జగన్, మోదీ, లోకేష్, పవన్.. ఎవరెవరు ఎలా శుభాకాంక్షలు చెప్పారంటే..?

రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని.. ఆయన వాగ్ధాటి, ప్రజాకర్షణ కలిగిన నేత అని, ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని అన్నారు పవన్ కల్యాణ్.

Advertisement
Update:2023-12-07 16:51 IST

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. పొరుగు రాష్ట్రాలు, కేంద్రం నుంచి కూడా శుభాకాంక్షలు వెలువడ్డాయి. ఏపీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోయినా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ వేశారు. "తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు ఏపీ సీఎం జగన్.


"తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను."అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం ఎలా సహాయ నిరాకరణ చేసిందో అందరికీ తెలుసు. ఆ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులు తామే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి కేంద్రం ఏ పాటి సహకారం అందిస్తుందో చూడాలి.


ఇక రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని.. ఆయన వాగ్ధాటి, ప్రజాకర్షణ కలిగిన నేత అని, ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని అన్నారు పవన్ కల్యాణ్. తెలంగాణ ఏర్పాటుకోసం జరిగిన ఆత్మ బలిదానాలకు సార్థకత కలిగేలా పాలన ఉండాలని ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలన్నారు.


ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తికాలం పనిచేయాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్. ఆయనకు అభినందనలు తెలిపారు. ఇక తెలంగాణలో ప్రతిపక్ష నేతలు కూడా సీఎం రేవంత్ కి ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో తమ సందేశాలను ఉంచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నానంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డికి ఆయన మంత్రి వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ వేశారు. 




Advertisement

Similar News