ముగ్గురు అభ్యర్థులూ మున్నూరు కాపులే.. కరీంనగర్ ఓటెవరికో మరి?
కరీంనగర్ నియోజకవర్గంలో 3.40 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో మున్నూరు కాపు, ముస్లిం ఓట్లే లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. గతంలో వెలమలు గెలిచిన ఈ నియోజకవర్గాన్ని మూడు దఫాలుగా మున్నూరు కాపులు గెలుస్తున్నారంటే మున్నూరు కాపుల ప్రభావం ఇక్కడ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
సామాజిక సమీకరణాలు మన ఎన్నికల్లో అత్యంత కీలకం. అందుకే పార్టీలు కూడా కులాల లెక్కలు పక్కాగా వేసుకుని టికెట్లిస్తుంటాయి. ఒక పార్టీ ఓ కులానికి టికెట్ ఇస్తే ప్రత్యర్థి పార్టీ మరో బలమైన వర్గం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపుతుంది. కానీ కొన్నిచోట్ల ఒకే సామాజికవర్గం నుంచే ప్రధాన అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశాలూ ఉంటాయి. ఇప్పుడు కరీంనగర్‌లో అదే పరిస్థతి. మూడు ప్రధాన పార్టీలూ మున్నూరు కాపులకే టికెట్లిచ్చాయి. కరీంనగర్‌లో భారీ సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు ఈ ముగ్గురిలో ఎవర్ని అసెంబ్లీకి పంపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
కమలాకర్, బండి సంజయ్, పురమల్ల శ్రీనివాస్
కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి పురమల్ల శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గరూ మున్నూరు కాపులే కావడం గమనార్హం. గంగుల కమలాకర్ ఇప్పటి వరకు ఇక్కడి నుంచి మూడు సార్లు గెలిచారు. ప్రస్తుతం పౌరసరఫరాల మంత్రిగానూ పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో నాలుగోసారి బరిలో నిలిచారు. మరోవైపు బీజేపీ కీలక నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గతంలో రెండుసార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆర్నెల్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలవడం విశేషం. ఇక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ తొలిసారి పోటీ చేస్తున్నారు.
భారీగా మున్నూరు కాపు ఓటర్లు
కరీంనగర్ నియోజకవర్గంలో 3.40 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో మున్నూరు కాపు, ముస్లిం ఓట్లే లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. గతంలో వెలమలు గెలిచిన ఈ నియోజకవర్గాన్ని మూడు దఫాలుగా మున్నూరు కాపులు గెలుస్తున్నారంటే మున్నూరు కాపుల ప్రభావం ఇక్కడ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అయితే మూడుసార్లు గెలిచిన మంత్రి గంగుల కమలాకర్‌కు ఈసారీ ఓటర్లు పట్టం కడతారా? లేదంటే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన బండి సంజయ్‌పై సానుభూతి చూపిస్తారా అనేది తేలాల్సి ఉంది. పోటీ ప్రధానంగా వీరిద్దరి మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే కాంగ్రెస్ గాలి వీస్తే పురమళ్ల శ్రీనివాస్‌కూ అవకాశాల్ని కొట్టిపారేయలేమంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.