తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి యూనిలివర్ సంసిద్ధత
ఆ కంపెనీ సీఈవో హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చెయిన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సీఎం రేవంత్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో 'ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్' థీమ్‌తో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రైజింగ్ నినాదంతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం వరుస భేటీలు, చర్చలు జరుపుతున్నది. ప్రముఖ బహుళజాతి సంస్థ యూనిలివర్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఆ కంపెనీ సీఈవో హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చెయిన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సీఎం రేవంత్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు.
కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటునకు యూనిలివర్ సంస్థ అంగీకరించింది. రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణ పెవిలియన్‌లో ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ ఎజిలిటీ ఛైర్మన్ తారెక్ సుల్తాన్‌తో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఇస్తున్న ప్రాధాన్యాలపై చర్చించారు. కాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సాంబనోవా సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలెతో మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.