వైఎస్ఆర్‌టీపీకి ఆ ఎన్నికలు ఎంట్రన్స్ టెస్టంటా..!

మునుగోడులో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో వైఎస్ఆర్ అభిమానుల ఓట్లతో పాటు బీసీ ఓట్లను కూడా తమవైపు తిప్పుకునేలా బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశం ఉంది.

Advertisement
Update:2022-08-30 11:35 IST

ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానంటూ ఎవరు పార్టీ పెట్టినా వారి అంతిమ లక్ష్యం అధికారమే. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొని వస్తా, ఈ నేల కోడలిగా నన్ను ఆశీర్వదించండి అంటూ 13 నెలల క్రితం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల ఓ పార్టీ పెట్టారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ) ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్ సర్కారుపై తీవ్రంగా విమర్శలు చేస్తూ.. నిరుద్యోగులు, రైతుల కోసం పోరాడుతానని సభల్లో చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని షర్మిల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడుకు ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో ఎలాగైనా పోటీ చేయాలని నాయకులు ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వస్తున్నారు.

వైఎస్ఆర్‌టీపీని గత ఏడాది జూలైలో స్థాపించారు. పార్టీ పెట్టిన నాలుగు నెలలకే ఎన్నికల బరిలో నిలిచే అవకాశం వచ్చింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఎన్నికల బరిలో వైఎస్ఆర్‌టీపీ ఉంటుందని అందరూ భావించారు. కానీ షర్మిల అసలు ఎన్నిక ఊసే ఎత్తలేదు. కొత్త పార్టీ కాబట్టి ఇంకా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉందని.. ఇప్పుడు ఎన్నికల బరిలో నిలబడి కనీసం డిపాజిట్ కూడా రాకపోతే మొదటికే మోసం వస్తుందని షర్మిల భావించారు. అందుకే ఆ ఎన్నికకు దూరంగా ఉండటమే కాకుండా ఎవరికీ మద్దతు కూడా ఇవ్వలేదు.

ఇక ఇప్పడు మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. తెలంగాణలో సుదీర్ఘంగా చేస్తున్న యాత్రతో షర్మిలకు పలు ప్రాంతాల్లో ప్రజల ఆదరణ లభిస్తోంది. ఓట్లు వేస్తారో లేదో అనేది పక్కన పెడితే ఆమె సభలకు మాత్రం జన సమీకరణ బాగానే జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడే ముందు మునుగోడులో తమ బలాన్ని పరీక్షించుకోవాలని పార్టీ నాయకులు షర్మిలకు సూచించారని తెలుస్తోంది. గెలుపు ఓటములు పక్కన పెడితే.. ప్రజల్లోకి పార్టీ ఎంత చొచ్చుకొని పోయిందనేది తెలుస్తుందని చెబుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనేది వాస్తవం. ఇలాంటి సమరంలో వైఎస్ఆర్‌టీపీ కనీసం డిపాజిట్ దక్కించుకున్నా.. కార్యకర్తల్లో విశ్వాసం పెరుగుతుందని కొంత మంది సూచించినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నాయకులు చెప్పిన సలహా నచ్చడంతో షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ప్రస్తుతం అభ్యర్థిని వెదికే పనిలో ఉన్నట్లు సమాచారం.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకప్పుడు వైఎస్ఆర్‌కు విధేయులుగా ఉన్నారు. వారి అనుచరలు కూడా వైఎస్ అంటే చాలా అభిమానం పెంచుకున్నారు. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న షర్మిల ఇక్కడ పోటీ చేయడం ద్వారా ఓటు బ్యాంకు పెంచుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడైన అభ్యర్థిని రంగంలో దింపితే బాగుంటుందని భావిస్తున్నారు. అయితే మునుగోడులో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో వైఎస్ఆర్ అభిమానుల ఓట్లతో పాటు బీసీ ఓట్లను కూడా తమవైపు తిప్పుకునేలా బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశం ఉంది.

బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి బరిలో ఉంటారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే వైఎస్ఆర్‌టీపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. హుజూరాబాద్ ఎన్నికను అహంకారానికి.. ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు అని చెప్పి తప్పించుకున్న షర్మిలకు.. మునుగోడు ఒక ఎంట్రన్ టెస్ట్‌లా మారాయని అంటున్నారు. తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో నిలవడానికి ఈ ఎంట్రెన్స్‌లో షర్మిల క్వాలిఫై అవుతారా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News