వైభవంగా యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు
లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.;
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 3వ రోజు స్వామి వారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి శేష వాహన సేవలో తిరుమాఢ వీధుల్లో ఊరేగారు. సాయంత్రం నిత్యహోమం, చతు స్థానార్చనలు నిర్వహించారు. వైకుంఠంలో స్వామివారికి నిరంతరం సేవా కైంకర్యాలు చేసిన వ్యక్తి అనంతుడు. అతనే ఆది శేషు. అలాంటి ఆదిశేషుడిలో ప్రవాసుదేవుడిలా స్వామివారిని అలంకరించి ఆస్థానం చేశారు. వేదాలు, పురాణాలతో ప్రార్థించారు. భక్తజన బాంధవుడు లక్ష్మీనారసింహుడు ప్రీతిపాత్రమైన శేష వాహనుడిపై తిరు మాఢ వీధుల్లో ఊరేగారు.
బ్రహ్మోత్సవ శుభరాత్రుల్లో యాదగిరిగుట్ట కొండపై జ్వాలాకృతిలో సర్పాకారంలో వెలసిన స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆదిశేష వాహనాన్ని భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఇవాళ మూడవ తేదీన సాయంత్రం 6.30 గంటలకు బేగి ఊరేగింపు, దేవతాశ్రయణం, హవనం ఉంటుంది. మార్చి 4వ తేదీన ఉదయం 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేద పారాయణ ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు శేష వాహన సేవలు ఉంటాయి. మార్చ్ 5వ తేదీన ఉదయం 9 గంటలకు కూర్మావతార అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ ఉంటాయిని ఆలయ అధికారులు తెలిపారు.