తొలి రోజు ఆటలో టీమిండియాదే పైచేయి... ఆసీస్ 67-7
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ పస్ట్ టెస్టులో తొలిరోజు భారత జట్టు పైచేయి సాధించింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు పైచేయి సాధించింది. టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ కాగా అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారులు ఆట చివరకు 7 వికెట్లకు 67 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ల విజృంభణతో ఆసీస్ విలవిల్లాడింది. ఏ దశలోనూ ఆసీస్ బ్యాటింగ్ కుదురుగా సాగలేదు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(4/17) సంచలన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా నడ్డివిరిచి టీమిండియాను పోటీలోకి తెచ్చాడు.
రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ చేస్తున్న యార్కర్ కింగ్ అనుభవజ్ఞుడిలా జట్టును నడిపించాడు. ఏ మాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా బౌలింగ్ యూనిట్‌కు సమర్ధంగా నాయకత్వం వహించి ఆసీస్ బ్యాటర్లకు దిమ్మదిరిగి పోయేలా చేశాడు. పస్ట్ ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే 4 కీలక వికెట్లు తీసి తానొక చాంపియన్ బౌలర్ అని బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. ఈ స్పీడ్‌స్టర్ ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కకావికలం కాగా కంగారూ జట్టు ఎదురీదుతోంది. మాజీ క్రికెటర్లు బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.