ప్రభుత్వ హామీతో తెలంగాణ రేషన్ డీలర్లు ఫుల్ హ్యాపీ..
సీఎం కేసీఆర్ పై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ సమ్మె ప్రతిపాదన విరమించారు తెలంగాణ రేషన్ డీలర్లు.
సమస్యల పరిష్కారం కోసం జూన్-5 నుంచి సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన తెలంగాణ రేషన్ డీలర్లు ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. 22 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచగా అందులో 20 సమస్యలకు పరిష్కారం లభించింది. వారం రోజుల్లో వీటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. చర్చలు సఫలం కావడంతో సమ్మె ప్రతిపాదన విరమిస్తున్నట్లు రేషన్ డీలర్ల జేఏసీ ప్రకటించింది.
ప్రజలకు నిత్యావసర సరకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వంతోపాటు రేషన్ డీలర్లకు కూడా ఉందని గుర్తు చేశారు మంత్రి గంగుల కమలాకర్. పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం ఓ సామాజిక బాధ్యత అని చెప్పారు. ఆ బాధ్యతను విస్మరించి రేషన్ బియ్యం పంపిణీకి ఆటంకం కలిగించేలా రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడం బాధాకరమన్నారాయన. డీలర్ల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సానుకూలంగా స్పందించారు. 20 డిమాండ్లను నెరవేర్చే విషయంలో ప్రభుత్వం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి గంగుల.
రేషన్ డీలర్ల గౌరవ వేతనం, కమీషన్ పెంపు సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మంత్రి గంగుల. సీఎం కేసీఆర్ పై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ సమ్మె ప్రతిపాదన విరమించారు తెలంగాణ రేషన్ డీలర్లు.