ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తల షాక్
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు హైవేపై ధర్నా
పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు చోటు చేసుకున్నది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు హైవేపై ధర్నా చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులను గుర్తించడంలేదంటూ వారు ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురు కార్యకర్తలు మాత్రం ఆఫీసు గోడ దూకి లోపలికి వెళ్లారు. అక్కడి కుర్చీలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అధికారపార్టీ కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమౌతున్నది. మొన్నటి ఎన్నికల్లో ఎవరికి వ్యతిరేకంగా పనిచేశామో వారినే పార్టీలోకి తీసుకొచ్చి మా నెత్తిన రుద్దారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన మమ్మల్ని కాదని కొత్తగా వచ్చిన వారికే పెద్దపీట వేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు హైవేపై ధర్నా చేశారు. జై కాంగ్రెస్ అంటూ వాళ్లు రోడ్డుపై నినాదాలు చేశారు.