Telugu Global
Andhra Pradesh

ఒకటో తేదీ జీతాలు.. లోకేష్ చెప్పింది నిజమేనా..?

ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు, మిగతా అందరికీ ఈ రెండు నెలలు ఒకటో తేదీనే జీతాలు బ్యాంకుల్లో జమ అయ్యాయి. టీడీపీ నేతలు దీన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నారు.

ఒకటో తేదీ జీతాలు.. లోకేష్ చెప్పింది నిజమేనా..?
X

గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీని ఠంచనుగా ఒకటో తేదీనే వాలంటీర్ల సహకారంతో పూర్తి చేసేది. అయితే ఉద్యోగుల జీతాల విషయంలో మాత్రం అంత ఉదారంగా లేదు. అందులోనూ ప్రభుత్వ ఉపాధ్యాయులు, జీతాల విషయంలో నాలుగేళ్లు ఇబ్బందులు పడ్డారు. 1వతేదీ జీతం అనేది దాదాపుగా వారు మర్చిపోయారు. 7వతేదీ తర్వాత 14 లోపు ఎప్పుడైనా జీతం పడుతుందిలే అని సరిపెట్టుకునేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఠంచనుగా ఒకటోతేదీనే జీతం ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు నేతలు. ఈ విషయంలో నారా లోకేష్ ట్వీట్ మరింత ఆసక్తికరంగా ఉంది.


ఓ ఉద్యోగి తన టేబుల్ పై శాలరీ క్రెడిటెడ్ అంటూ డేట్, టైమ్ సహా పలకపై రాసి ఉన్న వీడియోని నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది కాస్త అతిశయోక్తి అనుకోవచ్చు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విభాగాల ఉద్యోగులకీ ఠంచనుగా ఒకటో తేదీనే జీతాలు పడ్డాయనేది మాత్రం వాస్తవం. ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు, మిగతా అందరికీ ఈ రెండు నెలలు ఒకటో తేదీనే జీతాలు బ్యాంకుల్లో జమ అయ్యాయి. టీడీపీ నేతలు దీన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నారు.

అప్పుడే ఏముంది..?

రెండు నెలలు ఒకటోతేదీ జీతాలిచ్చినంత మాత్రాన ఏదో మార్పు వచ్చేసింది అనుకోలేం. కూటమి అధికారంలో ఉన్న మిగతా సమయంలో కూడా ఇదే పద్ధతి కొనసాగిస్తే అప్పుడు కొత్త ప్రభుత్వం గొప్పని అందరూ మెచ్చుకుంటారు. ప్రస్తుతానికి తమ పరిస్థితి మారింది అని ఉద్యోగులు అనుకుంటున్నారు, ఆ విషయంలో వారికి నమ్మకం కలగాలంటే ఇదే కొనసాగాలి. మధ్యలో ఎక్కడ చేతులెత్తేసినా గత ప్రభుత్వంపై ఆగ్రహం పెంచుకున్నట్టే కూటమి ప్రభుత్వంపై కూడా ఉద్యోగుల్లో అసంతృప్తి మొదలవుతుంది. దాని ఖరీదు ఏంటో చంద్రబాబు, జగన్ ఇద్దరికీ బాగా తెలుసు. అందుకే ఈసారి సీఎం చంద్రబాబు మొదటి తేదీ జీతం, పెన్షన్ల విషయంలో భారీగానే కసరత్తు చేస్తున్నారు.

First Published:  2 Aug 2024 8:43 AM IST
Next Story