స్కూల్‌లో బర్త్ డే వేడుకలు నిర్వహించడంపై నారా లోకేశ్ ఆగ్రహం
ప్రభుత్వ పాఠశాల పిల్లలను ఎండలో కూర్చోబెట్టి నారా లోకేష్‌కు బర్త్‌డే విషెస్ చెప్పించడంపై మంత్రి లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా, ఉపాధ్యాయులు చిన్నారులతో కలిసి "హ్యాపీ బర్త్‌డే లోకేష్ సార్" అంటూ పేరు కూర్పులో కూర్చోబెట్టారు. దీనిపై మంత్రి లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. "రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వ విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ స్కూలులో విద్యార్థులతో నా బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వచ్చిన వార్త నన్ను మనస్థాపానికి గురిచేసింది. ఇందుకు బాధ్యులైన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించాను. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని వారిని కోరుతున్నాను" అంటూ లోకేశ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో అద్వితీయ మార్పులు తెచ్చిన లోకేశ్‌కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసినట్టు విద్యార్థులు చెబుతున్నారు.