లోకేశ్ డిప్యూటీపై ఎవరూ మాట్లాడొద్దు
పార్టీ నాయకులకు టీడీపీ కీలక ఆదేశం
నారా లోకేశ్ ను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేయాలన్న నాయకుల డిమాండ్లపై తెలుగు దేశం పార్టీ అలర్ట్ అయ్యింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నేతల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దొద్దని సొంత పార్టీ నాయకులను హెచ్చరించింది. ఈమేరకు సోమవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని తేల్చిచెప్పింది. ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలైనా కూటమి నాయకులు చర్చించి ఐక్యంగా నిర్ణయం తీసుకుంటారని వెల్లడించింది. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కడప జిల్లా మైదుకూరులో ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత లోకేశ్ ను ప్రమోట్ చేయాలని పార్టీ నాయకులు పలువురు కోరుతూ వస్తున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ సహా పలువురు నాయకులు తమ మనసులోని మాట ఇదేనని చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ లోకేశ్ కు డిప్యూటీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.