మార్చి నుంచి టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు.. ఏయే ప్రాంతాలకు తిరుగుతాయంటే..

ఇప్పటికే టీఎస్ఆర్టీసీ నాన్-ఏసీ స్లీపర్ బస్సులను నడుపుతోంది. తాజాగా లహరి పేరుతో ఏసీ స్లీపర్ బస్సులను కూడా తీసుకొని వస్తోంది.

Advertisement
Update:2023-02-21 09:45 IST

ఉమ్మడి ఏపీలో నష్టాలతో, పాత డొక్కు బస్సులతో నడిచిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికుల ఆదరణను పొందుతోంది. ప్రైవేటు బస్సులకు ధీటుగా అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన బస్సులను రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా తిప్పుతూ ఆదరణ చూరగొంటోంది. తాజాగా సరికొత్త హంగులతో స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టబోతోంది. మార్చి నెల నుంచి 16 స్లీపర్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ బస్సులను రూపొందించారు. ఈ ఏసీ ప్లీట్‌లోని ఒక బస్సును సోమవారం ఆర్టీసీ భవన్ వద్దకు తీసుకొని వచ్చారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ దీనిలోని సౌకర్యాలను పరిశీలించారు.

ఇప్పటికే టీఎస్ఆర్టీసీ నాన్-ఏసీ స్లీపర్ బస్సులను నడుపుతోంది. తాజాగా లహరి పేరుతో ఏసీ స్లీపర్ బస్సులను కూడా తీసుకొని వస్తోంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని తిరుపతి, వైజాగ్.. కర్నాటకలోని బెంగళూరు, హుబ్లీ.. తమిళనాడులోని చెన్నైకి ఈ బస్సులను తిప్పనున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఆద్వర్యంలో తొలి సారిగా తీసుకొని వస్తున్న ఏసీ స్లీపర్ బస్సులకు తప్పకుండా మంచి ఆదరణ ఉంటుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏసీ స్లీపర్ లహరీ బస్సులను అశోక్ లేలాండ్ సంస్థ తయారు చేసింది. 12 మీటర్లు పొడవుండే ఈ బస్సులో లోయర్ 15, అప్పర్ 15 బెర్తులు.. మొత్తం 30 ఉంటాయి. బెర్తుల వద్దే వాటర్ బాటిల్ బాక్స్, మొబైల్ చార్జింగ్, రీడింగ్ ల్యాంప్ సౌకర్యాలు ఉంటాయి. వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో పాటు పానిక్ బటన్ సదుపాయం ఉంది. ఈ పానిక్ బటన్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం అయి ఉంటుంది. ఒంటరిగా ప్రయణించే మహిళలు, వయో వృద్ధులకు ఏదైనా ప్రమాదం కలిగితే ఈ పానిక్ బటన్ ఉపయోగించవచ్చు. బస్సుకు ప్రమాదం కలిగిన సమయంలో కూడా దీన్ని ప్రయాణికులు నొక్కవచ్చు.

ఈ బస్సులో రెండు వైఫై సదుపాయం కలిగిన సీసీ టీవీ కెమేరాలు ఉన్నాయి. బస్సు ముందు వెనుక భాగంలో ఉండే ఎల్ఈడీ బోర్డుల్లో గమ్యస్థానం వివరాలు కనిపిస్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ ఉంది. అలాగే ప్రయాణికులకు సమాచారం అందించడానికి వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంది.



Tags:    
Advertisement

Similar News