భద్రాచలం నుంచి భాగ్యనగరం.. గొంగడి త్రిష ప్రస్థానం
తెలుగమ్మాయి గొంగడి త్రిష ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించింది.
అండర్ 19 టీ20 మహిళా ప్రపంచ కప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలవటంలో కీలక పాత్ర పోషించింది తెలుగు తేజం గొంగడి త్రిష. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్వస్థలం. ‘అండర్-19 టీ20 ప్రపంచకప్’లో పరుగుల వరద పారించి వరల్డ్ కప్ చరిత్రలో తొలి సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. మిథాలీ రాజ్ , స్మృతి మంధాన, షెఫాలీ వర్మ. భారత ఉమెన్ క్రికెట్ లో సంచలనాలు సృష్టించారు. ఆ వరుసలో చేరేందుకు సంసిద్ధమవుతోంది తెలుగుతేజం. అద్భుతమైన బౌలింగ్, ఔరా అనిపించే బ్యాంటింగ్‌తో ప్రత్యర్థులకు ముచ్చేమటలు పట్టిస్తోంది. పల్లెటూరి నుంచి మొదలైన క్రీడాకుసుమం.. ప్రపంచ వేదికపై పరుగుల వరద పారించింది. స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో తన మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఈ కప్‌లో మరో అపురూప విజయాన్ని అందించింది త్రిష. 59 బంతుల్లోనే 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఆమె ఇన్నింగ్స్‌లో 4 సిక్స్‌లు, 13 ఫోర్లు ఉన్నాయి. త్రిష తండ్రి రామిరెడ్డికి చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. రామిరెడ్డి కూడా స్వతహాగా క్రీడాకారుడు. అండర్-16లో రాష్ట్ర హాకీ జట్టులో సభ్యుడైన ఆయన క్రికెట్ కూడా ఆడేవారు. ఆ తర్వాత జీవితంలో స్థిరపడటంపై దృష్టి సారించిన ఆయన.. ఐటీసీ జిమ్ ట్రైనర్‌గా ఉద్యోగం చేస్తూ సొంతంగా జిమ్ నడిపేవారు.కుమార్తెను ఏదో ఒక స్పోర్ట్‌లో రాణించేలా ప్రోత్సహించాలని భావించిన రామిరెడ్డి తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడేలా త్రిషను ప్రోత్సాహించారు.
కానీ, కూతురు సత్తా, ఉత్సాహం చూసి.. తను క్రికెట్‌కు బాగా సరిపోతుందని గుర్తించారు. రెండున్నరేళ్ల వయసులో ప్లాస్టిక్ బాల్, బ్యాట్‌తో ఆయనే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఐదేళ్ల వయసొచ్చాక తనతో పాటు జిమ్‌కు తీసుకెళ్లి.. రోజుకు మూడొందల బంతులను త్రిషకు వేసేవారు. ఆ తర్వాత సిమెంట్ పిచ్‌ను ఏర్పాటు చేసి త్రిషతో ప్రాక్టీస్ చేయించేవారు.త్రిషకు మెరుగైన శిక్షణ అవసరమని భావించిన రామిరెడ్డి.. 2012లో ఆమె నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా వీడియో తీసి హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ అకాడమీలోని కోచ్‌లు జాన్ మనోజ్, శ్రీనివాస్‌కు చూపించారు. ఆ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న కోచ్ మనోజ్.. త్రిష ఆటతీరును చూసి ముగ్ధులయ్యారు. అలా త్రిషకు హైదరాబాద్‌లో క్రికెట్ కోచింగ్ తీసుకునే అవకాశం వచ్చింది. ఇందుకోసం రామిరెడ్డి ఫ్యామిలీ భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు మారింది. అలా ఏడేళ్ల వయసులోనే త్రిష క్రికెట్ కోసం భాగ్యనగరంలో అడుగుపెట్టింది. త్రిషకు ఆట పట్ల ఉన్న టెక్నికల్ నాలెడ్జ్‌ను గమనించిన కోచ్‌లు.. అప్పటివరకూ ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న త్రిషను లెగ్ స్పిన్ వేయాలని సూచించారు. దీంతో అనిల్ కుంబ్లేను అనుకరిస్తూ ఆమె లెగ్ స్పిన్ వేయడం మొదలుపెట్టింది.
భద్రాచలం నుంచి భాగ్యనగరానికి షిఫ్ట్ అయిన రెండేళ్లలోపే త్రిష హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడింది. ఆ తర్వాతి ఏడాదే అండర్-19, అండర్-23లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అటుపై అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో ఆడే అవకాశం త్రిషకు లభించింది. కొంత కాలం తర్వాత హైదరాబాద్ అండర్-19 విమెన్స్ కోచ్ నూషిన్ అల్ ఖాదీర్‌కు త్రిష గురించి ఆమె కోచ్‌లు చెప్పారు. త్రిష ఆటతీరు నచ్చడంతో ఆమె కూడా త్రిష కోసం సమయం కేటాయించారు. కొంతకాలం తర్వాత భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా ఆ కోచింగ్ అకాడమీలో భాగమయ్యారు. దీంతో త్రిష ఫీల్డింగ్ కూడా మెరుగుపడింది. 2023లో త్రిషకు ఏకంగా ఐసీసీ అండర్-19 ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది. ఇవాళ జరిగిన అండర్ 19 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో త్రిష 44 పరుగుల చేసి 3 వికెట్లు తీసి టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది