Telugu Global
Andhra Pradesh

నెలరోజుల రావణకాష్టంపై శ్వేతపత్రం విడుదల చేయండి

రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలు, దొమ్మీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

నెలరోజుల రావణకాష్టంపై శ్వేతపత్రం విడుదల చేయండి
X

కూటమి పాలనలో నెలరోజుల్లోనే రాష్ట్రం రావణకాష్టంగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రభుత్వానికి ధైర్యముంటే ఈ నెలరోజుల్లో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే టీడీపీ మనుగడకే ప్రమాదం అని హెచ్చరించారు. ఒక కులానికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా టీడీపీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని అన్నారు విజయసాయిరెడ్డి.


ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. నేరుగా సీఎం చంద్రబాబు వీటిని విడుదల చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని శ్వేత పత్రాలు బయటకొచ్చాయి, శాంతి భద్రతల అంశంపై విడుదల కావాల్సిన వైట్ పేపర్ మాత్రం వాయిదా పడింది. రాష్ట్రంలో దాడులు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఇది సందర్భం కాదనుకుని సీఎం చంద్రబాబు ఆ ఘట్టాన్ని వాయిదా వేశారు. దీంతో ప్రతిపక్ష వైసీపీ నుంచి శ్వేతపత్రంపై డిమాండ్ వినపడుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నెలరోజుల అరాచకంపై నిజానిజాలు బయటపెట్టాలని లోకేష్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేశారు.

కూటమి అధికారంలోకి వచ్చాక నెలరోజుల నుంచి వైసీపీ టార్గెట్ గా దాడులు పెరిగిపోతున్నాయనే ఆరోపణ వినపడుతోంది. ఆక్రమణలంటూ వైసీపీ ఆఫీసుల్ని కూడా కూల్చేసిన ఉదాహరణలున్నాయి. ఇక వ్యక్తిగత దాడులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వినుకొండలో నడిరోడ్డుపై జరిగిన హత్య వీటన్నిటికీ పరాకాష్టగా నిలిచింది. నేరుగా జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యాన్నిచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ అరాచకాలపై స్పందించకపోవడాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలు, దొమ్మీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

First Published:  19 July 2024 7:18 PM IST
Next Story