అదానీ వ్యవహారంపై కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం
సోమవారం నాడు జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, సెబీతో సహా ఇతర నియంత్రణ సంస్థలు విచారణ చేయగలవని, అయితే కోర్టు తన తరపున ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అన్నారు.
అదానీ స్కాంపై దాఖలైన పిటిషన్లపై ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ అనే న్యాయవాదులు వేసిన పిటిషన్ లపై జరిగిన విచారణ సందర్భంగా.. హిండెన్‌బర్గ్ నివేదికపై విచారణకు కమిటీని నియమించేందుకు తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కమిటీలో చేర్చాల్సిన వారి పేర్లను సీల్డ్ కవరులో ఇవ్వవచ్చని కూడా కేంద్రం స్పష్టం చేసింది.
సోమవారం నాడు జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, సెబీతో సహా ఇతర నియంత్రణ సంస్థలు విచారణ చేయగలవని, అయితే కోర్టు తన తరపున ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అన్నారు. ఈ కమిటీలో ఎవరెవరు చేరవచ్చో బుధవారంలోగా చెప్పాలని మెహతాను కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది.
ప్రస్తుత నియంత్రణ వ్యవస్థను ఎలా మెరుగుపరచాలో ఈ కమిటీ సూచించనుంది. దీనితో పాటు పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాలని, స్టాక్ మార్కెట్‌లో భారతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా పటిష్టమైన యంత్రాంగం ఉండాలని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది.
దీంతో పాటు రెగ్యులేటరీ మెకానిజంను పటిష్టం చేసేందుకు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఈ రంగంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ కమిటీ ఏర్పాటుకు కేంద్రం సోమవారం అంగీకరించింది.
స్టాక్ మార్కెట్ అనేది పెద్ద పెట్టుబడిదారులు మాత్రమే పెట్టుబడి పెట్టే ప్రదేశం కాదని పేర్కొన్న కోర్టు, మారుతున్న ఆర్థిక, పన్ను విధానంతో, మధ్యతరగతి ప్రజలు విస్తృతంగా పెట్టుబడి పెడుతున్నారని కోర్టు పేర్కొంది. కొన్ని నివేదికల ప్రకారం, ఇటీవల అదానీ షేర్లు భారీగా పడిపోయిన కారణంగా భారతీయ పెట్టుబడిదారులకు జరిగిన మొత్తం నష్టం అనేక లక్షల కోట్ల రూపాయలుంటుందని కోర్టు పేర్కొంది.
కాగా, అదానీ గ్రూప్‌పై మోసపూరిత లావాదేవీలు, షేర్ల ధరలలో అవకతవకలు వంటి అనేక తీవ్రమైన ఆరోపణలను 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' బహిర్గతం చేయడంతో గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు బాగా పడిపోయాయి.