అది మీ దత్తత తండ్రి సలహానేనా.. రేవంత్‌పై వైసీపీ ఫైర్
గతంలో ఆంధ్రాలో జగన్, బెంగాల్‌లో మమతా బెనర్జీ విషయంలోనూ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశారంటూ రేవంత్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి విషయంపై స్పందిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై YSRCP మండిపడింది. తెలంగాణలో దాడుల వెనుక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడంటూ రేవంత్ ఆరోపించారు. గతంలో ఆంధ్రాలో జగన్, బెంగాల్‌లో మమతా బెనర్జీ విషయంలోనూ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశారంటూ రేవంత్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ రేవంత్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి మీద జరిగిన దాడిని అవహేళన చేసే స్థాయికి నీ రాజకీయం దిగజారిందా అంటూ రేవంత్ రెడ్డిని విమర్శించింది వైసీపీ. ఆనాడు మీ దత్తత తండ్రి చంద్రబాబు మీద అలిపిరిలో జరిగిన దాడి కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకున్నదేనా అని ప్రశ్నించింది. ఆ బాంబు పేలుళ్ల కోసం అప్పట్లో ఎవరిచ్చారు సలహా..? ఆనాడు ఎన్టీఆర్ మీద మల్లెల బాబ్జీ చేసిన దాడి కూడా ఇలాంటిదేనా..? దానికి ప్లానిచ్చింది మీ చంద్రబాబేనా..? ఎమ్మెల్సీల కొనుగోళ్లకు డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయావు. మరి దానికి ఎవరిచ్చారు సలహా…? కాంగ్రెస్ పార్టీలో చేరమని నీకు ఎవరిచ్చారు సలహా..? అంటూ రేవంత్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది వైసీపీ.
శనివారం అర్ధరాత్రి ప్రచారం ముగించుకుని వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తల వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెహికిల్‌లో గువ్వల బాలరాజు డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడకు చేరుకోవడంతో మరోసారి రెండు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ దాడుల్లో గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. కొత్త ప్రభాకర్ రెడ్డి, గువ్వల బాలరాజుపై దాడి అంతా ప్రశాంత్ కిషోర్ ప్లాన్ అని ఆరోపించారు. ఇదే సందర్భంలో వై.ఎస్.జగన్ పేరును ప్రస్తావించడంతో వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.