తెలంగాణలో టీడీపీ, జనసేన పొత్తు.. ఇదిగో లెక్కలివే.!

తెలంగాణలో తెలుగుదేశం ప్రచార బాధ్యతలను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అప్పగించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్న బాలకృష్ణ పార్టీ అభ్యర్థుల త‌ర‌ఫున‌ ప్రచారం చేయనున్నారు.

Advertisement
Update:2023-10-17 07:41 IST

తెలంగాణలో తెలుగుదేశం, జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని తెలుస్తోంది. తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించగా... 87 స్థానాల్లో పోటీ చేస్తామని తెలుగుదేశం సోమవారం ప్రకటించింది. దీంతో రెండు పార్టీలు కలిసి మొత్తం తెలంగాణలోని 119 స్థానాలకు పోటీ చేస్తాయని సమాచారం. ఇప్పటికే జనసేన 32 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను సైతం నియమించింది. ఇక మిగిలిన 87 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను రెడీ చేస్తోంది. తెలుగుదేశం అభ్యర్థుల జాబితాను రాజమండ్రి జైలులో ఉన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలించి ఓకే చేయాల్సి ఉంది. అటు ఏపీలో పొత్తు ప్రకటించిన తెలుగుదేశం, జనసేన.. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని భావిస్తున్నాయి. అయితే ఈ అంశంపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఇక తెలంగాణలో తెలుగుదేశం ప్రచార బాధ్యతలను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అప్పగించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్న బాలకృష్ణ పార్టీ అభ్యర్థుల త‌ర‌ఫున‌ ప్రచారం చేయనున్నారు. చంద్రబాబు నాయుడు జైలులో ఉండడంతో పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటుంది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్‌ పార్టీ బాధ్యతలను తన భుజాన వేసుకునే పరిస్థితి కనిపించడం లేదు.

తెలుగుదేశం, జనసేన ఏపీలో కలిసే పోటీ చేయాలని నిర్ణయించగా.. బీజేపీ మాత్రం పొత్తు విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి.. అక్కడి బీజేపీ నేతలు తెలుగుదేశం, జనసేనతో కలిసి పోటీ చేసేందుకు ఇష్టపడుతున్నారని సమాచారం. అయితే పొత్తులపై తేల్చాల్సింది అధిష్టానమే కావడంతో.. ఢిల్లీ పెద్దల నిర్ణయం కోసం రాష్ట్ర నేతలు ఎదురుచూస్తున్నారు.

ఇక తెలంగాణలో అటు తెలుగుదేశంతో కానీ.. ఇటు జనసేనతో కానీ కలిసి పోటీ చేసేందుకు బీజేపీ నేతలు మొదటి నుంచి ఆసక్తి కనపరచడం లేదు. తెలంగాణలో ఇప్పటికీ అక్కడక్కడ కొంతబలమున్న టీడీపీ.. జనసేన కలిసి పోటీ చేస్తే అధికార పార్టీకి మేలు జరుగుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే బీఎస్పీ, వైఎస్సాఆర్‌టీపీ లాంటి పార్టీలు బరిలో ఉన్నాయి. దీంతో వ్యతిరేక ఓటు భారీగా చీలి అధికార పార్టీ లాభపడుతుందనేది విశ్లేషకుల అంచనా.

Tags:    
Advertisement

Similar News