కోర్టుల్లో ఆ భాష, భావాలు వద్దు ... ప్రత్యామ్నాయాలతో హ్యాండ్ బుక్
కోర్టుల్లో న్యాయవాదులు, న్యాయమూర్తులు వాడుతున్న స్టీరియోటైప్ పదాలను భావాలను సవరిస్తూ సుప్రీం కోర్టు ముప్పయి పేజీల హ్యాండ్ బుక్ ని విడుదల చేసింది.
కోర్టుల్లో న్యాయవాదులు, న్యాయమూర్తులు వాడుతున్న స్టీరియోటైప్ పదాలను భావాలను సవరిస్తూ సుప్రీం కోర్టు ముప్పయి పేజీల హ్యాండ్ బుక్ ని విడుదల చేసింది. కోర్టులు తమకు తెలియకుండానే కలిగి ఉన్న కొన్నిరకాల మూస భావాలను, వాడుతున్న మూస పదాలను, గుర్తించామని, తాము వాడుతున్న భాషలో ఏ అంశాలు మూసధోరణిలో ఉంటున్నాయనే అవగాహన పెంచేందుకు, అలాంటి పదాల భావాల వినియోగాన్ని నివారించేందుకు ఈ హ్యాండ్ బుక్ ని విడుదల చేస్తున్నామని అయితే ఈ పుస్తక ప్రచురణతో ఇంతకుముందు న్యాయ మూర్తులు ఇచ్చిన తీర్పులను విమర్శించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ పేర్కొన్నారు. లింగపరమైన అంశాలను ప్రస్తావించేటప్పుడు అనుచితంగా వాడుతున్న భాషని సరిచేసేందుకు చట్టపరంగా ఓ పదకోశాన్ని విడుదల చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి మార్చిలోనే వెల్లడించారు.
ఈ పుస్తకంలో అనుచిత పదాలు, భావాలు వాటి ప్రత్యామ్నాయాలు చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కోర్టుల్లో సాధారణంగావాడే స్టీరియో టైప్ భాషకు, భావాలకు ప్రత్యామ్నాయాలను సూచించారు. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, లైంగిక నేరాల విషయంలో కోర్టులు వాడుతున్న మూస పదాలు, భావాలకు సవరణలు అధికంగా ఉన్నాయి. అందులో కొన్ని-
స్టీరియో టైప్ వర్సెస్ వాస్తవం
-వ్యభిచారి అనే పదాన్ని కోర్టు వాదనల్లో తీర్పుల్లో వాడకూడదు. దీనికి బదులుగా వివాహేతరంగా లైంగిక సంబంధాలు కలిగి ఉన్న స్త్రీ అనాలి. అలాగే ఎఫైర్.. అనే పదాన్ని తరచుగా వాడుతుంటారు. ఈ పదం బదులు వివాహేతర సంబంధం అని వాడాల్సి ఉంటుంది.
- ఉంపుడుగత్తె, వేశ్య అనే అర్థాలు వచ్చే ఆంగ్ల పదాలను వాడకూడదు. వాటికి బదులుగా... ఓ పురుషుడు వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీ అని, ప్రాస్టిట్యూట్ బదులుగా సెక్స్ వర్కర్ అని సంబోధించాలి.
-స్త్రీ అనే పదం వాడాల్సి వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి పవిత్ర మహిళ, ఉద్యోగం చేస్తున్న స్త్రీ, నైతికత లేని స్త్రీ అంటూ... పలురకాలుగా వాడుతున్నారని... అలా చేయవద్దని మహిళలను సంబోధించేటప్పుడు కేవలం స్త్రీ అనే పదం మాత్రమే వాడాలని ఈ హ్యాండ్ బుక్ సూచిస్తోంది.
-మహిళలు చాలా ఎమోషనల్ గా ఉంటారని, వారు లాజికల్ గా ఆలోచించలేరని, వారికి నిర్ణయాలు తీసుకునే శక్తి లేదని... ఇలాంటివన్నీ స్టీరియోటైప్ గా ఉంటున్న భావాలు. అయితే వాస్తవం ఏమిటంటే.. లింగభేదంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తిలోనూ ఈ లక్షణాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు.
-‘బలవంతంగా అత్యాచారం’ అనే పదాన్ని ‘అత్యాచారం’గా మార్చారు.
-మహిళలు ధరించే దుస్తులు, మద్యపానం సిగరెట్ వంటి అలవాట్లు, ఆమెకున్న లైంగిక సంబంధాల ఆధారంగా ఆమె వ్యక్తిత్వం గురించి అంచనా వేయటం స్టీరియోటైప్ గా సమాజంలో జరుగుతోంది. కోర్టులు కూడా అవే భావాలతో ఉంటున్నాయి. మహిళల వ్యక్తిత్వంపై ఇలాంటి నిర్ణయాత్మక ధోరణి ఉండటం వలన అలాంటి మహిళలపై లైంగిక నేరాలు జరిగినప్పుడు... లైంగిక సంబంధాల విషయంలో ఆ స్త్రీ సమ్మతి ఉండాలనే వాదనకు బలం లేకుండా పోతోందని కోర్టు పేర్కొంది.
-స్త్రీలు ధరించే దుస్తులు వారి వ్యక్తిగత అభిరుచులని... అంతేకానీ దుస్తుల తీరుని బట్టి ఆమె లైంగిక సంబంధాలకు సుముఖంగా ఉన్నట్టుగా భావించకూడదని బుక్ లో తెలిపారు.
-అత్యాచారాలకు పాల్పడే మగవారు మహిళలకు తెలియని వారై ఉంటారనే మూస భావన ఉంది... కానీ అది నిజం కాదు. ఆమెకు తెలిసిన, ఆమె చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల నుండి కూడా అలాంటి ప్రమాదం ఉంటుందనేది వాస్తవం.
- అణచివేతకు గురవుతున్న కులాలకు సంబంధించిన స్త్రీలతో మగవారు లైంగిక సంబంధాలకు ఇష్టపడరు అనేది మరొక మూస అభిప్రాయం.... కానీ అది వాస్తవం కాదు. అత్యాచారం, లైంగిక హింసలను సామాజిక నియంత్రణకు, ఆధిపత్య నిరూపణకు ఆయా నేరాలకు పాల్పడే వ్యక్తులు వాడుతున్నారనేది నిజం.
-కొన్ని తీర్పుల్లో మహిళలు నేరాలు చేసినప్పుడు దయతో ఉండాల్సిన స్త్రీలు లాంటి పదాలను వాడుతుంటారు. కానీ దయ జాలి అనేవి లింగ బేధం లేకుండా అందరిలోనూ ఉంటాయి. వాటిని అలవరచుకోవటం అందరికీ సాధ్యమే అనేది వాస్తవం.
- అవివాహిత మహిళలు లేదా యువతులు తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోలేరనే మూస భావన కోర్టు వాదనల్లో వినబడుతుంది. అయితే పెళ్లికి, నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధం లేదని ప్రతి విషయంలో చట్టం పేర్కొన్న వయోపరిమితులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలనేది వాస్తవం.
-వెనుకబడిన అణగారిన కులాలకు చెందిన మహిళలకు లోకాన్ని అర్థం చేసుకునే శక్తి తక్కువగా ఉంటుందని పలు సందర్భాల్లో కోర్టులు అభిప్రాయపడుతుంటాయి. కానీ నిజం వేరు మహిళలు జన్మించిన సామాజిక వర్గం బట్టి వారిలో తెలివితేటలు లోకజ్ఞానం అనేవి ఉండవు. కులమతాలకు అతీతంగా మేధోశక్తి ఉంటుంది.
- మహిళలు తమపై అత్యాచారం జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం కావాలని అడగాలి... అలా కాకుండా నేరం జరిగిన కొంతకాలానికి వారు కేసు పెడితే వారు అబద్దం ఆడుతున్నారనే భావన ఒకటి కోర్టు వాదనల్లో తీర్పుల్లో వినబడుతుంటుంది. కానీ నిజం అది కాదని హ్యాండ్ బుక్ లో పేర్కొన్నారు. లైంగిక నేరాలకు గురయిన బాధితులు కుటుంబ అండలేకనో, సమాజం ఏమంటుందో అనే భయంతోనో, మరే కారణంతో అయినా వెంటనే కేసు పెట్టకపోవచ్చు. వారు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నపుడు న్యాయాన్ని కోరే అవకాశం ఉందనేది వాస్తవం.
-రేప్ కి గురయిన స్త్రీకి అత్యాచారం చేసిన వ్యక్తితోనే వివాహం చేయటం... ఆమెకి న్యాయం చేయటంగా భావించడాన్ని కూడా హ్యాండ్ బుక్ లో ఖండించారు. అలా చేస్తే ఆమెపై అతను మరింత హింసకు పాల్పడే అవకాశం ఉందని ఈ పుస్తకంలో పేర్కొన్నారు.