రాష్ట్రంపై చేసిన విమర్శలకు 'తెలంగాణ ప్రగతిపథం' సమాధానమిస్తుంది : సీఎం కేసీఆర్
వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన అభివృద్ధి.. ఇప్పుడు దేశానికే మార్గదర్శిగా నిలుస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎంతో మంది ఎన్నో రకాల విమర్శలు చేశారు. మన పాలనా సామర్థ్యాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అలాంటి వారికి 'తెలంగాణ ప్రగతి పథం' సరైన సమాధానాలు ఇస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రూపొందించిన 'తెలంగాణ ప్రగతి పథం' కాఫీ టేబుల్ బుక్‌ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..
రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే దేశానికే తలమానికంగా నిలవడం అంత తేలికైన విషయం కాదని అన్నారు. వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన అభివృద్ధి.. ఇప్పుడు దేశానికే మార్గదర్శిగా నిలుస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి శిఖరాలకు చేరుకున్నతీరు యావత్ భారత దేశమే తెలంగాణ వైపు చూసేలా చేసిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు ఈ పుస్తకం చదవడం ద్వారా.. 10 ఏళ్ల తెలంగాణ అభివృద్ది ఏంటో పూర్తిగా తెలుసుకోవచ్చని చెప్పారు. విమర్శకుల నోళ్లు మూయించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని అన్నారు.
తెలంగాణలోని నీటి పారుదల శాఖ, పరిశ్రమల శాఖ, వైద్యారోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ, పట్టణాభివృద్ది శాఖ, ఐటీ శాఖ, ఆర్థిక శాఖకు సంబంధించిన పలు ప్రగతి వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. తొలుత ఇంగ్లీషులో విడుదలైన ఈ పుస్తకాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ తెలుగు విభాగం కోఆర్డినేటర్ సువర్ణ వినాయక్, భాషా విభాగం సభ్యులు సంబరాజు రవిప్రకాశ్, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌లు తెలుగులోకి అనువదించారు. వారిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.