అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తాం : తమ్మినేని వీరభద్రం

దేశంలో ఒకే భాష, ఒకే పన్ను, ఒకే ఎన్నిక ఉండాలని భావించే బీజేపీకి.. ఒకే కులం ఉండాలని ఎందుకు కోరుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

Advertisement
Update:2023-03-22 17:23 IST

రాబోయే తెలంగాణ అసెంబ్లీ, సార్వ్రత్రిక ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌తో కలిసి పని చేయాలని సీపీఎం, సీపీఐ పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు ఇప్పటికే సీపీఎం, సీపీఐ పార్టీల అగ్ర నాయకత్వం కీలక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నాయని ఆయన చెప్పారు. ఎన్నికల్లో సీపీఎం పోటీ చేయాలని అనుకుంటున్న స్థానాలను సీపీఐ అడగదని.. అలాగే వాళ్లు పోటీ చేయాలని భావించే స్థానాలను సీపీఎం కోరబోదని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

దేశంలో ఒకే భాష, ఒకే పన్ను, ఒకే ఎన్నిక ఉండాలని భావించే బీజేపీకి.. ఒకే కులం ఉండాలని ఎందుకు కోరుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి బీజేపీని ఎదిరించే ధైర్యం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలో తమ్మినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ దేవుళ్లను అడ్డుపెట్టుకొని దేశంలో మత, కుల చిచ్చును రేపుతోందని విమర్శించారు. దేశంలో కుల వ్యవస్థను పున ప్రతిష్టించాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

అగ్రవర్ణాల ఆధిపత్యమే బీజేపీ సిద్దాంతమని తమ్మినేని మండిపడ్డారు. దేశంలో బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ తప్పుపడుతోందని.. దానికి రాజ్యంగాన్ని రద్దు చేయాలనే దురుద్దేశం ఉందని అన్నారు. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఘర్షణలు మరింతగా పెరిగిపోయి.. పూర్తిగా నాశనం అవుతుందని ఆయన హెచ్చరించారు. కేసులు ఉండటం వల్లే ఏపీ సీఎం జగన్ ఆ పార్టీని ఎదిరించే ధైర్యం చేయలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తెతో పాటు రాష్ట్ర మంత్రులపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నా.. కేసీఆర్ మాత్రం ధైర్యంగా బీజేపీపై పోరాడుతున్నారని అన్నారు.

బీజేపీని వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్‌కు తమ్మినేని అభినందనలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రెండు కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తాయని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే సీట్ల విషయంలో రెండు పార్టీలు అవగాహనకు వచ్చాయని చెప్పారు. కాగా, బీఆర్ఎస్‌తో ఇంకా సీట్ల కేటాయింపుపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. సీట్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే మరి కొంత కాలం వేచి చూసే ధోరణిలో ఉన్నామన్నారు.

బీజేపీపై పోరాటాలు చేసే అంశంలో, సమస్యల పరిష్కారాల విషయంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం చూపిస్తే.. ఆ పార్టీపై కూడా పోరాడతామని తమ్మినేని చెప్పారు. ఖమ్మం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు స్నేహపూర్వక వాతావరణంలో పని చేసుకుంటూ పోతున్నాయని అన్నారు. అయితే ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు ఒక నాయకుడు బీజేపీలో చేరి జిల్లాకు నష్టం చేయాలని చూస్తున్నారంటూ పరోక్షంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని విమర్శించారు. అలాంటి పని చేయవద్దని ఆయనకు తమ్మినేని హితవు పలికారు.

Tags:    
Advertisement

Similar News