నేనెప్పుడూ సమోసా, పూరీ, కచోరీ తినలేదు ... కిరణ్ బేడీ

భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐపిఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఇప్పటికీ చురుగ్గా ఆరోగ్యంగా ఉన్నారు. 74 ఏళ్ల వయసులో తను ఆరోగ్యంగా ఫిట్ గా ఉండటానికి దోహదం చేస్తున్న అంశాలను ఆమె వెల్లడించారు.

Advertisement
Update:2023-08-09 09:06 IST

కిరణ్ బేడీ

భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐపిఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఇప్పటికీ చురుగ్గా ఆరోగ్యంగా ఉన్నారు. 74 ఏళ్ల వయసులో తను ఆరోగ్యంగా ఫిట్ గా ఉండటానికి దోహదం చేస్తున్న అంశాలను ఆమె వెల్లడించారు. యోగా, ధ్యానం, జర్నలింగ్, మంచి ఆహారపు అలవాట్లు తన ఫిట్ నెస్ మంత్రగా కిరణ్ తెలిపారు. ఆమె చెప్పిన వివరాలు-

తాను ఎప్పుడూ సమోసా, పూరీ, కచోరి, పకోడీ తిని ఎరుగనని, ఆరోగ్యపరంగా ప్రయోజనాన్ని ఇవ్వని ఆహారాలను తీసుకునే అలవాటు తనకు లేనే లేదని ఆమె అన్నారు. ఎప్పుడూ వేపుడు ఆహారాల జోలికి పోలేదని, తనకు పానీ పూరీ తినాలనిపిస్తే గంజి తాగుతానని కిరణ్ బేడీ తెలిపారు. ‘నాకు నడక అంటే చాలా ఇష్టం. ఫిట్ నెస్ కోసం ప్రతిరోజూ సమయం కేటాయిస్తాను. ఫిట్ నెస్ కోసం సమయం లేకపోతే ఒక పూట భోజనం మానేస్తాను. అలా మానేసినా నాకేమీ ఆకలి అనిపించదు. నచ్చిన ఆహారం తినాలని అనుకుంటే తప్పకుండా దానికి సరిపడా వర్కవుట్ చేస్తాను. నా ఆకలికి వ్యాయామానికి సంబంధం ఉంది. సాయంత్రాలు నడవటం, ఉదయం పూట యోగా ధ్యానం చేయటం చాలా ఉత్తమం. ప్రతిరోజు నా దినచర్యని చాలా కఠినంగా ఆచరిస్తాను. దానిని వదిలేస్తే పశ్చాత్తాపపడాల్సి వస్తుందని నాకు తెలుసు. అది ఇష్టం ఉండదు కనుకే రొటీన్ కి ఆటంకం రాకుండా చూసుకుంటాను’ అంటూ తన ఫిట్ నెస్ రొటీన్ గురించి చెప్పుకొచ్చారామె.

కుటుంబంతో అన్నీ పంచుకోలేక... జర్నలింగ్

‘ధ్యానం వలన మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల స్పందించగలుగుతాం. మన మైండ్ గతంలోకి భవిష్యత్తులోకి పరుగులు తీయకుండా వర్తమానంలో నిలిపి ఉంచగలుగుతాం. జీవితంలో మరింత ఉత్తమంగా ఉన్నతంగా ముందుకు వెళ్లగలుతాం’ అంటూ వివరించిన కిరణ్ ... జర్నలింగ్ (మన ఆలోచనలను ఫీలింగ్స్ ని ఒక పుస్తకంలో రాసుకుంటూ మనల్ని మనం మరింతగా అర్థం చేసుకునే ప్రక్రియని జర్నలింగ్ అంటారు) వలన కలిగే లాభాలను కూడా తెలిపారు. ‘చదువుకుంటున్న రోజులనుండే నాకు జర్నలింగ్ అలవాటు ఉంది. నేను చాలా విషయాలను నా కుటుంబంతో చెప్పేదాన్ని కాదు. నా కుటుంబం ఒత్తిడికి గురవటం ఇష్టం లేక అలా చేసేదాన్ని. కుటుంబంతో చెప్పలేని విషయాలన్నింటినీ జర్నల్ లో రాసుకునే దాన్ని’ అన్నారామె. డైరీ రాయటం, నాలో నేను ఆలోచించుకోవటం, నాతో నేను మాట్లాడుకోవటంతో నన్ను నేను అర్థం చేసుకోవటం, నా ఆలోచనలను అవగాహన చేసుకోవటం సాధ్యమయ్యేదని కిరణ్ తెలిపారు.

అలా వెళ్లిపోవాలని...

‘అబ్దుల్ కలాం లాగా పని చేస్తూనే మరణించాలని కోరుకుంటున్నాను. ఆయన టీచింగ్ చేస్తూనే చనిపోయారు. నేను కూడా అలాగే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, అనారోగ్యానికి గురికాకుండా వెళ్లిపోవటం నాకు ఇష్టం. ముప్పయిలు నలభైల వయసులో ఉన్నవారు తమ జీవితంలో ఉన్న అన్నిరకాల పరిస్థితులను అంగీకరించాలి. అవి అలా ఉన్నాయని ఒప్పుకోవాలి. తరువాత వాటిని తిరస్కరించాలా, లేదా మార్చాలా అనేది ఆలోచించుకోవాలి. మనలోని శక్తిని వృథా చేయకూడదు. ముప్పయిల వయసులోనే జీవితాన్ని ఒక గాడిలో పెట్టుకోవాలి. నలభైల వయసులో బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడు వాటికి అనుగుణంగా జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి.’ అంటూ జీవితం పట్ల తన దృక్పథాన్ని, అభిప్రాయాలను వెల్లడించారామె.

Tags:    
Advertisement

Similar News