వరంగల్ వచ్చే ధైర్యం లేకనే రాహుల్ గాంధీ పారిపోయారు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Advertisement
Update:2025-02-12 15:22 IST

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రజలు నిలదీస్తారనే కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ వరంగల్‌ కు వచ్చే ధైర్యం లేక పారిపోయారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం హైదరాబాద్‌ లోని తన నివాసంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి నిర్వహించే మహిళా శంఖారావం పోస్టర్‌ ను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. వరంగల్‌లో రాహుల్‌ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ అమలు కాలేదని.. రైతులు తనను ప్రశ్నిస్తారని రాహుల్‌ గాంధీ భయపడ్డారన్నారు. ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరని తేల్చిచెప్పారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులు తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నమ్మడం లేదని ఢిల్లీ నుంచి సోనియా, ప్రియాంకా, రాహుల్‌ గాంధీ తెలంగాణకు వచ్చి చిలుక పలుకులు పలికారని గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన నేతల ముఖం చూసే మహిళలు కొంతవరకు కాంగ్రెస్‌కు ఓటేశారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వలేదన్నారు. ఒక్కో మహిళకు ఈ ప్రభుత్వం రూ.35 వేలు బాకీ పడిందన్నారు.

మహిళా సమస్యలతో పాటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం మార్చి 8న మహిళా శంఖారావం నిర్వహిస్తున్నామని తెలిపారు. రేవంత్‌ రెడ్డి పాలనలో క్రైమ్‌ రేట్‌ 20 శాతం పెరిగిందని.. మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. నగర శివారు ప్రాంతాల్లో దొంగతనాలు పెరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం తరచూ ఎక్కడో ఒకచోట మతకల్లోలాలు జరుగుతున్నాయని తెలిపారు. లా అండ్‌ ఆర్డర్‌ అదుపు తప్పిందని.. సీసీ కెమెరాల్లో 70 శాతం పని చేయడం లేదన్నారు. భద్రత కోసం మహిళలు పోరాడాల్సి రావడం బాధకరమన్నారు. కేసీఆర్‌ పై అక్కసుతో కేసీఆర్‌ కిట్‌ నిలిపివేశారని, 18 ఏళ్లు నిండిన ఆడపిళ్లలకు స్కూటీ ఇస్తామని మోసం చేశారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వ ఆస్పత్రులపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News