రెడ్ డైరీ పేరుతో పోలీసుల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా..?
రెడ్ డైరీలో పేర్లు రాస్తున్నానంటూ పోలీసుల అధికారులను లోకేష్ బెదిరించే ప్రయత్నం చేస్తుంటే.. రేవంత్‌రెడ్డి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతుండటం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుమారుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అధికార పార్టీ తమకు సహకరించని అధికారుల పేర్లు రెడ్ డైరీలో రాసుకుంటున్నానని, తాము అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరిచేస్తామని యువగళం పాదయాత్రలో పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా పోలీసుల పేర్లే ఇందులో ఉంటాయని హింట్లు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ శ్రేణులు అల్లరకు దిగకుండా పోలీసులు కట్టడి చేసినందుకు అక్కడ ఎస్పీ రిషాంత్‌రెడ్డిపై లోకేష్ అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. రిషాంత్‌రెడ్డి పేరే రెడ్ డైరీలో మొదటిదని ఓ వార్నింగ్ కూడా ఇచ్చేశారు.
తెలంగాణలో రేవంత్‌రెడ్డి
మరోవైపు టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. "అన్నీ గుర్తుపెట్టుకుంటా, పోలీసుల తప్పులన్నీ రెడ్ డైరీలో రాసుకుంటున్నా, అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా తిరిగి చెల్లిస్తా"నంటూ మహబూబ్ నగర్ జిల్లా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. దాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రేవంత్‌పై ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగకుండా పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు భూత్పూర్, జడ్చర్ల పోలీస్ స్టేషన్లలో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టారు.
బ్లాక్‌మెయిల్ చేసే వ్యూహమేనా?
రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైనా చంద్రబాబు శిష్యుడేనన్నది రాజకీయ వర్గాల్లో బలమైన అభిప్రాయం. ఓపక్క చంద్రబాబు కుమారుడు ఏపీలో రెడ్ డైరీలో పేర్లు రాస్తున్నానంటూ పోలీసుల అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తుంటే.. ఇక్కడ రేవంత్‌రెడ్డి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతుండటం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదంతా చంద్రబాబు ట్రైనింగ్ అంటూ అధికార పార్టీ నేతల నుంచి కామెంట్లు కూడా వస్తున్నాయి.