పొరుగు రాష్ట్రాలపై టీఎస్ఆర్టీసీ దృష్టి.. సత్ఫలితాల దిశగా విస్తరణ..

ప్రస్తుతం టీఎస్‌ ఆర్టీసీ 500 బస్సులను కర్నాటకలోని వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. వీటి ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువగా ఉండటంతో అదనంగా మరో 100 బస్సుల్ని సమకూర్చుకుంటోంది. టీఎస్ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్‌ బస్సులు కొనుగోలు చేస్తోంది.

Advertisement
Update:2022-09-05 13:46 IST

హైదరాబాద్ లో మెట్రో రైల్ వల్ల టీఎస్ఆర్టీసీ ఆదాయం కాస్త తగ్గిన సంగతి తెలిసిందే. కరోనా తర్వాత పరిస్థితులు చక్కబడుతున్నా డీజిల్ రేట్ల పెంపు, సంస్థ ఆదాయానికి ప్రతిబంధకంగా మారింది. దీంతో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే దిశగా వ్యూహాలు మార్చుతోంది. వస్తువుల రవాణాతో ఓ అడుగు ముందుకేసింది. ఇప్పుడు విస్తరణ దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా ఏపీ, కర్నాటక రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఇరు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుని సర్వీసుల సంఖ్య పెంచుతోంది.

టార్గెట్ కర్నాటక..

కర్నాటకపై టీఎస్ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ - కర్నాటక ఆర్టీసీల మధ్య బస్సు సర్వీసుల విషయంలో ఒప్పందం ఉంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, ప్రస్తుతానికి పాత ఒప్పందమే నడుస్తోంది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరిస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో అధికారులు, బెంగళూరు వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. కర్నాటక పరిధిలో మరో 30 వేల కిలోమీటర్ల మేర ప్రతిరోజూ అదనంగా టీఎస్ఆర్టీసీ బస్సులు తిరిగేలా ఒప్పందం రెడీ చేశారు. అదనంగా 100 బస్సుల్ని కర్నాటకలో తిప్పబోతున్నారు. దీనివల్ల రోజువారీ ఆదాయం రూ.25 లక్షల వరకు పెరుగుతుందని అంచనా. బెంగుళూరు, మైసూరు, బెల్గాం, బీజాపూర్, బీదర్, రాయచూర్‌ లాంటి ప్రాంతాల్లో టీఎస్ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్‌ ఉంది.

ప్రస్తుతం టీఎస్‌ ఆర్టీసీ 500 బస్సులను కర్నాటకలోని వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. వీటి ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువగా ఉండటంతో అదనంగా మరో 100 బస్సుల్ని సమకూర్చుకుంటోంది. టీఎస్ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్‌ బస్సులు కొనుగోలు చేస్తోంది. మరో 108 నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకుంటోంది. వీటిలో కొన్నింటిని కర్నాటకకు అదనంగా తిప్పే సర్వీసులకోసం కేటాయించబోతోంది.

కర్నాటకలోని మూడు ఆర్టీసీలు కూడా హైదరాబాద్‌ తోపాటు వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నాయి. వాటికి కూడా ఆదరణ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచుకోవాలని పరస్పరం రెండు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. కర్నాటకలో చక్రం తిప్పేందుకు టీఎస్ఆర్టీసీ రెడీ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News