Telugu Global
Andhra Pradesh

ఆ బాధ్యత లోకేష్ కి అప్పగించిన చంద్రబాబు

ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని వైసీపీకి ప్రజలు కట్టబెట్టారని, దానికి కారణాలు ఇప్పటికైనా తెలుసుకోవాలని జగన్ కి సలహా ఇచ్చారు లోకేష్.

ఆ బాధ్యత లోకేష్ కి అప్పగించిన చంద్రబాబు
X

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రతిపక్ష వైసీపీ నుంచి విమర్శల జోరు రోజురోజుకీ పెరిగిపోతోంది. ఢిల్లీలో సైతం ధర్నాకు సిద్ధమయ్యారు జగన్. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా స్పందించకపోవడం విశేషం. జగన్ విమర్శలతోపాటు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ఇతర అంశాలపై కూడా వారు మాట్లాడటంలేదు, కనీసం ట్వీట్ వేయడం లేదు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే బాధ్యత మంత్రి నారా లోకేష్ తీసుకున్నట్టుగా స్పష్టమవుతోంది. తాజాగా జగన్ ట్వీట్ కి కూడా లోకేష్ ఒక్కరే కూటమి నుంచి బదులిచ్చారు


కూటమి అరాచక పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, అందుకే కూటమిలో భయం మొదలైందంటూ జగన్ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ కి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్ కి ఇంకా తత్వం బోధపడలేదంటూ ఎద్దేవా చేశారు. 50 రోజుల ప్రభుత్వం, ప్రజల పట్ల భయంతో లేదని, బాధ్యతతో ఉందని గుర్తు చేశారాయన. జగన్ ఇంకా భ్రమల్లోనే ఉన్నారని చెప్పారు. వారి మాటల్లో, చేష్టల్లో అధికారం దూరమైందనే బాధ అడుగడుగునా కనిపిస్తోందన్నారు. ఫేక్ రాజకీయం పండడం లేదనే ఫ్రస్టేషన్ కనిపిస్తోందని కౌంటర్ ఇచ్చారు. ఉనికి చాటుకోలేకపోతున్నామనే నిస్పృహ వైసీపీ నేతల్లో కనిపిస్తోందన్నారు లోకేష్.

జగన్ కి సలహా..

ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని వైసీపీకి ప్రజలు కట్టబెట్టారని, దానికి కారణాలు ఇప్పటికైనా తెలుసుకోవాలని జగన్ కి సలహా ఇచ్చారు లోకేష్. వాస్తవాలు అంగీకరించాలని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరించకూడదన్నారు. అలా చేయడం వల్లే గత ఎన్నికల్లో 151లో 5 మాయం అయిందని, ఇప్పుడు 11 లో 1 మాయం అవుతుందని వెటకారం చేశారు. శిశుపాలుడు ఎవరో, ఎవరి పాపం పండిందో ఈ ఎన్నికల్లో ప్రజలే తేల్చి చెప్పారన్నారు లోకేష్.

First Published:  23 July 2024 8:17 AM IST
Next Story