న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ట్విన్ టవర్స్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్!

నూతన సచివాలయానికి దగ్గరగా ఉండే ఖాళీ స్థలాల కోసం అధికారులు అన్వేషించారు. సచివాలయానికి సమీపంలోనే ఉన్న ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ట్విన్ టవర్స్ నిర్మిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు.

Advertisement
Update:2023-06-06 07:40 IST

వివిధ శాఖల అధిపతుల (హెచ్‌వోడీ) కార్యాలయాలన్నింటినీ ఒకే చోట చేర్చి ఇంటిగ్రేటెడ్ ట్విన్ టవర్స్ నిర్మించాలని ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పలు శాఖల కార్యాలయాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆయా శాఖల అధిపతులు సచివాలయానికి రావడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే కొత్త సచివాలయం సమీపంలోనే హెచ్‌వోడీలకు ఇంటిగ్రేటెడ్ భవనాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ స్వయంగా సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను కూడా పరిశీలించారు.

నూతన సచివాలయానికి దగ్గరగా ఉండే ప్రాంతాల కోసం అధికారులు అన్వేషణ జరిపారు. సచివాలయానికి సమీపంలోనే ఉన్న ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ట్విన్ టవర్స్ నిర్మిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. దాదాపు 12 ప్రాంతాలను పరిశీలించిన తర్వాత అధికారులు ఆదర్శ్‌నగర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేయగా.. న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ట్విన్ టవర్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సెక్రటేరియట్‌కు సమీపంలోనే ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ 13 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నది. ఇక్కడ ట్విన్ టవర్స్ నిర్మిస్తే హెచ్‌వోడీల రాకపోకలకు సులువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసే పనిలో అధికారులు పడ్డారు. ఈ ట్విన్ టవర్స్‌కు సంబంధించిన పూర్తి బాధ్యతను ఇప్పటికే సీఎం కేసీఆర్.. ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించారు.

కాగా, ట్విన్ టవర్స్ నిర్మాణం కోసం బీఆర్కే భవన్, బషీర్‌బాగ్‌లోని పాత గాంధీ మెడికల్ కాలేజీ, సంజీవయ్య పార్కు సమీపంలోని డీబీఆర్ మిల్స్ వంటి ప్రాంతాలను పరిశీలించారు. డీబీఆర్ మిల్స్ ల్యాండ్ కొన్ని వివాదాల్లో ఉన్నది. అలాగే సెక్రటేరియట్ వెనుక వైపు ఉన్న స్థలం ట్విన్ టవర్స్ నిర్మాణానికి సరిపోదు. కాగా, పాత గాంధీ మెడికల్ కాలేజీ బిల్డింగ్‌ను 20 ఏళ్ల క్రితమే టూరిజం శాఖకు కేటాయించారు. పర్యాటక శాఖ దాన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి డెవలప్‌మెంట్ కోసం ఇచ్చింది. అంతే కాకుండా అక్కడ ట్రాఫిక్ సమస్య కూడా ఉంది.

న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కాంప్లెక్స్ ప్రస్తుతం ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోనే ఉన్నది. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా అక్కడ ట్విన్ టవర్స్ నిర్మించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే.. పలు శాఖల హెచ్‌వోడీలతో పాటు దాదాపు 5వేల మంది ఉద్యోగులు ఒకే భవనంలో పని చేసే వీలుంటుంది.

Tags:    
Advertisement

Similar News