మునుగోడుకి మోదీ వస్తారా..? పరువు పోగొట్టుకుంటారా..?

మునుగోడు ఉప ఎన్నిక కాదు, బతుకు ఎన్నిక అనేశారు కేసీఆర్. అటు బీజేపీకి కూడా ఇది బతుకు ఎన్నిక లాంటిదే. రాజగోపాల్ రెడ్డికి కండువా కప్పేసి లాంఛనంగా అమిత్ షా ప్రచార పర్వాన్ని ప్రారంభించినా, ఆ తర్వాత మోదీ లాంటి పెద్దలు మునుగోడులో అడుగు పెట్టక తప్పదు.

Advertisement
Update:2022-08-03 13:34 IST

మునుగోడు కేవలం ఓ ఉప ఎన్నిక. కానీ బీజేపీకి అది చాలా ప్రతిష్టాత్మకం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే కర్టన్ రైజర్ అది. అందులో ఎవరు గెలిస్తే సహజంగానే వారికి కాస్త ఊపొస్తుంది, అసెంబ్లీ ఎన్నికల విషయంలో నైతిక బలం పెరుగుతుంది. అందుకే ఆ ఎన్నికల్ని మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగానే భావిస్తున్నాయి. కానీ బీజేపీ పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది. దాన్ని రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఖాతాలో వేయాలా, లేక పార్టీ తరపున సామ దాన భేద దండోపాయాల్ని ప్రయోగించాలా అనేది తేల్చుకోలేకపోతోంది అధిష్టానం.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ బలం పెరగలేదు కానీ, ఈటల తన వర్గం ఓట్లను బయటకు పోకుండా కాపాడుకుని విజయం సాధించారు. కాంగ్రెస్ లోపాయికారీ సపోర్ట్ కూడా ఉందని అంటారు. కానీ మునుగోడు అలా కాదు, ఈటలతో పోల్చి చూస్తే రాజగోపాల్ రెడ్డికి ఆ స్థాయిలో బలం, బలగం లేదు. ఉన్నా, అది కాంగ్రెస్ పార్టీనుంచి విడిపోయి రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీలో చేరుతుందని అనుకోలేం. ఈదశలో గెలుపుకోసం ఏం చేయాలి. గతంలో లాగా కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలి. కేంద్ర బలగాలంటే పారామిలటరీ బలగాలు కాదు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ జాతీయ నేతలు. ఆమధ్య తెలంగాణలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఏ రేంజ్ లో వచ్చారో, ఆ రేంజ్ లో వారు మునుగోడులో మకాం వేయాలి. మండలానికొక కేంద్ర మంత్రిని పెట్టి రచ్చ చేయాలి. అప్పుడే కేసీఆర్ ని నిలువరించడం కాస్తో కూస్తో సాధ్యమవుతుంది.

అయిననూ.. పోయిరావలె..

మునుగోడు ఉప ఎన్నిక కాదు, బతుకు ఎన్నిక అనేశారు కేసీఆర్. అటు బీజేపీకి కూడా ఇది బతుకు ఎన్నిక లాంటిదే. రాజగోపాల్ రెడ్డికి కండువా కప్పేసి లాంఛనంగా అమిత్ షా ప్రచార పర్వాన్ని ప్రారంభించినా, ఆ తర్వాత మోదీ లాంటి పెద్దలు మునుగోడులో అడుగు పెట్టక తప్పదు. కానీ ఇక్కడే బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. బలగాలను మోహరించి చివరకు అభాసుపాలయితే అది మరీ దారుణంగా ఉంటుంది. ఆ ప్రభావం 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనే కాదు, 2024లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా పడుతుంది. అది మాత్రం గ్యారెంటీ. కానీ మునుగోడు భారాన్ని రాజగోపాల్ రెడ్డిపైనే వదిలేయడం కూడా అధిష్టానానికి ఇష్టం లేదు. అందుకే తర్జన భర్జన పడుతున్నారు.

మునుగోడుపై బీజేపీ మేకపోతు గాంభీర్యంతో ఉన్నా.. లోలోపల కాంగ్రెస్ కేడర్ తమతో కలసి రాదనే భయం కూడా ఆ పార్టీలో ఉంది. సీపీఐ ఆల్రడీ టీఆర్ఎస్ కి మద్దతిస్తోంది. రాగా పోగా.. టీఆర్ఎస్ అభ్యర్థిపై ఏకాభిప్రాయం లేక ఏ వర్గం అయినా ఎదురు తిరిగితే బీజేపీకి ఆమేరకు లాభం చేకూరే అవకాశముంది. అది విజయానికి సరిపోతుందనే నమ్మకం మాత్రం లేదు. మునుగోడుకి మోదీ వచ్చినా మేజిక్ లేకపోతే మాత్రం పరువు పోతుంది. ఒకవేళ అలాగే వదిలేస్తే అది నిర్లక్ష్యంతో వచ్చిన ఓటమి అవుతుంది. అందుకే బీజేపీ ఆలోచనలో పడింది. పార్టీ విజయావకాశాలనుబట్టే మోదీ మునుగోడు పర్యటన చివరాఖర్లో ఖరారవుతుంది. ఈలోగా స్థానిక నాయకులదే సందడంతా.

Tags:    
Advertisement

Similar News