మెనోపాజ్ దశలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మహిళల్లో సాధారణంగా నెల నెలా వచ్చే పీరియడ్స్ 40-45 ఏళ్ల తర్వాత ఆగిపోవడాన్ని వైద్య భాషలో మెనోపాజ్ అంటారు.
మహిళల్లో సాధారణంగా నెల నెలా వచ్చే పీరియడ్స్ 40-45 ఏళ్ల తర్వాత ఆగిపోవడాన్ని వైద్య భాషలో మెనోపాజ్ అంటారు. ఇది ప్రతి స్త్రీలో జరిగే శారీరక ప్రక్రియ. అయితే అంత సాధారణమైనది మాత్రం కాదు. ఈ దశ కొంతమందికి మాత్రమే పెద్దగా మార్పు లేకుండా గడుస్తుంది. చాలామందికి మాత్రం క్లిష్టమైనదే. ఈ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల భావోద్వేగాల్లో తేడాలు, శారీరక ఇబ్బందులూ తలెత్తుతాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లో తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
మెనోపాజ్ సమయంలో మహిళల్లో మానసిక మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందైతే..బరువు పెరగడం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఒత్తిడి, జుట్టు రాలడం, అలసట, నీరసం, నిద్ర పట్టకపోవడం, కండరాలు బలహీనపడటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మరికొంతమందిలో జీర్ణక్రయపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. వీటన్నింటి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని ఆహారాలను తప్పకుండా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వీటితోపాటు జీవన విధానంలోనూ మార్పు రావాలంటున్నారు.
మెనోపాజ్ సమయంలో స్త్రీలు తప్పకుండా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే విపరీతంగా బరువు పెరగకుండా ఉండేందుకు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. బదులుగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. అలాగే తినే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా పళ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఈ సమయంలో శరీరం లోపల వచ్చే వాపుల నుంచి రక్షణ పొందవచ్చు.
మెనోపాజ్‌లో స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు బాగా తగ్గిపోతాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా బయట నుంచి ఫైటో ఈస్ట్రోజన్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సోయా బీన్స్, నువ్వులు, అవిసెలు, వెల్లుల్లి, పీచ్‌లు, బెర్రీలు , బ్రోకలీ, క్యాబేజ్, డ్రైఫ్రూట్స్... తదితర ఆహార పదార్థాల నుంచి పుష్కలంగా లభిస్తుంది.
ఈ సమయంలో ఎముక సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. రోజువారి శారీరక శ్రమ మానసిక ప్రశాంతతకి , బరువు పెరగకుండా చూసుకోవటానికి, ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.