అర్ధరాత్రి వీధి కుక్కలను వేటాడింది అందుకట.. - ముగ్గురు నిందితుల అరెస్ట్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌ నగర్‌ మండలం దేవునిపల్లికి చెందిన మంద నర్సింహా రెడ్డి (57) హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లో ఉంటున్నాడు.

Advertisement
Update:2024-03-20 09:02 IST

ఈ ఏడాది ఫిబ్రవరి 15న మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్‌ గ్రామంలో అర్ధరాత్రి వీధి కుక్కలను వేటాడిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తెల్లారేసరికి 20 కుక్కలు మృతిచెంది ఉండగా.. మరికొన్ని బుల్లెట్‌ గాయాలతో ఉండటాన్ని గుర్తించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం బయటపడింది. తమ ఇంట్లో ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కను వీధి కుక్కలు కరిచి చంపాయని నిందితులు అర్ధరాత్రి వేళ ఈ ఘటనకు పాల్పడినట్టు గుర్తించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌ నగర్‌ మండలం దేవునిపల్లికి చెందిన మంద నర్సింహా రెడ్డి (57) హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లో ఉంటున్నాడు. అతనికి ఫలక్‌నుమాకు చెందిన తారీఖ్‌ అహ్మద్‌ (42), మహ్మద్‌ తాహెర్‌ (40) మిత్రులు. నర్సింహారెడ్డి అత్తగారిది అడ్డాకుల మండలం పొన్నకల్‌ గ్రామం. అత్తగారింట్లో డాకుండ్‌ జాతి రకం పెంపుడు కుక్కలున్నాయి. వాటిలో ఒక కుక్కను ఆ గ్రామంలోని వీధి కుక్కలు కరిచి చంపేశాయి. మరో కుక్కను గాయపరిచాయి.

దీంతో వాటిపై కోపం పెంచుకున్న నర్సింహారెడ్డి వాటిని చంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఫిబ్రవరి 15న తన కారులో స్నేహితులతో కలిసి పొన్నకల్‌ వచ్చాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తారిఖ్‌ అహ్మద్‌ వద్ద ఉన్న లైసెన్స్‌ తుపాకీతో గ్రామంలో కనిపించిన కుక్కలన్నింటినీ కాలుస్తూ వెళ్లారు. ఈ ఘటనలో 20 కుక్కలు మృతిచెందాయి. పంచాయతీ కార్యదర్శి విజయ రామరాజు ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు బెంజ్‌ కారులో వచ్చారని గుర్తించారు. తాజాగా పొన్నకల్‌లో దావత్‌ చేసుకునేందుకు నిందితులు ముగ్గురూ అదే కారులో మంగళవారం రాగా.. సమాచారం అందుకున్న పోలీసులు సీఐ ఎస్‌.రామకృష్ణ, ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ నేతృత్వంలో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 0.22 రైఫిల్, 6 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News