మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు
మన జీవితాన్ని, లైఫ్‌స్టైల్‌ను మెరగుపరచడానికి హార్మోన్లు సహాయపడతాయి. ప్రస్తుతం బిజీబిజీ లైఫ్‌స్టైల్, ఆహార అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా హార్మోన్లలో అసమతుల్యత తలెత్తుతుంది.
మన జీవితాన్ని, లైఫ్‌స్టైల్‌ను మెరగుపరచడానికి హార్మోన్లు సహాయపడతాయి. ప్రస్తుతం బిజీబిజీ లైఫ్‌స్టైల్, ఆహార అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా హార్మోన్లలో అసమతుల్యత తలెత్తుతుంది. భారతదేశంలో ప్రతి పది మంది మహిళలలో ఒకరు హార్మోన్ల అసమతుల్యత సమస్యను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లు గతి తప్పడం అనే సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. యుక్తవయసుకు వచ్చిన దగ్గర నుంచి, గర్భధారణ, కాన్పు, ప్రీ మెనోపాజ్, మెనోపాజ్.. ఇలా ఏ దశలోనైనా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు.
మన శరీరంలో వివిధ విధులను నిర్వర్తించే 50 కంటే ఎక్కువ రకాల హార్మోన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ హార్మోన్ల స్థాయి పెరిగినప్పుడు, తగ్గినప్పుడు హార్మోన్ల అసమతుల్యత లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలసట, ఏకాగ్రత కుదరకపోవడం, విపరీతంగా చెమటలు పట్టడం, వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం, మొహంపై మొటిమలు, మానసిక ఆందోళన, డిప్రెషన్, సంతానలేమి వంటివన్నీ హార్మోన్ల అసమతుల్యత యొక్క లక్షణాలు. వీటితోపాటూ పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అధిక రక్తస్రావం, జుట్టు ఊడిపోవడం, అవాంఛిత రోమాలు కూడా ఇబ్బంది పెడతాయి.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ డిజార్డర్ (PCOD) లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోం (PCOS) అనేది సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళలలో అత్యంత సాధారణంగా కనిపించే హార్మోన్ రుగ్మత. ఇది మహిళల అండాశయం పనితీరును ప్రభావితం చేస్తుంది. చాలామందికి PCOD లక్షణాలు 20ల వయసులోనే బయటపడతాయని, దీని వలన గర్భధారణలో సమస్యలు తలెత్తవచ్చని, కొంతమందిలో లక్షణాలు తొందరగా బయటపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అలాగే నెల నెల పీరియడ్స్ వచ్చే ముందు మహిళలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మూడ్స్ అటూ ఇటూ కావడం, ఆందోళన, చిరాకు, అలసట, నిద్ర పట్టకపోవడం, కడుపు ఉబ్బరం, పొత్తి కడుపులో నొప్పి, రొమ్ములు నొప్పి , తలనొప్పి మొదలైన లక్షణాలు కనిపించవచ్చు. అయితే, ప్రతి నెల ఒకే రకమైన లక్షణాలు కనిపించకపోవచ్చు కూడా . దాన్ని ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోం (పీఎంఎస్) అంటారు. పైన చెప్పిన వాటిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మహిళలకు మధ్య వయసు దాటిన తరువాత పీరియడ్స్ పూర్తిగా ఆగిపోవడాన్ని మోనోపాజ్ అంటారు. ఇది జబ్బు కాదు ఒక సహజ ప్రక్రియ. కానీ మెనోపాజ్ దశలో అధిక రక్తస్రావం లేదా మరీ తక్కువ రక్తస్రావం, అలసట, ఒళ్లంతా వేడి ఆవిర్లు రావడం, చెమటలు కక్కడం, గుండెదడ, నిద్ర పట్టక పోవడం, మానసిక ఆందోళన, చిరాకు, కోపం, డిప్రషన్, కారణం లేకుండా ఏడుపు రావడం, మరికొన్ని శారీరక సమస్యలు కనిపిస్తాయి. అయితే పీసీఓడి , పీఎంఎస్ ల కంటే ఇది కాస్త చిన్న సమస్యే. ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పని వ్యాయామం, కెఫీన్, స్మోకింగ్, ఆల్కహాల్, మసాలాలకు దూరంగా ఉండడం మొదలైనవి పాటిస్తే మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.