ఆ 8 గుర్తులు తొలగించండి.. ఈసీకి టీఆర్ఎస్ విన్నపం..

ఆయా గుర్తులను పోల్చి చూసే క్రమంలో ఓటర్లు తికమకకు గురవుతున్నారనేది వాస్తవం. ప్రధాన పార్టీలకు పడాల్సిన ఓట్లు కొన్ని సందర్భాల్లో స్వతంత్రులకు పడుతున్నాయి. దీనివల్ల గెలుపు ఓటములు ప్రభావితం అవుతున్నాయి.

Advertisement
Update:2022-10-10 21:33 IST

మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుని పోలిన 8 గుర్తులున్నాయి. వీటిని స్వతంత్రులకు కేటాయించే అవకాశాలున్నాయి. ఈ గుర్తులను తొలగించి, వేరే గుర్తులను జాబితాలో చేర్చాలని టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ ని కోరారు. దాస్యం వినయ్ భాస్కర్, భాను ప్రసాదరావు, భరత్ కుమార్.. ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని కలసి ఈ మేరకు వినతిపత్రం అందించారు.

ఏమిటా గుర్తులు..?

కెమెరా, చపాతీ రోలర్‌, ట్రాలీ, రోడ్‌ రోలర్‌, సోప్ బాక్స్, టీవీ, కుట్టు మిషన్‌, ఓడ.. వీటి వల్ల టీఆర్ఎస్ కి నష్టం జరిగే అవకాశముందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే వాటిని స్వతంత్రులకు ఇచ్చే జాబితానుంచి తొలగించాలని కోరారు. 48 గంటల్లో ఈసీ దీనిపై స్పందించాలని, లేకపోతే కోర్టుని ఆశ్రయిస్తామని తెలిపారు.

ఎందుకిలా..?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు నష్టం జరిగింది. గెలుపోటములను ఈ గుర్తులకు పడిన ఓట్లు ప్రభావితం చేశాయి. ఆయా గుర్తులతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం చేయకపోయినా ఓట్లు మాత్రం వందల సంఖ్యలో వచ్చాయి. అవే ఓట్లు టీఆర్ఎస్ కి పడి ఉంటే ఫలితం మరోలా ఉండేది. దీంతో ఇప్పుడీ గుర్తులు హాట్ టాపిక్ గా మారాయి. మునుగోడు, జహీరాబాద్‌, సిర్పూర్‌, డోర్నకల్‌ లో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రోడ్‌ రోలర్‌ గుర్తుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థికి సీపీఎం, బీఎస్పీ అభ్యర్థులకంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌ లో కెమెరా గుర్తుకు ఊహించని విధంగా ఓట్లు పడ్డాయి. అంటే ఆయా గుర్తులను పోల్చి చూసే క్రమంలో ఓటర్లు తికమకకు గురవుతున్నారనేది వాస్తవం. ప్రధాన పార్టీలకు పడాల్సిన ఓట్లు కొన్ని సందర్భాల్లో స్వతంత్రులకు పడుతున్నాయి. దీనివల్ల గెలుపు ఓటములు ప్రభావితం అవుతున్నాయి. అందుకే వీటిని మునుగోడు ఉప ఎన్నిక గుర్తుల జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ ని టీఆర్ఎస్ నేతలు కోరారు.

బండిపై ఫిర్యాదు..

మునుగోడులో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కూడా.. క్షుద్రపూజల వంటి వ్యాఖ్యలు చేసి ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బండి సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, మునుగోడు ప్రచారానికి రాకుండా బండిని నిషేధించాలన్నారు. క్షుద్ర పూజల వ్యాఖ్యలతో ఆయన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు టీఆర్ఎస్ నేతలు.

Tags:    
Advertisement

Similar News