షర్మిల పరిస్థితి ఏంటి..? ట్వీట్లు వేయడమేనా..?
షర్మిల ట్వీట్ ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించలేదు, కాంగ్రెస్ నేతలెవరూ పట్టించుకోలేదు. రాగాపోగా సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర ట్రోలింగ్ నడుస్తోంది.
పొలిటికిల్ సూసైడ్ అంటూ తనకు తానే స్టేట్ మెంట్ ఇచ్చుకున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆమెను అస్సలు పట్టించుకోవట్లేదు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత మీడియా ముందుకొచ్చి.. కేసీఆర్ కోసం ఓ సూట్ కేసు గిఫ్ట్ గా పంపించి కలకలం రేపారు షర్మిల. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆమె ట్విట్టర్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వరుస ట్వీట్లు వేశారు, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ వేశారు. తెలంగాణ ప్రజల చారిత్రక తీర్పు అద్భుతం అన్నారు. సుపరిపాలనకు నాంది అని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ ట్వీట్ లో తొలిసారిగా ఆమె రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం విశేషం. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీమ్ కాంగ్రెస్ కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ వేశారు షర్మిల.
షర్మిల ట్వీట్ ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించలేదు, కాంగ్రెస్ నేతలెవరూ పట్టించుకోలేదు. రాగాపోగా సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర ట్రోలింగ్ నడుస్తోంది. అసలు పార్టీ ఎందుకు పెట్టావ్, పాదయాత్ర ఎందుకు చేశావ్, అనుచరుల డబ్బులు ఎందుకు ఖర్చు చేశావ్, చివరకు పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నావ్.. అంటూ కౌంటర్లిస్తున్నారు నెటిజన్లు.
కిం కర్తవ్యం..?
తెలంగాణలో కాంగ్రెస్ కి ఇతర పార్టీల నేతలు చాలామంది సపోర్ట్ చేశారు. కోదండరాం బహిరంగ మద్దతు ప్రకటించారు, రేపో మాపో ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. సీపీఐ సపోర్ట్ ఇచ్చింది, సింగిల్ ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది. చివరి నిమిషంలో విజయశాంతి లాంటి వారు పార్టీలో చేరి ప్రచారం చేశారు, పార్లమెంట్ ఎన్నికలకోసం ప్రిపేర్ అవుతున్నారు. రాగాపోగా షర్మిల పరిస్థితి ఏంటనేది అర్థం కావడంలేదు. పార్లమెంట్ ఎన్నికలనాటికి ఆమె కాంగ్రెస్ తో విభేదించలేరు, సొంతగా పోటీ చేయలేరు. పోనీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లో చేరినా ఆమెకు సముచిత స్థానం దక్కుతుందనే ఆశ లేదు. ఆమెను కాంగ్రెస్ లో చేర్చుకోడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇష్టపడతారని కూడా అనుకోలేం. మరి షర్మిల ఏం చేయాలి..? వేచి చూడటం మినహా ఆమె ముందు మరో ప్రత్యామ్నాయం లేదు.