ఈ ఊళ్లు ఆడవాళ్లకు మాత్రమే!

ఆడవాళ్లకు మాత్రమే’ అన్న బోర్డ్ అక్కడక్కడా చూస్తూ ఉంటాం. కానీ ఆ బోర్డ్ ఒక ఊరికి ఉండడం ఎప్పుడైనా చూశారా? ప్రపంచంలో కేవలం ఆడవాళ్లు మాత్రమే ఉండే ఊళ్లు కొన్ని ఉన్నాయి.

Advertisement
Update:2024-06-22 17:30 IST

ఆడవాళ్లకు మాత్రమే’ అన్న బోర్డ్ అక్కడక్కడా చూస్తూ ఉంటాం. కానీ ఆ బోర్డ్ ఒక ఊరికి ఉండడం ఎప్పుడైనా చూశారా? ప్రపంచంలో కేవలం ఆడవాళ్లు మాత్రమే ఉండే ఊళ్లు కొన్ని ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటిని ఆడవాళ్లకే ఎందుకు కేటాయించారో చూద్దాం.

సూపర్ షీ ఐలాండ్

ఈ ఐలాండ్ ఓనర్ క్రిస్టినారోత్. ఈమె ఒక బిజినెస్ విమన్. ఈమె బిజినెస్ విమన్‌గా ఎదగక ముందు చాలా ఉద్యోగాలను చేసింది. అలా ఉద్యోగాలు చేసేటప్పుడు మగవాళ్లు బాస్‌గా ఆమెకు ఉండటం నచ్చలేదట. చాలామంది బాస్‌లు ఆమెను ఇబ్బంది పెట్టేవారట. అందుకే తానే ఒక కంపెనీని స్టార్ట్ చేసి, బిజినెస్ విమన్ గా ఎదిగింది. తర్వాత ఆ డబ్బుతో ఏకంగా ఓ ఐలాండ్‌నే కొనేసింది. ఆ ఐలాండ్ కి ‘సూపర్ షీ ఐల్యాండ్’ అని పేరు పెట్టింది. ఇక్కడ మగవాళ్లకి నో ఎంట్రీ. ఈ ఐలాండ్ లో కేవలం మహిళలకు మాత్రమే యోగా, మెడిటేషన్ లాంటి క్లాసులు నిర్వహిస్తుంటారు. అయితే సూపర్ షీ ఐలాండ్ కు ఎంట్రీ దొరకడం అంత ఈజీ కాదు. ఇందులో ఎంట్రీ కోసం జరిగే సెలక్షన్స్‌లో స్ట్రిక్ట్ రూల్స్‌తో పాటు నాలుగువేల యూరోల ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

అల్ సమాహా

అల్ సమాహా ఊరు ఈజిప్ట్ లో ఉంది. ఈ ఊరిని ఈజిప్టు గవర్నమెంట్ నిర్మించింది. ఇక్కడ కేవలం వితంతువులు, విడాకులు తీసుకున్న వాళ్లే ఉంటారు. కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ సాయంతో.. అర్హులైన ఆడవాళ్లకి ఈ ఊర్లో ఒక ఇళ్లు, ఆరెకరాల భూమి కేటాయిస్తారు. అలాగే వాళ్లకు కావాల్సిన సరుకులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. దాదాపు మూడొందల మంది మహిళలు తమ పిల్లలతో ఇక్కడ ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగుచేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇక్కడ మరో రూల్ ఏంటంటే... వితంతువులు, విడాకులు తీసుకున్నవారిలో ఎవరైనా మళ్లీ పెళ్లి చేసుకుంటే వారికి ఇచ్చిన ఇంటిని, భూమిని తిరిగి తీసేసుకుంటారు. ఎలాంటి ఆసరా లేని మహిళలకు మాత్రమే ఇక్కడ చోటుంటుందన్న మాట.

 

ఉమోజ

ఉమోజ ఉత్తర కెన్యాలో ఉంటుంది. ఇక్కడ మగవారికి నో ఎంట్రీ. బ్రిటిషర్ల చేతిలో అత్యాచారానికి గురైన మహిళలు కలిసి ఈ ఊరిని నిర్మించినట్లు స్థానికులు చెప్తారు. ఈ ఊర్లో అత్యాచారానికి గురైన స్ర్తీలు, అనాధలైన అమ్మాయిలు, వయసైపోయిన వృద్ధులు ఇలా.. ఏ దిక్కు లేని ఆడవాళ్లకు ఉమోజ నీడనిస్తోంది. ఇక్కడ ఆడవాళ్లకు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు. ఈ ఊర్లో 50 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉంటున్నారు. పశువులు కాయడం, వ్యవసాయం చేయడం రంగురాళ్లతో రకరకాల ఆభరణాలను తయారుచేసి అమ్మడం లాంటివి చేస్తూ ఇక్కడ మహిళలు జీవిస్తుంటారు.

 

జిన్ వార్

సిరియాలో ఎప్పుడూ యుద్ధవాతావరణమే ఉంటుంది. ఎంతో మంది సైనికులు కాల్పు్ల్లో మరణిస్తుంటారు. అలా యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల భార్యల కోసం అక్కడి మహిళా సంఘాలు ‘జిన్ వార్’ అనే ఊరిని నిర్మించాయి . ఉమోజ గ్రామమే వీళ్ల ఇన్ స్పిరేషన్. ఇక్కడి మహిళలు యుద్ధవాతావరణానికి దూరంగా ఉంటూ సాధారణ జీవనం గడుపుతుంటారు. ఈ ఊర్లో మొత్తం 30 కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ ఊరికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి. ఊరి బయట మహిళలు తుపాకీతో కాపలా కాస్తుంటారు. ఎప్పుడూ గొడవలు జరిగే సిరియాలో ఇక్కడి మహిళలు మాత్రం వ్యవసాయం, పశువుల పెంపకం చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటారు.

 

Tags:    
Advertisement

Similar News