ఏపీలో రాష్ట్రపతి పాలనకు జగన్ డిమాండ్
ఏపీలో జరుగుతున్న దాడులు, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఈనెల 24న మహా ధర్నా చేపట్టబోతున్నట్టు చెప్పారు జగన్.
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రషీద్ ని నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారని, ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పారు జగన్. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. ఈ దారుణాలను జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకెళ్తామని, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ ఢిల్లీ స్థాయిలో డిమాండ్ చేస్తామని చెప్పారు జగన్.
ఢిల్లీలో బుధవారం (24.07.2024) ధర్నాకి @ysjagan పిలుపు
— YSR Congress Party (@YSRCParty) July 19, 2024
ఏపీలో అరాచక పాలనకి నిరసనగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బుధవారం ఢిల్లీలో ధర్నా
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్!#SaveAPFromTDP pic.twitter.com/QmLKnxzogE
ఢిల్లీలో ధర్నా..
ఏపీలో జరుగుతున్న దాడులు, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఈనెల 24న మహా ధర్నా చేపట్టబోతున్నట్టు చెప్పారు జగన్. ఈ ధర్నాకు వైసీపీ నేతలంతా హాజరవుతారని వివరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలంతా ఢిల్లీకి వస్తారని, అక్కడ ధర్నాలో పాల్గొంటారన్నారు. ప్రధాని మోదీ సహా అందర్నీ కలసి రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి వివరిస్తామని చెప్పారు జగన్.
గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేశాడన్న ఒకే ఒక కారణంతో రషీద్ ని దారుణంగా హత్య చేశారని ఆరోపించారు జగన్. పక్కా ప్లాన్ ప్రకారం చంపి, వ్యక్తిగత కారణంగా జరిగిన దాడిగా సీన్ క్రియేట్ చేయాలనుకున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఎంపీ, ఎమ్మల్యేలపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేయడంతోపాటు, తిరిగి బాధితులపైనే కేసులు పెడుతున్నారని, ఇదెక్కడి ఘోరమని ప్రశ్నించారు. ఢిల్లీ ధర్నాతో ఈ సమస్య అందరి దృష్టికి తీసుకెళ్తామన్నారు జగన్.