సక్సెస్@60 - ఎక్కడా ఎదురీత లేదు!

రజనీలక్కా కర్నాటకలో స్థిరపడిన తెలుగు మహిళ. ఆమె పుట్టినిల్లు గుంటూరు జిల్లా, మెట్టినిల్లు అనంతపురం జిల్లా. బళ్లారిలో స్థిరనివాసం. ఎక్కువకాలం గృహిణిగా ఇంటికే పరిమితమైన రజని పిల్లలు పెద్దయిన తర్వాత తనకంటూ ఒక వ్యాపకాన్ని పెట్టుకున్నారు. స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ని ఆమె ఆరోగ్యానికో, హాబీకో పరిమితం చేయలేదు. పోటీల్లో పాల్గొంటున్నారు.

Advertisement
Update:2022-11-03 18:36 IST

అరవై... ఇది ఒక నంబర్‌ మాత్రమే. ఉత్సాహానికి ఏ మాత్రం అడ్డుకట్ట వేయదని నిరూపిస్తున్న తరం ఇది. బళ్లారిలో నివసిస్తున్న రజనీలక్కా ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. 60–64 ఏళ్ల వారికి జరిగిన స్విమ్మింగ్‌ పోటీల్లో రెండు స్వర్ణాలు, రెండు రజతాలను సాధించారామె.

తెలుగు మహిళ

రజనీలక్కా కర్నాటకలో స్థిరపడిన తెలుగు మహిళ. ఆమె పుట్టినిల్లు గుంటూరు జిల్లా, మెట్టినిల్లు అనంతపురం జిల్లా. బళ్లారిలో స్థిరనివాసం. ఎక్కువకాలం గృహిణిగా ఇంటికే పరిమితమైన రజని పిల్లలు పెద్దయిన తర్వాత తనకంటూ ఒక వ్యాపకాన్ని పెట్టుకున్నారు. స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ని ఆమె ఆరోగ్యానికో, హాబీకో పరిమితం చేయలేదు. పోటీల్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లెక్కకు మించిన పోటీల్లో పాల్గొని, ప్రతి పోటీ నుంచి పతకాలతో తిరిగి వచ్చే రజని తాజాగా 'కర్నాటక స్మిమ్మింగ్‌ అసోసియేషన్‌' పోటీల్లో మరో నాలుగు పతకాలను తన జాబితాలో చేర్చుకున్నారు.

రజనీ లక్కా


ఈ ఏటి పోటీలు

గడచిన అక్టోబర్‌ 29, 30వ తేదీల్లో బెంగళూరులో '23వ స్టేట్‌ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌ షిప్‌ –2022' పోటీలు జరిగాయి. బెంగళూరులోని కార్పొరేట్‌ స్విమ్మింగ్‌ పూల్‌ (విజయనగర్‌ అక్వాటిక్‌ సెంటర్, హంపినగర్, విజయనగర్‌)లో జరిగిన స్విమ్మింగ్‌ పోటీల్లో రజనీలక్కా '400 మీటర్ల ఫ్రీ స్టయిల్, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్స్‌' విభాగాల్లో తొలి స్థానాలు, '50 మీటర్ల బటర్‌ఫ్లై విభాగం, 50 మీటర్ల ఫ్రీ స్టయిల్‌' విభాగాల్లో రెండవ స్థానాల్లో నిలిచారు. కర్నాటక స్విమ్మింగ్‌ అసోసియేషన్‌... స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కర్నాటక ఒలింపిక్‌ అసోసియేషన్, కర్నాటక స్పోర్ట్స్‌ అథారిటీలతో అనుసంధానమై పని చేస్తోంది.


ఈతరాక మునిగిపోకూడదు

రజనీ లక్కా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఆమె హాబీగా నేర్చుకున్న స్విమ్మింగ్‌ నుంచి ప్రొఫెషనల్‌ స్విమ్మర్‌గా మారి దివ్యాంగులకు ఉచతంగా ఈత నేర్పిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ సర్వీస్‌లో ఇప్పటి వరకు వందలాది మంది దివ్యాంగులు ఆమె దగ్గర ఈత నేర్చుకుని, పోటీల్లో పతకాలు సాధించారు. ఈ మిషన్‌ మొదలు పెట్టడానికి తనను నడిపించిన కారణం బస్సు, రైలు ప్రమాదాలంటారామె. ''బస్సులు, రైళ్లు ప్రమాదవశాత్తూ నది, చెరువుల్లో పడిపోయినప్పుడు మామూలు మనుషులు ఎలాగోలా ఒడ్డుకు చేరుతారు. దివ్యాంగులు నిస్సహాయంగా నీటిలో మునిగిపోతారు. అలాంటి వార్తలు చదువుతున్నప్పుడు గుండె బాధతో నిండిపోయేది.


ఈత రాని కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఎంతటి విచారకరం. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనిపించింది. అప్పటి నుంచి దివ్యాంగులకు ఈత నేర్పిస్తున్నాను. భగవంతుని దయ వల్ల నాకు ఆర్థిక సమస్యల్లేవు. నా జీవితంలో దేనికీ కష్టపడిందీ లేదు. నా వంతుగా సమాజానికి చేయగలిగిన పని చేస్తున్నాను'' అంటారామె. ఎప్పుడూ తనను తాను బిజీగా ఉంచుకునే రజనీలక్కా సిక్స్‌టీ ప్లస్‌ బ్యూటీ కాంటెస్ట్‌లో కూడా విజేత. ఇప్పుడు ఈ పతకాలతో కర్నాటకలో మరోసారి వార్తల్లోకి వచ్చారు.



Tags:    
Advertisement

Similar News