తీన్మార్‌ మల్లన్న కొత్త పార్టీ.. నోటిఫికేషన్‌ జారీ చేసిన ఈసీ

వీలైనంత త్వరగా ఎలక్షన్ కమిషన్‌ ఫార్మాలిటీస్‌ పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తీన్మార్ మల్లన్న. తెలంగాణలో వైద్యం, విద్య మెరుగుపరచడమే తమ లక్ష్యమని చెప్పారు.

Advertisement
Update:2023-09-08 12:53 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు స్వీకరించిన ఎన్నికల కమిషన్‌.. పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే ఈనెల 20లోగా తెలియజేయాలని నోటిఫికేషన్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ కోరుకునే పార్టీ.. అది ఏర్పడిన 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారు 30 రోజుల్లోపు బహిరంగ నోటీసును జారీ చేయాలి. ఈ మేరకు మల్లన్న పార్టీ కూడా ఆగస్టు 25న బహిరంగ ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం తెలంగాణలో గుర్తింపు పొందిన ఆరు జాతీయ పార్టీలతో పాటు నాలుగు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మరో 107 రిజిస్టర్ అయి గుర్తింపు పొందని పార్టీలు కూడా ఉన్నాయి. కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే 70కి పైగా పార్టీలు రిజిస్టర్ అయినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం లెక్కలు చెప్తున్నాయి.

వీలైనంత త్వరగా ఎలక్షన్ కమిషన్‌ ఫార్మాలిటీస్‌ పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తీన్మార్ మల్లన్న. తెలంగాణలో వైద్యం, విద్య మెరుగుపరచడమే తమ లక్ష్యమని చెప్పారు. సత్వర న్యాయం, ప్రజాప్రతినిధుల రీకాలింగ్‌కు తమ పార్టీ మద్దతిస్తుందన్నారు. మేడ్చల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు మల్లన్న. తెలంగాణలోని అన్ని స్థానాల్లో తెలంగాణ నిర్మాణ పార్టీ బరిలో ఉంటుందన్నారు. వ్యతిరేక ఓటు చీలితే అది తమ బాధ్యత కాదని.. ప్రతిపక్షాలను గెలిపించేందుకు తాము ఇక్కడ లేమన్నారు మల్లన్న. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందన్నారు. పార్టీ ఎజెండా అమలుపైనే దృష్టి సారిస్తామన్నారు. ఏ పార్టీ అయినా పొత్తు కోసం ముందుకు వస్తే ఆలోచిస్తామని చెప్పారు. ఇక తెలంగాణ నిర్మాణ పార్టీని ఎం.రజినీ కుమార్‌ కార్యదర్శిగా, ఆర్‌.భావన కోశాధికారిగా రిజిస్టర్ చేశారు. ఇక ఏపీలోనూ కృష్ణా జిల్లా కంచికచర్ల కేంద్రంగా తెలుగు రాజ్యాధికార పార్టీ అనే కొత్త పార్టీ కోసం కూడా ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.

*

Tags:    
Advertisement

Similar News