Telugu Global
Editor's Choice

బుల్డోజర్‌ రాజ్‌ ఆపు.. ఇది రాహుల్ మాట

సీఎం రేవంత్‌ రెడ్డికి తేల్చిచెప్పిన కేసీ వేణుగోపాల్‌

బుల్డోజర్‌ రాజ్‌ ఆపు.. ఇది రాహుల్ మాట
X

తెలంగాణలో బుల్డోజర్‌ రాజ్‌ ఆపేయాలని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి తేల్చిచెప్పారు. ఇది తాను చెప్తోన్న మాట కాదని.. పార్టీ ముఖ్యనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చెప్పిన మాట అని స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ పేరుతో వేలది కుటుంబాలను తరలించే ప్రయత్నాలపై మాట్లాడేందుకు రేవంత్‌ రెడ్డిని ఢిల్లీకి పిలిపించాలని రాహుల్‌ గాంధీ ఆదేశించారు. రాహుల్‌ ఆదేశాల మేరకు కేసీ వేణుగోపాల్‌ అర్జంట్‌ గా ఢిల్లీకి రావాలని రేవంత్‌ కు సూచించారు. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఖర్గేను రేవంత్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పల్లంరాజు సోదరుడి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ కూల్చేసినప్పుడే మందలించామని రేవంత్ కు గుర్తు చేశారు. అప్పుడే జాగ్రత్త పడి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది ఉండేది కాదని ఖర్గే సీఎం రేవంత్‌ తో అన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు ఆఫ్‌ ది రికార్డుగా చెప్తున్నారు. పేదల ఇండ్ల కూల్చివేతలపై ఇంత మొండిగా వెళ్లడం ఏమిటని కూడా ఖర్గే ప్రశ్నించినట్టుగా తెలిసింది. పార్టీకి చెడ్డపేరు తెచ్చుకునే ప్రయత్నాలు మానుకోవాలని, సంయమనంతో వ్యవహరించాలని.. దూకుడు తగ్గించుకోవాలని ఖర్గే స్పష్టం చేసినట్టు తెలిసింది. రేవంత్‌ వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేసినా వాటిని ఆయన వినిపించుకోలేదని తెలిసింది.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్‌ రాజ్‌ కు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తుంటే తెలంగాణలో కూల్చివేతలు ఏమిటని రాహుల్‌ గుర్రుగా ఉన్నారని కేసీ వేణుగోపాల్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి చెప్పారని తెలిసింది. తెలంగాణలో మహాలక్ష్మీ స్కీంలో భాగంగా ఉచిత బస్‌ సౌకర్యం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నామని.. సోషల్‌ మీడియాలో హైడ్రా కూల్చివేతల వీడియోలు వైరల్‌ చేస్తున్నారని.. వాటిపై తమను ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పుకోలేని స్థితి కాంగ్రెస్‌ కల్పించారని కేసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హర్యానాలో కాంగ్రెస్‌ కు పాజిటివ్‌ వాతావరణం ఉందని.. తెలంగాణలో హైడ్రా పేరుతో సాగుతోన్న కూల్చివేతల పర్వం ఆపకపోతే తమ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అదే తరహా వాతావరణం నెలకొంటుందనే ప్రచారం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీకి సంప్రదాయంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు ఓటు బ్యాంకుగా ఉన్నారని.. తెలంగాణలో ఎక్కువగా ఆ కులాల వారినే టార్గెట్‌ చేసి కూల్చివేతలు జరుగుతున్నాయని పార్టీ అగ్రనేతలకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే పాలన పరమైన నిర్ణయాలు లాభం చేసేలా ఉండాలే తప్ప జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి తలవంపులు తెచ్చేవిగా ఉండొద్దని సూచించారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారికి సేవ చేయాలనే తప్ప.. వాళ్ల ఇండ్ల మీదికి బుల్డోజర్లు పంపాలని కాదనే విషయాన్ని ముందు గుర్తించాలన్నారు. ఇకనైనా బుల్డోజర్‌ రాజ్‌ ఆపకుంటే కాంగ్రెస్‌ పార్టీకి పెను నష్టం తప్పదని హెచ్చరించారు. ఇవేవి తాను చెప్తోన్న మాటలు కావని.. హర్యానా ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్‌ గాంధీనే ఈ విషయాలన్నీ చెప్పారని వివరించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, అందరిని కలుపుకొని పోవాలని, అందరి అభిప్రాయాల మేరకే పాలన సాగించాలని స్పష్టం చేశారని తెలిసింది. ఈక్రమంలో రేవంత్‌ వివరణ ఇచ్చుకోవడానికి పలు ఉదారహణలు చెప్పడానికి ప్రయత్నించగా.. వాటికి మించిన నష్టం చేసిన ఘటనలెన్నో ఉన్నాయని.. ఆ వివరాలు కావాలా అని కేసీ ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో చేసేదేమి లేక రేవంత్‌ కేసీ నివాసం నుంచి బయటకు వచ్చేశారని పార్టీ నేతలు చెప్తున్నారు.

First Published:  1 Oct 2024 9:22 PM IST
Next Story