ఒక్కో మహిళకు రేవంత్ సర్కారు రూ.35 వేలు బాకీ పడ్డది
మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై కార్యాచరణ ప్రకటించాలి : ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలోని ఒక్కో మహిళకు నెలకు రూ.2,500 చొప్పున 14 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కారు రూ.35 వేలు బాకీ పడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో మంగళవారం తన నివాసంలో కవిత సమావేశమయ్యారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని.. బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మీకి తోడు తులం బంగారం, స్కూటీ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. మహిళా దినోత్సవంలోగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామల అమలుపై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తే రేవంత్ రెడ్డి మహిళలను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. మాయమాటలు చెప్పి, అబద్ధపు హామీలు ఇచ్చి మహిళలను రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామని చెప్పి మోసం చేశారని.. మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఆ ప్రక్రియనే ప్రారంభించలేదన్నారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు వెంటనే రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.