2024 ప్రపంచకప్ ను నిర్వహిస్తోంది.

జూన్ 1 నుంచి 29 వరకూ జరిగే ఈ గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ సమరాన్నిఅమెరికాలోని డాలస్, న్యూయార్క్ నగరాలతో పాటు వెస్టిండీస్ ( కరీబియన్ ద్వీప దేశాల) వేదికల్లో సైతం నిర్వహిస్తున్నారు.

55 మ్యాచ్ ల హంగామా టీ-20 ప్రపంచకప్...

టీ-20 ప్రపంచకప్ గ్రూపులీగ్ కమ్ నాకౌట్ రౌండ్ మ్యాచ్ లను కరీబియన్ ద్వీపాలలోని ఆరు ( బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్, ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా అకాడమీ స్టేడియం, గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం, ఆంటీగా లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, సెయింట్ లూకాలోని డారెన్ సామీ క్రికెట్ గ్రౌండ్, సెయింట్ విన్సెంట్ లోని ఆర్నోస్ వాలే స్టేడియం ) వేదికలుగాను, అమెరికాలోని మూడు ( న్యూయార్క్ లోని ఐసెన్ హోవర్ పార్క్, ఫ్లారిడాలోని లాడెర్ హిల్, , టెక్సస్ లోని గ్రాండ్ ప్రయరీ) వేదికల్లోనూ 55 మ్యాచ్ ల గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ ప్రపంచకప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

జూన్ 1 నుంచి 18 వరకూ గ్రూప్ లీగ్ పోటీలు..

జూన్ 1 నుంచి 18 వరకూ గ్రూపు దశ పోటీలు జరుగుతాయి. జూన్ 19 నుంచి 24 వరకూ సూపర్ - 8, జూన్ 26, 27 తేదీలలో సెమీఫైనల్స్, జూన్ 29న ఫైనల్స్ నిర్వహిస్తారు.

గ్రూప్- ఏ లీగ్ లో హాట్ ఫేవరెట్ భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్ జట్లతో ఐర్లాండ్, కెనడా, అమెరికా జట్లు తలపడతాయి.

గ్రూపు- బీ లీగ్ లో ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ జట్లు పోటీపడతాయి. గ్రూప్- సీ లీగ్ లో న్యూజిలాండ్, అప్ఘనిస్థాన్, ఉగాండా, పాపువా న్యూగినియా, గ్రూప్- డీ లో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఢీ కొంటాయి.

తొలిదశ గ్రూపులీగ్ లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా ఢీ కొంటాయి. గ్రూపులీగ్ దశ నుంచి రెండోదశ కు చేరిన ఎనిమిది అత్యుత్తమ జట్ల నడుమ సూపర్- 8 రౌండ్ పోరును నిర్వహిస్తారు.

సూపర్ - 8 రౌండ్ మొదటి నాలుగుస్థానాలలో నిలిచిన జట్లు సెమీఫైనల్ నాకౌట్ రౌండ్లో పోటీపడతాయి.

జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ తో భారత్ తన తొలి గ్రూపుమ్యాచ్ ఆడనుంది. జూన్ 9న జరిగే కీలక పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

జూన్ 15న ఫ్లారిడా వేదికగా జరిగే పోటీలో పసికూన కెనడాతో భారత్ తలపడనుంది. భారత్ సూపర్ -8 రౌండ్ చేరితే జూన్ 20, 22, 24 తేదీలలో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల నుంచి భారత్ కు గట్టిపోటీ ఎదురుకానుంది. భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ ఐపీఎల్ లో కనబరచిన జోరునే ప్రపంచకప్ లో సైతం కొనసాగించగలిగితే రోహిత్ సేనకు తిరుగే ఉండదు. భారతజట్టులోని సగంమంది ఆటగాళ్లకు ఇదే ఆఖరి ప్రపంచకప్ కానుండడంతో చావో బతుకో అన్నట్లుగా పోరాడుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

జట్టులోని కీలక ఆటగాళ్లంతా స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే భారత్ మరోసారి టీ-20 ప్రపంచకప్ అందుకోడం ఏమంత కష్టంకాబోదు. 29 రోజులపాటు 55 మ్యాచ్ లుగా సాగే టీ-20 ప్రపంచకప్ విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులకు పసందైన క్రికెట్ విందే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  2 Jun 2024 6:18 AM GMT
Next Story